ఈ సారి విష‌యం సీరియ‌స్ అంట బాబు

Update: 2016-09-12 05:35 GMT
కాపులకు రిజర్వేషన్ల సాధన ధ్యేయంగా సాగించాల్సిన ఉద్యమంపై కాపు నేతలు కీల‌క అడుగు వేశారు. జాయింట్ యాక్షన్ కమిటీలు (జేఏసీ) ఏర్పాటుచేసి - క్షేత్రస్థాయిలో ఉద్యమ నిర్మాణ వ్యూహంతో ముందుకెళ్లాలని నిర్ణయించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో కాపు ఉద్యమాన్ని నిర్మించాలని కాపు ప్ర‌తినిధులు తీర్మానించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కాపు ఉద్యమ నేత - మాజీ మంత్రి ముద్రగడ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో 13 జిల్లాల‌ కాపు ప్రతినిధుల సమావేశంలో ఈ మేవ‌ర‌కు చ‌ర్చించారు. ఉద్యమ పంథా ఏ విధంగా ఉండాలనే విషయంపై సమావేశంలో పాల్గొన్న పలువురు సలహాలు - సూచనలు చేశారు. వీటన్నిటి సారాంశాన్ని క్రోడీకరించి - ముఖ్యమైన నిర్ణయాలను త్వరలో హైదరాబాద్‌ లో జరగనున్న కాపు నేతల శిఖరాగ్ర సమావేశంలో చర్చించి, ఉద్యమ కార్యాచరణ ఖరారు చేయాలని నిర్ణయించారు.

హైదరాబాద్‌ లో వినాయక నిమజ్జన కార్యక్రమం ముగిసిన అనంతరం ముద్రగడ పద్మనాభం - మరో 13మంది ముఖ్య నేతలు హైదరాబాద్‌ లో దాసరి నారాయణరావు - చిరంజీవి - పళ్లంరాజు వంటి ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు. క్షేత్రస్థాయిలో ఉద్యమాన్ని బలోపేతం చేయాలని - ఉద్యమంలో భాగంగా రధయాత్రగాని - పాదయాత్రగాని చేపట్టాలని నిర్ణయించారు. ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో రాష్టమ్రంతా నిర్వహించే ఈ పాదయాత్రకంటే ముందే జిల్లా జేఏసీలు ఆయా జిల్లాలో పాదయాత్రలు పూర్తిచేయాలని నిర్ణయించారు. గ్రామ - మండల - నియోజకవర్గ స్థాయిలో విద్యార్ధి - యువత - మహిళ - ఉద్యోగ - ఉపాధ్యాయ - న్యాయవాద తదితర జేఏసీలు ఏర్పాటుచేసుకోవాలని నిర్ణయించారు. కాపు మేధావులతో జేఏసీ ఏర్పాటుచేసి - ఎప్పటికపుడు సలహాలు తీసుకుంటూ ముందుకెళ్ళాలని నిర్ణయించారు. మహిళలకు - యువతకు ప్రధాన భూమిక కల్పించే విధంగా ఉద్యమం ఉండాలని నిర్ణయించారు.

ఇప్పటికే మంజునాథ కమిషన్ రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టి - షెడ్యూలు ప్రకటించిందని - ఇతర వర్గాలు రెచ్చగొట్టినా, సంయమనం పాటించి కమిషన్ ముందు వివరాలు అందించాలని నిర్ణయించారు. 13 జిల్లాల నుంచి హాజరైన ప్రతినిధుల నుంచి లిఖిత పూర్వకంగా నిర్దేశిత ఫార్మాట్‌ లో అభిప్రాయ సేకరణ చేశారు. అందరి అభిప్రాయాలను సమగ్రరీతిలో రూపొందించిన అంశాలపై హైదరాబాద్‌ లో చర్చించిన మీదట కార్యాచరణ తీసుకుంటామని మాజీ మంత్రి - కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రకటించారు.
Tags:    

Similar News