మోడీ సర్కారు కొత్త వ్యూహం.. చైనాకు చెక్ పెట్టే కొత్త డీల్స్

Update: 2020-09-10 07:15 GMT
చైనా తీరు.. ఆ దేశ సరిహద్దుల్లో ఉన్న దేశాలకే కాదు.. ప్రపంచంలోని పలు దేశాలకు కొత్త చిరాకును తెప్పిస్తోంది. అవసరం లేకున్నా కయ్యానికి కాలు దువ్వటమే కాదు.. అన్నింటా తన పట్టు మాత్రమే ఉండాలన్న తీరు పలు విమర్శలకు తావిస్తోంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరుతో ఇతర ఖండాలకు సైతం రహదారులు నిర్మిస్తున్న చైనా.. సముద్ర జలాల మీదా పట్టు సాధించేందుకు తహతహలాడుతోంది.

ఇందులో భాగంగా తనకున్న ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టటం లేదు. డ్రాగన్ తీరుతో గుర్రుగా ఉన్న కొన్ని దేశాలు చేతులు కలిపి ఉమ్మడి నిర్ణయాలు తీసుకునేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అలాంటి పరిస్థితే చోటు చేసుకుంది. డ్రాగన్ దూకుడుకు కళ్లెం వేసేందుకు తొలిసారి భారత్ - ఫ్రాన్స్ - ఆస్ట్రేలియాలు ఏకం కావటమే కాదు.. కొత్త ఒప్పందాలు చేసుకుంటున్నారు.

తాజాగా ఈ మూడు దేశాల విదేశాంగ శాఖల ముఖ్య అధికారుల మధ్య త్రైపాక్షిక చర్చలు జరిగాయి. ఇండో - పసిఫిక్ రీజియన్ లో పరస్పరం సహకరించుకునే దిశగా మూడు దేశాలు కలవటం ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కాన్ఫరెన్సులో ఇండో - పసిఫిక్ ప్రాంతంలో మూడు దేశాలు పరస్పర సహకరించుకోవాలని నిర్ణయించాయి. అంతేకాదు.. ఈ రీజియన్ లో శాంతి.. సుస్థితర.. అంతర్జాతీయ నియమాల పాలన సజావుగా సాగేలా కృషి చేయాలన్న నిర్ణయానికి వచ్చాయి. అంతేకాదు.. రానున్న రోజుల్లో ఈ కూటమిని మరింత విస్తృతం చేసే దిశగానూ అడుగులు వేయాలని భావిస్తున్నారు. జరుగుతున్న పరిణామాలు చైనాకు మింగుడుపడవని చెప్పక తప్పదు.
Tags:    

Similar News