కొండా రాజీనామా వెనుక ఏం జరిగింది?

Update: 2018-11-21 11:48 GMT
టీఆర్ ఎస్ కు రాజీనామా చేసిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి బుధవారం ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. తాను కాంగ్రెస్ లో చేరబోతున్నట్టు ప్రకటించారు. ఈ నెల 23న యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ మేడ్చల్ లో నిర్వహించే బహిరంగ సభలో తాను కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు వివరించారు.

రాహుల్ గాంధీని కలిసిన అనంతరం కొండా విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. టీఆర్ ఎస్ పార్టీ సిద్ధాంతాల్లో వచ్చిన మార్పులు నచ్చకనే తాను ఆ పార్టీకి రాజీనామా చేశానని వివరించారు.అనివార్య కారణాల వల్లే తాను టీఆర్ ఎస్ కు రాజీనామా చేశానని చెప్పుకొచ్చారు. తాను పార్టీలో చేరినప్పటి నుంచి  కొందరితో విభేదాలున్నాయని.. అంత మాత్రానా తాను పార్టీని ఎందుకు వీడుతానని అన్నారు.

టీఆర్ ఎస్ అధినేత - ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ తొలుత మంచి సీఎంగా పని చేశారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి కితాబిచ్చాడు. కానీ రెండేళ్లుగా పార్టీలో పోరాడుతున్నానని.. ప్రజల్లో పార్టీ పట్ల వ్యతిరేకత పెరిగిందని అన్నారు. ప్రాంతీయ పార్టీలతోనే సమస్యలు పరిష్కారం కావని తాను జాతీయ పార్టీ కాంగ్రెస్ లో చేరానని చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ తోనే సమస్యలు - హామీలు నెరవేరుతాయని ఆ పార్టీలో చేరినట్టు కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. చేవెళ్లలో సిద్ధాంతాలకు వ్యతిరేకంగా టీఆర్ ఎస్ పనిచేస్తోందన్నారు. తానకు మంత్రి మహేందర్ రెడ్డికి పడకపోవడం వల్లే పార్టీ వీడుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కొండా చెప్పుకొచ్చారు. ఎంపీ పదవికి కూడా రాజీనామాను స్పీకర్ ను కలిసి అందజేస్తానని వివరించారు.

 కొండా విశ్వేశ్వర రెడ్డి నిన్న వీడియోలో కేసీఆర్ పై గౌరవం ఉందని.. ఆయన పాలన బాగుందని వ్యక్తిగత కారణాలతోనే టీఆర్ ఎస్ వీడుతున్నట్టు చెప్పాడు. కానీ రాహుల్ గాంధీని కలువగానే కేసీఆర్ పై విమర్శలు చేయడం విశేషం. అయితే టీఆర్ ఎస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం చేవెళ్ల ఎంపీగా స్థానికులకు అందుబాటులో ఉండకపోవడం..ఈ ముందస్తు ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనకపోవడంతోనే గులాబీబాస్ కొండా విశ్వేశ్వరరెడ్డిపై సీరియస్ అయ్యారని.. వచ్చే ఎన్నికల్లో టికెట్ కష్టమేనని చెప్పడంతోనే ఆయన జంప్ చేశాడని టీఆర్ ఎస్ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. సరిగా పనిచేయని నేతను టీఆర్ ఎస్ వదిలించుకుందామని చూస్తుంటే ఆయనే తన దారి తను చూసుకొని టీఆర్ ఎస్ కు మేలు చేశాడని అంటున్నారు. వచ్చేసారి టికెట్ దక్కదని కాంగ్రెస్ లో ముందుగా చేరాడని వారు ఆరోపిస్తున్నారు. ఇలా చేవెళ్ల ఎంపీ జంపింగ్ వెనుక ఎవరి వెర్షన్లు వారికున్నాయి.. తెరవెనుక ఏం జరిగిందో మాత్రం ఎవ్వరికీ తెలీదు..
Tags:    

Similar News