బాబు స‌మ‌క్షంలోనే రేవంత్ వ‌ర్సెస్ మోత్కుప‌ల్లి

Update: 2016-06-14 05:40 GMT
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు - ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స‌మ‌క్షంలోనే ఆ పార్టీ తెలంగాణ నేత‌లు ఫిర్యాదులు చేసుకున్నారు. ఏకంగా అస‌లు పార్టీని న‌డిపించేది ఎవ‌రని నేరుగా చంద్ర‌బాబునే ప్ర‌శ్నించే ప‌రిస్థితి వ‌చ్చిందంటే అంత‌ర్గ‌త అస‌హ‌నం ఎక్క‌డి వ‌ర‌కు చేరిందో అర్థం చేసుకోవ‌చ్చు.

హైద‌రాబాద్‌ లోని లేక్‌ వ్యూ అతిథి గృహంలో చంద్రబాబు టీటీడీపీ నేతలతో సమావేశమై పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. ఈ క్ర‌మంలోనే ఒక నాయకుడు పార్టీలో సమన్వయం లోపిస్తున్నదని ప్రారంభించారు. తమకు పార్టీ కార్యక్రమాల గురించి చెప్పే నాధుడే లేరని, ఎవరికి వారే జిల్లా పర్యట‌నలకు వెళుతున్నారని, మీడియా సమావేశాలు నిర్వహించుకుంటున్నారని ఫైర‌య్యారు. తెలంగాణలో పార్టీని నడిపించే నాయకుడు ఎవరు? ఎవరికి వారే పార్టీ కార్యక్రమాలను రూపొందించుకుని జిల్లా పర్యటనలకు వెళుతున్నారు? మేము ఎవరి నాయకత్వంలో పని చేయాలి?# అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. విషయం అర్థం చేసుకున్న చంద్రబాబు స్పందిస్తూ ఇకమీదట అలా జరగకుండా చూస్తానని భరోసా ఇచ్చారు. పార్టీ కార్యాచరణను రూపొందించడం, వాటి గురించి పార్టీ నాయకులకు, ద్వితీయ శ్రేణి నాయకులకు సమాచారం చేరవేసేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీని నియమిస్తానని చెప్పినట్లు సమాచారం. ఇటువంటివి పునరావృత్తం కాకుండా చూడాలని రమణకు - రేవంత్ రెడ్డికి చంద్ర‌బాబు సూచించారు. ఇలా అసంతృప్తి వ్య‌క్తం చేసింది మోత్కుప‌ల్లి న‌ర్సింహులు కాగా టార్గెట్ చేసింది రేవంత్‌ రెడ్డిని అని తెలుస్తోంది.

తెలంగాణలో పార్టీ బలోపేతానికి ‘ముందడుగు’ వేయాలని, ఎవరికీ భయపడేది లేదని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. టీడీపీ బలపడేందుకు  మీరు తరచూ రావాలని, ఎన్నికల వరకూ అప్పుడప్పుడు జిల్లాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తామని ప‌లువురు నేత‌లు బాబును కోరారు. మీరు వస్తేనే పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుల్లో - కార్యకర్తల్లో మనోధైర్యం కలుగుతుందని వారన్నారు. అందుకు చంద్రబాబు ప్రతిస్పందిస్తూ తాను ఎప్పుడైనా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. రాష్ట్ర విభజనకు ముందు తనకు తెలంగాణ-ఆంధ్ర రెండు కళ్ళవంటివని అన్నానని, ఇప్పుడూ అదే చెబుతున్నానని ఆయన తెలిపారు. పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని, నాయకులు పార్టీ కార్యాలయానికి పరిమితం కాకుండా ప్రజల్లోకి వెళ్లాలని ఆయన సూచించారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రభుత్వ వైఫల్యం - సాగు నీరు అందిస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోకపోవడం వంటి అంశాలపై ఆందోళనలు చేయాల‌ని బాబు సూచించారు.
Tags:    

Similar News