2 రోజుల్లో రూ.29వేల కోట్ల ఆస్తి ప్లస్ అయ్యింది?

Update: 2019-08-16 06:29 GMT
కోటి రూపాయిలు సంపాదించటానికి పట్టే సమయం సామాన్యుడికైతే జీవితం కాలం కూడా సరిపోదు. ఒక మోస్తరు వ్యక్తికి జీవితకాలం పడుతుంది. అలాంటిది కేవలం రెండంటే రెండు రోజుల్లో ఏకంగా రూ.29వేల కోట్లు ఆస్తి విలువ పెంచుకోవటం ఎవరికైనా సాధ్యమా? అంటే నో చెబుతారు.కానీ.. ఇప్పుడలా చెప్పటానికి వీల్లేదు. ఎందుకంటే.. ఆ రికార్డును తన సొంతం చేసుకున్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ. తాజాగా నిర్వహించిన వార్షిక సాధారణ సమావేశంలో ఆయన నోటి నుంచి వచ్చిన ఒకే ఒక మాట.. ముకేశ్ ఆస్తికి మరో రూ.29వేల కోట్లను యాడ్ చేసేలా చేసింది.

గతంలో ఎప్పుడూ కూడా ఇంత భారీగా ఆయన సంపద విలువ ఇంత వేగంగా వృద్ధి చెందింది లేదు. రానున్న 18 నెలల్లో రియలన్స్ గ్రూపును అప్పుల్లేకుండా చేస్తానన్న మాటతో ఈ మేజిక్ చోటు చేసుకుంది. సౌదీ సంస్థకు పెట్రో వ్యాపారంలో వాటాను.. బ్రిటిష్ పెట్రోలియంకు రిటైల్ పెట్రోల్ బంకుల్లో వాటాను అమ్మేయాలన్న నిర్ణయాలతో తమ సంస్థకు దాదాపు రూ.1.5లక్షల కోట్ల ఆదాయం రానుండటం.. ఆ మొత్తాన్ని సంస్థకు ఉన్న అప్పుల్ని తీర్చివేయాలని నిర్ణయాన్ని వెల్లడించారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. గడిచిన కొంతకాలంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జియో ఫైబర్ సేవల్ని వచ్చే నెలలో (సెప్టెంబరు) ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ సేవలు ఒక్కసారి అందుబాటులోకి వచ్చాక..కేబుల్ ముఖ చిత్రం మారిపోవటమే కాదు.. త్వరితగతిన ఈ రంగంలో జియో తిరుగులేని రారాజుగా మారుతుందన్న మాట వినిపిస్తోంది.

ఒక అంచనా ప్రకారం ముకేశ్ అంబానీ ఆస్తి విలువ రూ.3.5లక్షల కోట్లు. దానికి అదనంగా ఇప్పుడు పెరిగిన షేర్ల విలువతో మరో రూ.29వేల కోట్ల సంపద పెరిగినట్లైంది. ప్రపంచ కుబేరుల్లో ముకేశ్ ప్రస్తుతం 13స్థానంలో ఉన్నారు. చూస్తుంటే.. జియో ఫైబర్ పుణ్యమా అని రానున్న రోజుల్లో ఆయన ఆస్తి మరింత వేగంగా వృద్ధి చెందటం ఖాయమని చెప్పక తప్పదు.


Tags:    

Similar News