కాంగ్రెస్ ను సంఘ్ ఎంత‌లా పొగిడిందంటే..?

Update: 2018-09-18 05:30 GMT
కొన్నిసార్లు అంతే. ఊహించ‌న‌వి చోటు చేసుకుంటాయి. తాజాగా అలాంటిదే చోటు చేసుకుంది. కాంగ్రెస్ పొడ కూడా గిట్ట‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే సంఘ్ ప‌రివార్ అగ్ర‌నేత మోహ‌న్ భాగ‌వ‌త్ ఆ పార్టీని పెద్ద ఎత్తున ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. అంతేనా.. సంఘ్ ను స్థాపించిన కేబీ హెగ్గెవార్ ఎక్క‌డి నుంచి వ‌చ్చార‌న్న ప్ర‌శ్న వేసి మ‌రీ.. ఆయ‌న‌ది కూడా కాంగ్రెస్ బ్యాక్ గ్రౌండ్ అంటూ పాత విష‌యాల్ని గుర్తుకు తెచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

బీజేపీకి తాము రిమోట్ కంట్రోల‌ర్ లా వ్య‌వ‌హ‌రిస్తామ‌న్న ప్ర‌చారంలో ఏ మాత్రం నిజం లేద‌ని.. తాము ఎవ‌రిపైనా ఎలాంటి ఒత్తిళ్లు తీసుకురామ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఏ సంస్థ పైనా పెత్త‌నం చేయ‌టం త‌మ‌కు ఇష్టం ఉండ‌ద‌ని చెప్పిన ఆయ‌న‌.. క‌మ‌ల‌నాథుల‌కు దిశానిర్దేశం చేసేది సంఘ్ అనే మాట‌లో నిజం లేద‌ని తేల్చి చెప్పారు.

అంద‌రూ అనుకున్న‌ట్లు సంఘ్ నియంతృత్వ సంస్థ ఎంత మాత్రం కాద‌ని.. అదో ప్ర‌జాస్వామ్య‌సంస్థ‌గా అభివ‌ర్ణించిన ఆయ‌న‌.. త‌మ సంస్థ‌లోని ప్ర‌తి కార్య‌క‌ర్తా అభిప్రాయాన్ని నిర్మోహ‌మాటంగా చెబుతార‌ని.. ఎవ‌రిపైనా ఎలాంటి ఆంక్ష‌లు ఉండ‌వ‌న్నారు.

ఎవ‌రి చేతిలో అధికారం ఉంద‌న్న‌ది త‌మ‌కు అన‌వ‌స‌ర‌మ‌ని.. స‌మాజం ఎలా న‌డుస్తోంది? అన్న అంశానికే ఎక్కువ ప్రాధాన్య‌త ఉంటుంద‌న్నారు. ఇటీవ‌ల కాలంలో సంఘ్ కార్య‌క‌లాపాల‌పై విమ‌ర్శ‌లు అంత‌కంత‌కూ పెరుగుతున్న వేళ‌.. అస‌లు సంఘ్ అంటే ఏమిటి? అన్న అంశంపై భ‌విష్య‌త్ భార‌తావ‌ని - ఆర్ ఎస్ ఎస్ దృక్ప‌థం పేరుతో మూడురోజుల కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. దీనికి వివిద వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు.

 సంఘ్ ప్ర‌ధ‌మ క‌ర్త‌వ్యం.. హిందూ స‌మాజాన్ని ఏకం చేయ‌ట‌మేన‌ని.. అంద‌రిని క‌లుపుకుపోవట‌మే త‌మ ల‌క్ష్యంగా పేర్కొన్నారు.  దేశంలో ఉన్న భిన్న‌త్వంలో ఏక‌త్వాన్ని శ్లాఘిస్తూనే ఎవ‌రిప‌ట్లా వివ‌క్ష పాటించ‌కూడ‌ద‌న్న‌దే త‌మ సిద్ధాంత‌మ‌న్న భాగ‌వ‌త్‌.. సంఘ్ సిద్ధాంతాల్ని తాము ఎవ‌రిపైనా రుద్ద‌బోమ‌ని.. హిందువుల‌ను ఏకం చేయ‌ట‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇటీవ‌ల కాలంలో కాంగ్రెస్ నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్న సంఘ్ అనూహ్యంగా ఆపార్టీని పొగ‌డ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. స్వాతంత్రోద్య‌మంలో కాంగ్రెస్ పార్టీ నిర్వ‌హించిన పాత్ర గొప్ప‌ద‌ని.. ఎంద‌రో గొప్ప వ్య‌క్తుల‌ను ఆ పార్టీ దేశానికి అందించింద‌న్నారు. ఇప్ప‌టికి వారు ఆ స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నార‌న్న భాగ‌వ‌త్‌. మాట‌లు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి.
Tags:    

Similar News