అటు టీడీపీని ఇటు కాంగ్రెస్‌ను ఒకేసారి.. బీజేపీ ఎంపీల‌కు మోడీ గైడెన్స్‌!

Update: 2021-12-16 04:29 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టీడీపీతో బీజేపీ మ‌ళ్లీ పొత్తు పెట్టుకుంటుందా? ఆ దిశ‌గా చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయా? ఇటు తెలంగాణ‌లో బీజేపీ, కాంగ్రెస్ క‌లిసిపోయాయ‌ని టీఆర్ఎస్ చేస్తున్న ఆరోప‌ణ‌ల్లో నిజ‌మెంత‌? ఈ ప్రశ్న‌ల‌కు ఇప్పుడు ఒక్క స‌మావేశంతో స‌మాధానం వ‌చ్చింద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ ఎంపీల‌తో స‌మావేశ‌మైన ప్ర‌ధాని మోడీ ఈ రెండు రాష్ట్రాల్లోనే ఒంట‌రిగానే సాగాల‌ని సూచించిన‌ట్లు స‌మాచారం. రెండు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీల‌కు పోటీనిచ్చేలా బీజేపీ మారాల‌ని మోడీ మార్గ‌నిర్దేశ‌నం చేసిన‌ట్లు తెలిసింది.

తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల‌పై మోడీ ప్ర‌త్యేక దృష్టి పెట్టిన‌ట్లు క‌నిపిస్తోంది. తాజాగా ఆయ‌న త‌న నివాసంలో క‌ర్ణాట‌క‌, తెలంగాణ‌, ఏపీ చెందిన త‌న పార్టీ ఎంపీల‌కు అల్పాహార విందు ఇచ్చారు. అందులో భాగంగానే తెలంగాణ‌, ఏపీకి బీజేపీ ఎంపీల‌తో ఆయ‌న స‌మావేశ‌మ‌య్యారు. కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డితో స‌హా తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ఎంపీలు ఆ స‌మావేశానికి హాజ‌రయ్యారు.

ఈ సంద‌ర్భంగా ఈ రాష్ట్రాల్లో పార్టీ అంచ‌నాలు భ‌విష్య‌త్ వ్యూహాల‌పై ఎంపీల‌కు మోడీ దిశా నిర్దేశం చేసిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను, కార్య‌క్ర‌మాల ప్ర‌యోజ‌నాల‌ను విస్త్రతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని ఆయ‌న సూచించార‌ని తెలిసింది.

తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌తిప‌క్షం టీడీపీ ప‌ట్టు కోల్పోతున్న నేప‌థ్యంలో ఈ రాష్ట్రాల్లో పార్టీని బ‌లోపేతం చేసి రాజ‌కీయ ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా బీజేపీ ఎద‌గాల‌ని మోడీ స్ప‌ష్టం చేశారు. రెండు రాష్ట్రాల్లోనూ ఉన్న అవ‌కాశాల‌ను అందిపుచ్చుకోవాల‌ని మోడీ సూచించారు.

అందుకు కేంద్ర ప్రభుత్వం, పార్టీ అధిష్ఠానం త‌ర‌పున పూర్తి స‌హాయ స‌హ‌కారాలు అందిస్తామ‌ని ఆయ‌న భ‌రోసా ఇచ్చిన‌ట్లు తెలిసింది. ఇప్ప‌టికే తెలంగాణ‌లో బీజేపీ దూకుడు మీదుంది.

ఇక ఏపీలోనే ఆ పార్టీ వేగం అందుకోవాల్సి ఉంది. అందుకు వీలుగా అక్క‌డ పార్టీ బ‌లోపేతం కోసం నియోజ‌క‌వ‌ర్గ స్థాయి నుంచి కౌన్సిల్ ఏర్పాటు చేస్తూ పార్టీ నిర్ణ‌యం తీసుకుంది. అదే విధంగా వైసీపీ ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌కు వ్య‌తిరేకంగా ఈ నెల 28న విజ‌య‌వాడ‌లో భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించాల‌ని ఏపీ బీజేపీ నిర్ణ‌యించింది. ఈ స‌భ‌కు కేంద్రమంత్రుల‌ను ఆహ్వానించ‌నున్నారు.

ఇక తెలంగాణ‌లోనూ పార్టీ మ‌రింత దూకుడుతో సాగేలా చ‌ర్య‌లు తీసుకోనున్నారు. పార్ల‌మెంట్ స‌మావేశాలు ముగిసిన త‌ర్వాత తెలంగాణ‌లో పార్టీ ప‌రంగా చేయాల్సిన మార్పులు ప‌ద‌వుల‌పైన నిర్ణ‌యాలు తీసుకోనున్న‌ట్లు స‌మాచారం.

ప్ర‌ధానితో ఎంపీల స‌మావేశం త‌ర్వాత ఇక ఏపీలో టీడీపీతో బీజేపీ పొత్తు ఉండ‌ద‌నే విష‌యంపై ఓ స్ప‌ష్ట‌త వ‌చ్చింది. ఎందుకంటే అక్క‌డ టీడీపీ స్థానాన్ని భ‌ర్తీ చేసేందుకు బీజేపీ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇక తెలంగాణ‌లోనూ టీఆర్ఎస్‌కు ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ఎదిగేందుకు పావులు కదుపుతోంది.
Tags:    

Similar News