అహంకారం గురించి నువ్వా మాట్లాడేది మోడీ?

Update: 2018-05-09 08:47 GMT
మోడీకి కోపం వ‌చ్చింది. నిజ‌మే.. కోపం వ‌చ్చిన‌ప్పుడు.. చిరాకు వ‌చ్చిన‌ప్పుడు మ‌నిషిలో బ్యాలెన్స్ మిస్ అవుతుంది. అది ఉత్త మ‌నిషి అయినా.. వ్య‌క్తిత్వ వికాస నిపుణుడిగా స్పీచులిచ్చే మోడీ అయినా ఒక‌టే. అదే విష‌యం తాజాగా రుజువైంది కూడా. ఎనిమిది నెల‌ల క్రితం తాను ప్ర‌ధాని కావాల‌న్న ఆశ‌ను విదేశీ వేదిక మీద చెప్పిన కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ.. తాజాగా క‌ర్ణాట‌క ఎన్నిక‌ల నేప‌థ్యంలో విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చెప్పారు. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌ర్వాత తాను ప్ర‌ధాని కావాల‌న్న ఆకాంక్ష‌ను రాహుల్ వ్య‌క్తం చేశారు.

ఇలా చెప్పటం ప్ర‌ధాని మోడీకి అస్స‌లు న‌చ్చలేదు. ప్ర‌ధాని ప‌ద‌విని చేప‌ట్టేందుకు రాహుల్ సిద్ధ‌మ‌ని చెప్ప‌టంపై ఆయ‌న తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. రాహుల్ మాట‌లు ఆయ‌న ఆహంకారానికి నిద‌ర్శ‌నంగా మండిప‌డ్డారు. రాహుల్ ప‌రిణితి లేని నాయ‌కుడ‌ని.. క‌నీస గౌర‌వ మ‌ర్యాద‌లు కూడా తెలీవంటూ ఫైర్ అయ్యారు.

ఎందుకింతగా తాను తిట్టేస్తున్న విష‌యానికి మోడీ త‌న‌దైన రీతిలో వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ఇంత‌కీ మోడీ సాబ్ చెప్పిందేమిటో తెలుసా?  కాంగ్రెస్ పార్టీలో అపార అనుభ‌వం ఉన్న నాయ‌కులు ఎంతోమంది ఉన్నార‌ని.. అయినా తానే ప్ర‌ధానిని అవుతాన‌ని రాహుల్ చెప్ప‌టం ఏమిటి? ఇది ముమ్మాటికి అహంకార‌మే త‌ప్పించి మ‌రొక‌టి కాద‌ని తేల్చేశారు. ప్ర‌ధానిగా రాహుల్ ను ప్ర‌జ‌లు ఎట్టి ప‌రిస్థితుల్లో అంగీక‌రించ‌ర‌ని చెప్పేశారు.

నిజ‌మే.. మోడీ లాంటి మేధావి మ‌రీ ఇంత అల్పంగా మాట్లాడ‌టం ఏమిట‌న్న సందేహం రావొచ్చు. కానీ.. ప‌ద‌విలోకి వ‌చ్చిన త‌ర్వాత ఆ ప‌ద‌వి ప‌ట్ల పెరిగే వ్యామోహం ఈ త‌ర‌హా మాట‌ల్నే మాట్లాడేలా చేస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అదెలానంటే.. ఇన్ని నీతులు చెప్పే మోడీ.. బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ అనే పెద్దాయ‌న ఉన్నార‌ని.. ఆయ‌న్ను కాద‌ని మ‌రీ తాను ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌విని స్వీక‌రించిన వైనాన్ని మ‌ర్చిపోయారు.

ప్ర‌ధాన మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌క‌పోతే ఇవ్వ‌క‌పోయారు?  త‌న‌కు రాజ‌కీయ భిక్ష పెట్టిన గురువుకు పంగ‌నామాలు పెట్టేలా చేశారే త‌ప్పించి ఆయ‌న‌కు మోడీ చేసిందేమీ లేద‌న్న‌ది అంద‌రికి తెలిసిందే. ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌విని చేప‌ట్ట‌లేక‌పోయిన అద్వానీకి రాష్ట్రప‌తి ప‌ద‌విని క‌ట్ట‌బెడితే బాగుంటుంద‌ని దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున అనుకున్న వైనాన్ని మ‌ర్చిపోకూడ‌దు. అంతేనా.. చివ‌ర‌కు ఎన్డీయేలో భాగ‌స్వామ్యం కాని పార్టీలు సైతం అద్వానీని రాష్ట్రప‌తిగా చేసేందుకు త‌హ‌త‌హ‌లాడాయి. ఆయ‌న ఆ కుర్చీలో కూర్చుంటే బాగుంటుంద‌ని భావించాయి. కానీ.. ఏ ఉద్దేశంతో అద్వానీకి ఆ అవ‌కాశం ఇవ్వ‌లేదో మోడీ చెప్పాలి. తాను చేసిన ప‌నుల గురించి వ‌దిలేసి.. ఎదుటోడికి నీతులు చెప్పే చిన్న‌త‌ర‌హా రాజ‌కీయ నాయ‌కుడిగా మారిన మోడీ.. ఈ రోజున రాహుల్ ను ఉద్దేశించి తిట్టేస్తే అవి అతికేలా ఉండ‌వ‌న్న విష‌యాన్ని మోడీకి ఆయ‌న ప‌రివారం స‌ల‌హా ఇస్తే బాగుంటుంది. లేని ప‌క్షంలోఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేసి.. త‌న ప‌రువును తానే పోగొట్టుకునే ప్ర‌మాదం ఉంద‌న్న‌ది మోడీ మ‌ర్చిపోకూడ‌దు.


Tags:    

Similar News