టీఆరెస్‌ లో టీడీపీ విలీనం..మోత్కుపల్లి

Update: 2018-01-18 05:17 GMT
తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు  చేశారు. టీడీపీ నుంచి ఎందరు నేతలు బయటకు వెళ్లిపోయినా ఇంకా ఆ పార్టీలో కొనసాగుతున్న ఈ సీనియర్ నేత పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో సంచలనంగా మారాయి. తెలంగాణలో టీడీపీని టీఆరెస్‌ లో విలీనం చేయడం బెటరని ఆయన అన్నారు. అంతేకాదు... ఎన్టీఆర్‌ కు నివాళులర్పించేందుకు చంద్రబాబు రాకపోవడంపైనా ఆయన బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.
    
ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన నివాళులర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏపీ సీఎం - తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు రాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
    
కాగా తెలంగాణ టీడీపీ నుంచి సీనియర్ నేతలంతా ఇప్పటికే టీఆరెస్‌ లో చేరిపోయారు. రేవంత్ రెడ్డి వంటి మరికొందరు సీనియర్ నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లారు. కానీ, మోత్కుపల్లి నర్సింహులు - ఎల్.రమణ మాత్రం ఇంకా టీడీపీలో ఉన్నారు. చంద్రబాబు తనకు గవర్నరుగా అవకాశమిస్తారని మోత్కుపల్లి చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ఏ రాష్ర్టాలకు కొత్తగా గవర్నర్లను నియమించినా తనకు అవకాశం వస్తుందని ఆశించారు. కానీ.. ఇటీవల మాత్రం ఆయన వాస్తవాలను అర్థం చేసుకుని ఇంక ఆ ఆశ తనకు లేదని, ఆశలు వదులుకున్నానని చెప్పారు.
    
కాగా ఇంతకాలం చంద్రబాబును ఎంతమంది వీడి వెళ్లినా తాను మాత్రం నమ్మకంగా ఉన్న మోత్కుపల్లి ఇంత సీరియస్ కామెంట్లు చేయడంతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి. మోత్కుపల్లి త్వరలో టీఆరెస్‌ లో చేరడం ఖాయమని అంటున్నారు.
Tags:    

Similar News