కాపు కాసే ప్లాన్ : జనసేనకు పెద్దాయన బ్లెస్సింగ్స్?

Update: 2022-06-06 16:30 GMT
మహానుభావులు ఊరకే రారు అంటారు. అలాగే ప్రముఖ నాయకుడు, కాపు ఉద్యమ నేత ఊరకే నర్సాపురం వెళ్లలేదు అంటున్నారు. ఆయన వచ్చిన వారు వచ్చినట్లే  నేరుగా మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఇంటికి వెళ్ళి సుదీర్ఘమైన చర్చలు జరిపారు. ఆయన బయటకు వచ్చి మామూలు భేటీయే అని  మీడియాకు చెప్పి వెళ్ళిపోయారు. కానీ ముద్రగడ సడెన్ గా వచ్చి కొత్తపల్లితో మీట్ కావడం పట్లనే ఇపుడు అతి పెద్ద చర్చ నడుస్తోంది.

అది కూడా పవన్ కళ్యాణ్ పొత్తుల మీద టీడీపీకి ఒక విధంగా అల్టిమేటం ఇచ్చే విధంగా చేసిన ప్రసంగం తరువాత ముద్రగడ తన గుమ్మం దిగి రావడం అంటే ఇది సామాజికపరంగా అత్యంత కీలకమైన మార్పుగా భావిస్తున్నారు. ఇక చూడబోతే ముద్రగడ గత కొంతకాలంగా  కాపులు, బీసీ, ఎస్సీస్, ఎస్టీస్, మైనారిటీలతో బహుజన ఫ్రంట్ కోసం ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.

ముద్రగడ జనసేన విషయంలో ఒక అభిప్రాయంతో ఉన్నారు. టీడీపీ పల్లకీ మోయవద్దు అన్నది కూడా ఆయన నినాదంగా ఉందని చెబుతున్నారు. అవసరం అయితే టీడీపీ సహా ఎవరి మద్దతు అయినా తీసుకుని కాపులు రాజ్యాధికారం చేపట్టడం భేషైన రాజకీయ విధానంగా ఆయన‌ తొలి నుంచి చెబుతున్నారు.

ఇన్నాళకు ముద్రగడ కోరిన విధంగానే పవన్ సౌండ్ చేశారు. రాజ్యాధికారంలో మా వాటా ఏంటి అని సూటిగా ప్రశ్నించారు. మేము ఇక పైన ఏ రకమైన  త్యాగాలు చేసేది లేదు అని కూడా తెగేసి చెప్పారు.

దాంతో ఈ కీలకమైన పరిణామం యావత్తు కాపుజాతితో పాటు ముద్రగడ వంటి కాపు పెద్దను కూడా బాగా ఆకట్టుకుందని, ఆనందింపచేసిందని అంటున్నారు అందుకే ఆయన  కాపు సహా ఇతర సామాజిక వర్గాల ఐక్య ఫ్రంట్ ప్రయత్నాలను మును ముందు మరింత దూకుడుగా చేస్తారని అంతున్నారు.

ఈ ప్రయత్నాలలో భాగంగానే ఆయన కొత్తపల్లిని కలసి వెళ్ళారని అంటున్నారు. కాపులు ఎక్కడ ఉన్నా ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నా వారంతా ఒకే త్రాటిపైకి రావడం ద్వారా వచ్చే ఎన్నికలలో బలమైన ఫోర్స్ గా మారాలన్నది ముద్రగడ తాజా అజెండా అంటున్నారు. ఇక ఈ మధ్య పాలకొల్లులో సీనియర్ నేత హరిరామజోగయ్య నాయకత్వాన జరిగిన రాష్ట్ర కాపు సంక్షేమ సేన సమవేశం కూడా కాపు రేపటి ముఖ్యమంత్రి అన్న నినాదాన్ని అందుకుంది. ఈ సమావేశంలో కూడా ముద్రగడ మార్క్ స్పష్టంగా కనిపించింది.

మొత్తానికి ఈ మధ్య కాలంలో సైలెంట్ గా ఉన్న ముద్రగడ ఇపుడిపుడే సౌండ్ చేయాలని చూస్తున్నారు. అది కూడా ఏపీలో మారుతున్న సామాజిక రాజకీయ పరిణామాల నేపధ్యాన్ని ఆయన గమనంలోకి తీసుకుని చురుకుగా అడుగులు వేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మరో మారు చంద్రబాబు సీఎం అయ్యే విధంగా ప్రయత్నాలు ఎవరూ చేయవద్దు అన్నదే కాపు పెద్ద భావన అంటున్నారు. అవసరం అయితే అటు నుంచి మద్దతు తీసుకుని కాపులు రాజ్యం చేయాలని ఆయన కోరుతున్నారు. మరి ముద్రగడ దారిలోకి పవన్ వచ్చేసినట్లే అని అంతా భావిస్తున్న వేళ ఆ పెద్దాయన బ్లెస్సింగ్స్ నిండుగా జనసేనకు ఉంటాయని అంటున్నారు. అదే కనుక జరిగితే గోదావరి జిల్లాల రాజకీయం మోతమోగిపోవడం ఖాయం.
Tags:    

Similar News