కేసీఆర్ కు మంద‌కృష్ణ ఇచ్చిన మిడ్ నైట్ షాక్‌

Update: 2017-12-18 04:49 GMT
అనూహ్య నిర్ణ‌యాలు తీసుకోవ‌టంలో ఎమ్మార్పీఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు మంద‌కృష్ణ తీరే వేరు. ఉమ్మ‌డి రాష్ట్రంలో ప్ర‌భుత్వాల‌కు త‌న తీరుతో షాకుల మీద షాకులు ఇచ్చిన ఆయ‌న  విభ‌జ‌న త‌ర్వాత త‌న మార్క్ ఆందోళ‌న‌ల్ని ఇప్ప‌టివ‌ర‌కూ చేప‌ట్ట‌లేదు. ఈ కొర‌త తీరేలా.. అనూహ్యంగా వ్య‌వ‌హ‌రించారు. నిర‌స‌న‌లు.. ఆందోళ‌న‌ల విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్న కేసీఆర్ స‌ర్కారుకు ఊహించ‌ని షాకిచ్చారు మంద‌కృష్ణ‌.

ఆదివారం అర్త‌రాత్రి వేళ‌లో ట్యాంక్ బండ్ ముట్ట‌డికి పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ నుంచి ట్యాంక్ బండ్‌కు వంద‌లాది మంది కార్య‌క‌ర్త‌లు త‌ర‌లి రావ‌టం.. దారిలో విధ్వంసం సృష్టించ‌టంతో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు సీఎం కేసీఆర్ హామీ ఇవ్వాల‌ని నినాదాలు చేసిన ఎమ్మార్పీఎస్ కార్య‌క‌ర్త‌లు మార్గ‌మ‌ధ్య‌లో తెలుగు మ‌హాస‌భ‌ల బ్యాన‌ర్లు.. హోర్డింగుల‌ను ధ్వంసం చేశారు.

ముట్ట‌డి కార్య‌క్ర‌మం అదుపు త‌ప్పి పోలీసు పెట్రోలింగ్ బైకుల‌కు నిప్పు పెట్టారు. పోలీసుల‌పై కుర్చీలు.. క‌ర్ర‌ల‌తో దాడి చేశారు. మెరుపులా మారిన ఆందోళ‌నతో పోలీసులు ఒక్క‌సారి షాక్ తిన్నారు. జ‌రుగుతున్న ప‌రిణామాల్ని క‌ట్ట‌డి చేసేందుకు రంగంలోకి దిగారు. ఆందోళ‌న‌కారుల్ని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేయ‌టంతో పాటు లాఠీలు.. ముళ్ల కంచెలు.. పోలీసు వాహ‌నాల్ని అడ్డుపెట్టి  ఆందోళ‌కారుల్ని నిలువ‌రించే ప్ర‌య‌త్నం చేశారు.

ప‌రిస్థితులు అదుపులోకి తెచ్చేందుకు ఒక ద‌శ‌లో బాష్ప‌వాయు గోళాల్ని ప్ర‌యోగించారు. దీంతో.. మంద‌కృష్ణ‌తో ప‌హా ఐదుగురు ఆందోళ‌నాకారులు సొమ్మ‌సిల్లి ప‌డిపోయారు. రాంగోపాల్ పేట పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద‌కు చేరుకున్న ర్యాలీని అడ్డుకున్న పోలీసులు మంద‌కృష్ణ‌ను అరెస్ట్ చేశారు. దీన్ని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసిన ఎమ్మార్పీఎస్ కార్య‌క‌ర్త‌ల్ని నిలువ‌రించేందుకు పోలీసులు లాఠీల‌కు ప‌ని చెప్పారు.

ఇటీవ‌ల ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ అంశంపై కొద్ది రోజుల కింద‌ట హైద‌రాబాద్ క‌లెక్ట‌రేట్ ఎదుట నిర్వ‌హించిన ఆందోళ‌న‌లో ఎమ్మార్పీఎస్ నాయ‌కురాలు భార‌తి అసువులు బాశారు. ఆమె సంస్మ‌ర‌ణ స‌భ‌ను సికింద్రాబాద్ లోని సిక్ విలేజ్ దోభీ ఘాట్ గ్రౌండ్ లో నిర్వ‌హించారు. దీనికి మంద‌కృష్ణ మాదిక ముఖ్యతిధిగా హాజ‌ర‌య్యారు. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ కోసం ప్రాణ త్యాగం చేసిన  భార‌తి.. మ‌రో ఆరుగురు అమ‌రుల ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ప్రార్థించారు. ఇదిలా ఉండ‌గా.. ఈ స‌భ‌లో అనూహ్య నిర్ణ‌యాన్ని తీసుకున్న మంద‌కృష్ణ మిలియ‌న్ మార్చ్ జ‌రిగిన చోటే.. లాంగ్ మార్చ్ నిర్వ‌హించాల‌ని పిలుపునిచ్చారు.

ట్యాంక్ బండ్ ను అప్ప‌టిక‌ప్పుడు ముట్ట‌డించాల‌ని.. 24 గంట‌ల పాటు దీన్ని కొన‌సాగించ‌టం ద్వారా త‌మ స‌త్తా చాటాలంటూ ఎమ్మార్పీఎస్ శ్రేణులకు పిలుపునివ్వ‌టంతో ఒక్క‌సారిగా ప‌రిణామాలు మారిపోయాయి. దాదాపు వెయ్యికి పైగా కార్య‌క‌ర్త‌ల‌తో బ‌య‌లుదేరిన మంద‌కృష్ణ ఆందోళ‌న పోలీసు వ‌ర్గాల‌కు.. ఇటు రాజ‌కీయ వ‌ర్గాల‌కు షాకింగ్ గా మారాయి. ఆందోళ‌న‌తో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.  ప‌రిస్థితులు ఉద్రిక్తంగా మార‌టంతో యుద్ధ ప్రాతిప‌దిక‌న స్పందించిన పోలీసులు ఆందోళ‌న‌కారుల‌ను అడ్డుకోగ‌లిగారు. అయితే.. అప్ప‌టికే తాను అనుకున్న ప‌నిని పూర్తి చేసిన మంద‌కృష్ణ‌.. ప్ర‌భుత్వాల‌కు త‌న మెరుపు నిర్ణ‌యాల‌తో షాక్ ఇవ్వ‌గ‌ల‌న‌న్న విష‌యాన్ని మ‌రోసారి చేత‌ల్లో చేసి చూపించారు..
Tags:    

Similar News