అమిత్ షాతో మోత్కుప‌ల్లి..గ‌వ‌ర్న‌ర్ గిరీ చాన్స్‌

Update: 2017-04-11 04:29 GMT
తెలంగాణ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు మ‌రోమారు వార్త‌ల్లోకి ఎక్కారు. దాదాపుగా గ‌త మూడేళ్లుగా గ‌వ‌ర్న‌ర్ గిరీ ద‌క్క‌నున్న‌ట్లు వార్త‌ల్లో నిలుస్తున్న మోత్కుప‌ల్లి ఆకాంక్ష తాజాగా నెర‌వేరేలా ఉంద‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. ఎందుకంటే ఢిల్లీలో బీజేపీ చీఫ్‌ అమిత్‌ షాతో మోత్కుప‌ల్లి ప్ర‌త్యేక మంత‌నం సాగింది కాబ‌ట్టి. సాక్షాత్తు టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలోనే ఈ స‌మావేశం జ‌రిగింది కాబ‌ట్టి స‌ద‌రు టాక్ తెర‌మీద‌కు వ‌స్తోంది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల అధినేతల సమావేశం జరగ‌డానికి ముందు ఈ భేటీ జ‌రిగింది. కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించే ప్రయత్నాలు చేపడుతున్న సందర్భంగా ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. మోత్కుపల్లికి గవర్నర్‌ పదవి ఇచ్చే అవకాశం ఉందని టీడీపీ వర్గీయుల నుంచి జోరుగానే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా త్వరలో గవర్నర్ల మార్పులపై నిర్ణయం తీసుకుంటామని మోత్కుపల్లికి అమిత్‌ షా హామీ ఇచ్చినట్లు టీడీపీ వ‌ర్గాలు చెప్తున్నాయి. తాజాగా అమిత్‌ షాను మోత్కుపల్లి కలుసుకోవడంతో అప్పటి వార్తలకు ప్రస్తుతం గట్టి బలం చేకూరుతోంది. అయితే ఇది ఆచ‌ర‌ణ సాధ్యం అవుతుందా లేక‌పోతే గ‌తంలో వ‌లే చ‌ర్చ‌ల‌కే ప‌రిమితం అవుతుందా అనేది వేచి చూడాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News