స్వ‌చ్ఛ భార‌త్‌ పై మోడీ ట్వీట్ డౌట్లు పుట్టిస్తోందిగా

Update: 2017-11-19 07:56 GMT
వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ చేసిన ట్వీట్ ఆసక్తిక‌ర చ‌ర్చ‌కు దారితీసింది. బ‌హిరంగ మల విసర్జన వద్దని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. దేశం మొత్తం బహిరంగ మలవిసర్జన రహితంగా మార్చేందుకు ప్రతి గ్రామంలో - ప్రతి ఇంట్లో టాయిలెట్లు నిర్మించుకోవాలని ట్వీట్‌ లో మోడీ కోరారు. అయితే ప్ర‌పంచ టాయిలెట్ దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీ మాన‌స పుత్రిక అయిన స్వ‌చ్ఛ భార‌త్‌ పై విస్మ‌య‌క‌ర‌మైన వివ‌రాల‌తో నివేదిక వెలువ‌డింది. దేశంలో స్వచ్ఛ భారత్ నినాదం ఉత్తుత్తిదే అవుతోందని విమ‌ర్శ‌కులు అంటున్నారు. ప్రపంచంలో రెండో అతి జనాభా దేశం భారత్‌లో ప్రజలకు సరైన పారిశుద్ధ సౌకర్యాలు లేవు. ప్రత్యేకించి మరుగుదొడ్ల ఏర్పాట్లు లేవు. ఈ విషయం ఒక ప్రపంచ స్థాయి నివేదికలో వెల్లడైంది. కనీస పారిశుద్ధ సౌకర్యాల కల్పనలో భారతదేశం పరిస్థితి దయనీయంగా ఉందని ఈ నివేదికలో స్పష్టం చేశారు.

వాటర్ ఎయిడ్స్ స్టేట్ ఆఫ్ ది వరల్డ్ టాయ్‌లెట్స్ 217 నివేదికలో సంచ‌ల‌న నిజాలు వెల్ల‌డించారు.  వాటర్ ఎయిడ్ సంస్థ వారు ప్రభుత్వం నుంచి అందిన గణాంకాలనే త‌మ‌ నివేదికకు ఆధారంగా తీసుకోగా..అందులో ఆశ్చ‌ర్య‌క‌ర అంశాలు వెలుగులోకి వ‌చ్చాయి. క్లీన్ ఇండియా పథకం కొంత పురోగతిని సాధించినా ఇప్పటికీ దేశంలో 73 కోట్లకు పైగా ప్రజలు బహిరంగ మలమూత్ర విసర్జన లేదా అపరిశుభ్ర మరుగుదొడ్ల వినియోగానికి పాల్పడుతున్నారు. దైనందిన జీవితక్రమంలో అత్యంత కీలకమైన ప్రక్రియ దుర్భర పరిస్థితుల నడుమ సాగించాల్సి వస్తోంది. భయాందోళన - అపరిశుద్ధ వాతావరణం నడుమ బహిరంగ విసర్జన పరిస్థితి ఉందని నివేదికలో తెలిపారు. ప్రత్యేకించి మహిళలు - బాలికలకు ఈ బహిరంగ విసర్జన పరిస్థితి దారుణ పరిస్థితిని కల్పిస్తోంది. ఒళ్లు గగుర్పాటు కల్గించే రీతిలో దేశంలో ఇప్పటికీ దాదాపు 36 కోట్ల మంది మహిళలు - యుక్తవయస్సుకు వచ్చే బాలికలు మరుగుదొడ్డి ప్రవేశానికి తమ వంతు కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది. మరుగుకు పొయ్యేందుకు కూడా వీల్లేని బంధనాలతో సతమతం అవుతున్నారు. కనీస రక్షణ ఉంటుందని మరుగుదొడ్ల వద్ద క్యూ కట్టే భారతీయ మహిళలు - బాలికలందరినీ క్యూలో నిలబెడితే ఈ వరుస ఏకంగా ప్రపంచాన్ని అంతటిని నాలుగు సార్లు చుట్టేసినంత భారీ స్థాయిలో ఉంటుంది.

ఔట్ ఆఫ్ ఆర్డర్ శీర్షికతో వెలువడిన ఈ నివేదిక‌లో 2014 అక్టోబర్ నుంచి నవంబర్ 2017 మధ్యకాలంలో దేశంలో దాదాపు 5 కోట్ల 20 లక్షల మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందని తెలిపారు. కనీస పారిశుద్ధ కల్పన జాబితాలో బహిరంగ విసర్జన తగ్గింపు దేశాల జాబితాలో భారతదేశం తొలి పదిదేశాల వరుసలో చోటుదక్కించుకుంది. అయితే ఇప్పటికీ పారిశుధ్య పరిస్థితి ఎక్కడేసిన చెత్త అక్కడే అనే చందంగానే ఉందని గణాంకాలతో వెల్లడైంది. సరైన పారిశుద్ధ సౌకర్యాలు లేని దేశాలలో భారత్ తరువాతి స్థానంలో చైనా ఉంది. అక్కడ దాదాపు 35 కోట్ల మంది ప్రజలకు సరైన మరుగుదొడ్ల ఏర్పాట్లు లేవు. అయితే 2000 సంవత్సరం నుంచి పారిశుద్ధ కల్పనలో గణనీయంగా పురోగతి సాధిస్తూ వస్తోంది.
Tags:    

Similar News