ఓఎల్ ఎక్స్ బేరంలో జాగ్రత్త సుమా

Update: 2016-01-28 19:30 GMT
 వాడిన ఫోన్లను ఆన్ లైన్లో విక్రయించేందుకు మంచి వేదికగా మారిన ఓఎల్ ఎక్స్ ను వేదికగా చేసుకుని దొంగలూ రెచ్చిపోతున్నారు. దొంగతనంగా అక్కడా ఇక్కడా ఫోన్లు కొట్టేసి పారిపోవడం కంటే దొరలా వెళ్లి దర్జాగా కొట్టేయడం నేర్చారు దొంగలు. ఇందుకోసం వారు ఓఎల్ ఎక్స్ లో విక్రయానికి పెట్టే ఖరీదైన ఫోన్లను ఎంచుకుంటున్నారు. అలా ఖరీదైన ఫోన్లను పెట్టిన వారిని సంప్రదించి వారున్న ప్రాంతానికి సమీపంలోనే తామున్న చోటికి వారిని రప్పించుకుని ఫోన్ చూస్తున్నట్లుగా నటించి ఒక్కసారిగా ఉడాయిస్తున్నారు. దీంతో ఫోన్ల యజమానులు నష్టపోతున్నారు. ఇటీవల హైదరాబాదులో ఇలాంటి మోసాలు బాగా పెరిగిపోయాయి. తాజాగా ఖైరతాబాద్ లో ఇలాగే జరగ్గా బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఇలాంటి దొంగలు కొందరు దొరికారు.

పాతబస్తీకి చెందిన అమీర్ అనే ఇరవయ్యేళ్ల యువకుడు ఇంటర్మీడియట్ తప్పి టైలరుగా పనిచేస్తున్నాడు. రహీం అనే మరో మిత్రుడితో కలిసి ఓఎల్ ఎక్స్ లో పెట్టే ఫోన్లను కొట్టేసేందుకు పథకం పన్నాడు. ఇంతవరకు అలా 11 ఫోన్లను ఎత్తుకెళ్లారు. రీసెంటుగా ఖైరతాబాద్ కు చెందిన విశ్వేశ్వర్ అనే వ్యక్తి అమెరికా నుంచి తెప్పించిన ఖరీదైన యాపిల్ ఫోన్ ను ఓఎల్ ఎక్స్ లో అమ్మాకానికి పెట్టారు. దాంతో అమీర్ - రహీంలు ఇద్దరూ కలిసి అది కొట్టేయాలని ప్లాన్ చేశారు. విశ్వేశ్వర్ కు ఫోన్ చేసి ఆ ఫోన్ కొంటామని.. ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ వద్ద కలిస్తే బేరం మాట్లాడుకుందామని పిలిచారు. విశ్వేశ్వర్ అక్కడికి వెళ్లి వారిని కలవగా ఫోన్ చూస్తున్నట్లుగా నటించి ఒక్కసారిగా ఉడాయించారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెతికి నిందితులను పట్టుకున్నారు. వారు చెప్పింది విని పోలీసులే షాకయ్యారు. ఇంతవరకు నగరంలోని వేర్వేరు ప్రాంతాలో్ల ఇలా 11 ఫోన్లను కొట్టేసి అబ్దుల్లా అనే దుకాణ యజమానికి విక్రయిస్తున్నారు. మొత్తం ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కాబట్టి ఓఎల్ ఎక్స్ లో ఫోన్లు అమ్మకానికి పెట్టినా కొనడానికి వచ్చేవారితో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది.
Tags:    

Similar News