దేశం ఎలా తగలడ్డా... అదొక్కటీ చాలు!

Update: 2018-03-06 10:04 GMT
కొందరు అంతే. వారికి సింగిల్ పాయింట్ ఎజెండా ఉంటుంది. భూనభోంతరాళాలు బద్ధలైపోయినా సరే.. వారు ఆ ఒక్క సమస్య గురించి తప్ప మరొక్కటి మాట్లాడారు. అలాంటి వారిలో మన ముద్రగడ పద్మనాభం కూడా ఒకరు. కాపుజాతికి రిజర్వేషన్ కల్పించాలనే మాట ఒక్కటే ఆయన చెబుతారు తప్ప.. తతిమ్మా విషయాల్లో రాష్ట్రం ఏమైపోయినా పర్లేదన్నట్టుగా మాట్లాడుతుంటారు. ప్రత్యేకహోదా గురించి అంతా హోరెత్తిపోతున్న సమయంలో కూడా.. ఆ ఊసే ఎత్తకుండా... మార్చి నెలాఖరులోగా కాపులకు రిజర్వేషన్ అమల్లోకి రాకపోతే గనుక.. పోరాటాన్ని ఉధృతం చేసేస్తాం అని ఆయన హెచ్చరిస్తున్నారు.

చంద్రబాబునాయుడు కాపులకు రిజర్వేషన్ కల్పిస్తాననే హామీ ఇచ్చి.. అన్ని బూటకపు హామీల్లాగానే దీనిని కూడా పక్కన పెట్టేసి.. ఒక మొక్కుబడి బిల్లు కేంద్రానికి పంపి చేతులు దులిపేసుకున్నారన్నది నిజం. ఈ బిల్లు అవకతవకలుగా ఉన్నది బాబూ అంటూ కేంద్రం దానికి బ్రేకులు వేస్తే.. చక్కదిద్ది పని జరిగేలా చూడడం గురించి చంద్రబాబు ఇప్పటిదాకా ఎంతమాత్రమూ పట్టించుకోలేదు.

అయితే ఆయనకు కలిసి వచ్చిన విషయం ఏంటంటే... ఈ అంశం మీదికి ప్రజల్లో ఎక్కువ మంది దృష్టి మళ్లడం లేదు. అందరూ ఇప్పుడు ప్రత్యేకహోదా గురించి మాత్రమే పరితపించి పోతున్నారు. ఎలాగైనా సరే.. హోదా రాబట్టాలని రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. అన్ని పార్టీలూ ఇదే మాటెత్తుతున్నాయి.

కానీ ఇలాంటి క్లిష్ట సమయంలోనూ ఒక కార్యక్రమంలో ప్రసంగించిన ముద్రగడ పద్మనాభం.. కాపులకు రిజర్వేషన్ ఇవ్వకపోతే ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం అన్నట్లుగా హెచ్చరిస్తున్నారు. దానికి డెడ్ లైన్ పెట్టి మరీ..  ఈ నెలాఖరులోగా.. రిజర్వేషన్ల సంగతి తేల్చేయాలని లేకపోతే పోరాటాలు ఉధృతం అవుతాయని ఆయన అంటున్నారు. అయితే ముద్రగడ వాదనకు కాపు జాతిలోనే సరైన మద్దతు ఉన్నదా అనేది అనుమానమే.

రాష్ట్రంలో ప్రత్యేక హోదా పోరాటం.. ఈ నెలఖారు నాటికి మరింత తీవ్రరూపం సంతరించుకునే అవకాశం ఉంది. ఈలోగా కేంద్రం స్పందించకపోతే గనుక.. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు ఏప్రిల్ 6న రాజీనామాలు చేయబోతున్నారు. ఆ నేపథ్యంలో అంతా తీవ్రంగానే ఉంటుంది. ఇంత కాక ఉన్న సమయంలో.. మళ్లీ కాపు పోరాటాల ఊసెత్తకుండా.. కాస్త సమయం సందర్భం చూసుకుని.. ఆయన పోరాడితే. కాపుల మద్దతు కూడా ఉంటుంది కదాని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Tags:    

Similar News