అవును.. జగన్ ను రాజ్యసభ అడిగాం!

Update: 2020-03-03 12:30 GMT
హఠాత్తుగా ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్ లో వాలిపోయారు. విమానం దిగగానే నేరుగా ముఖ్యమంత్రి జగన్ నివాసానికి వెళ్లి కలిశారు. ఈ హఠత్ పరిణామానికి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ అకస్మాత్తుగా తన కుటుంబీకులు - సన్నిహితులతో కలిసి జగన్ కలిశాడు. రెండు గంటల పాటు సమావేశమై వెంటనే వెళ్లిపోయాడు. దీనిపై ఎలాంటి క్లారిటీ ఎవరూ ఇవ్వలేదు. ప్రభుత్వం మాత్రం ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల కోసం రిలయన్స్ సంస్థతో చర్చించినట్లు ప్రకటించింది. అయితే ఆ ప్రచారం వాస్తవమేనని తాము కలిసింది రాజ్యసభ కోసమేనని పరిమల్ నత్వానీ మీడియాతో తెలిపారు.

వాస్తవంగా ముఖేశ్ వచ్చింది మాత్రం తన సన్నిహితుడు పరిమళ్ నత్వానీ కోసం అని అందరికీ తెలిసింది. ఎందుకంటే ఆయన ప్రస్తుతం రాజ్యసభ కొనసాగుతుండగా త్వరలోనే ఆయన పదవీకాలం పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో తాను మరోసారి రాజ్యసభ వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ విషయం తన మిత్రుడు ముఖేశ్ అంబానీకి చెప్పారు. ముఖేశ్ అంబానీ అన్ని ఆలోచించుకుని ఎక్కడైతే బాగుంటుందని భావించి.. లెక్కలు వేసి ఆంధ్రప్రదేశ్ ను ఎంచుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వాటిని వైఎస్సార్సీపీ సొంతం చేసుకోనుంది. ఈ నేపథ్యంలో ఒక సీటు కోసం అంబానీ కోసం జగన్ వద్దకు వచ్చారు.

ఈ విషయమై సోమవారం పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో పరిమల్ నత్వానీ మీడియాతో చిట్‌ చాట్‌ గా మాట్లాడారు. తాము రాజ్యసభ సీటు కోసమే ఏపీ సీఎం జగన్‌ను కలిసినట్లు ప్రకటించారు. జగన్‌ ను రాజ్యసభ సీటు కోరిన మాట వాస్తవమేనని.. కానీ ఆయన మూడు రోజుల సమయం కావాలని కోరారు అని పరిమళ్ తెలిపారు. ఈ నేపథ్యంలో తనకు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సీటు దాదాపు ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. దీనిపై బీజేపీ ఎంపీ ఒకరు - వైఎస్సార్‌ సీపీ ఎంపీ ఒకరు ఈ విషయం తెలిపినట్లు ఆయన మీడియాతో చెప్పారు.

అయితే చివరి నిమిషంలో దక్కకుంటే ప్రత్యామ్నాయం కూడా చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీ కాదంటే తాను జార్ఖండ్ - బీహార్ - ఒడిశాల నుంచి ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త వచ్చి అడగడంతో సీఎం జగన్ భవిష్యత్ ప్రయోజనాల దృష్ట్యా రాజ్యసభ సీటు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని రాజకీయ వర్గాల్లో వార్త వినిపిస్తోంది. ఒక రాజ్యసభ సీటు వదులుకుంటే రాష్ట్రానికి ఎన్నో మేలు జరిగే పనులు అవుతాయని జగన్ భావిస్తున్నారు. ఈ మేరకు పరిమల్ నత్వానీని రాజ్యసభకు పంపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
Tags:    

Similar News