మళ్లీ ఫారిన్ ట్రిప్పులేయనున్న మోడీ

Update: 2017-04-20 07:07 GMT
విదేశీ పర్యటనలకు పేరుగాంచిన ప్రధాని నరేంద్ర మోడీ కొద్దికాలంగా దేశంలోనే ఉంటున్నారు.. వరుసగా రాష్ర్టాల ఎన్నికలు - ఇతర దేశాల నేతల పర్యటనల కారణంగా మోడీ కొద్దికాలంగా దేశంలోనే ఉంటున్నారు. ప్రస్తుతం మళ్లీ ఆయన విదేశాలకు వెళ్లనున్నారు. మే 12 నుంచి జులై మధ్య వరుస పర్యటనలు ఉన్నాయి.
    
మే 12న మొదలయ్యే శ్రీలంక పర్యటన నుంచి ఆయన విదేశీ యానం షెడ్యూల్ ప్రారంభమవుతుంది. ఆ తరువాత అమెరికా - ఇజ్రాయెల్‌ - రష్యా - జర్మనీ - స్పెయిన్‌ - కజికిస్థాన్‌ దేశాలలో పర్యటించనున్నారు. ఈ మేరకు ప్రధాని షెడ్యూల్ ఖరారైంది.

* మే 12వ తేదీ నుంచీ 14వ తేదీ వరకు ప్రధాని శ్రీలంకలో పర్యటించనున్నారు. అక్కడ జరిగే ఐక్యరాజ్యసమితి వేసక్‌ దినోత్సవాలతో పాటు అంతర్జాతీయ బౌద్ధ సమ్మేళనంలో కూడా పాల్గొననున్నారు.

* జూన్‌ 1వ తేదీ నుంచీ 3వ తేదీ వరకు రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌ లో మోదీ పర్యటించనున్నారు. అక్కడ నిర్వహించనున్న సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌ అంతర్జాతీయ ఆర్థిక వేదిక సమావేశాల్లో పాల్గొంటారు.

* జూన్‌ 7, 8వ తేదీల్లో కజకిస్థాన్‌ లో జరిగే ‘షాంఘై సహకార సంస్థ’ సమావేశాల్లో పాల్గొంటారు. ఈ సమావేశానికి చైనా ప్రధాన మిత్రదేశమైన పాకిస్థాన్ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కూడా హాజరుకానున్నట్టు సమాచారం.

* జులై 7, 8 తేదీల్లో జర్మనీలోని హాంబర్గ్‌ లో జరగనున్న జీ-20 దేశాల శిఖరాగ్ర సదస్సుకు హాజరుకానున్నారు.

* అమెరికా - ఇజ్రాయెల్‌ లలో ప్రధాని పర్యటనకు సంబంధించి తేదీలు ఖరారు కావాల్సి ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News