సిక్సర్ కొట్టేసిన ముకేశ్ అంబానీ.. తాజా డీల్ ఎంతంటే?

Update: 2020-06-06 04:30 GMT
ఒక ప్రైవేటు కంపెనీ తన వాటాల్ని అమ్మేందుకు సిద్ధం కావటం పెద్ద విషయం కాదు. ప్రపంచాన్నిపట్టి పీడిస్తున్న మహమ్మారి వేళ.. వేలాది కోట్లు పెట్టి ఒక సంస్థలో షేర్లు కొనటం.. అది కూడా రెండు శాతం కంటే తక్కువ వాటాకు రూ.9వేల కోట్లకు పైనే అమ్ముడు కావటం ఒక రికార్డుగా చెప్పాలి. ఇలాంటివి చేసే మొనగాడిగా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకే సాధ్యమని చెప్పాలి.

తన కంపెనీకి అప్పుల్లేకుండా చేస్తానని మాట ఇవ్వటమే కాదు.. ఆ మాటన నిలబెట్టుకునే క్రమంలో భాగంగా ముకేశ్ పట్టుదలతో వ్యవహరిస్తున్నారు. కేవలం నెలన్నర వ్యవధిలో ఆరు డీల్స్ తో వేలాది కోట్లను సమీకరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆరో డీల్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు. ఇప్పటివరకూ చేసుకున్న ఆరు డీల్స్ తో రిలయన్స్ జియోకు ఏకంగా రూ.92,202 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు లెక్క. మరి.. కంపెనీ వాటా ఎంత అమ్మారన్నది చూస్తే చాలా స్వల్పమే కావటం గమనార్హం.

తాజా డీల్ అబుదాబి దిగ్గజ సంస్థ ముబాదలాతో జియో చేసుకుంది. జియోలోని1.85 శాతం వాటాను ఏకంగా రూ.9,093.60 కోట్లకు ఫైనల్ చేసింది. దీని ప్రకారం జియో విలువ రూ.5.16లక్షల కోట్లుగా మారినట్లుగా చెప్పాలి. ఇప్పటికే జియోలో అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఫేస్ బుక్.. సిల్వర్ లేక్.. విస్టా ఈక్వెటీ పార్టనర్స్.. జనరల్ అట్లాంటిక్.. కేకేఆర్.. ముబాదలాలు పెట్టుబడులు పెట్టాయి.

ఇప్పటి వరకూ జరిగిన ఆరు డీల్స్.. వాటి మొత్తం.. ఆ కంపెనీలకు ఇచ్చే వాటా శాతాన్ని చూస్తే..
1. ఫేస్ బుక్                           9.99 శాతం       రూ.43,574 కోట్లు
2. సిల్వర్ లేక్                        1.15 శాతం       రూ.5,666 కోట్లు
3. విస్టా ఈక్విటీ పార్టనర్స్         2.32 శాతం      రూ.11,367 కోట్లు
4. జనరల్ అట్లాంటిక్               1.34 శాతం      రూ.6,598 కోట్లు
5. కేకేఆర్                              2.32 శాతం     రూ.11,367 కోట్లు
6. ముబాదలా                       1.85 శాతం     రూ.9,093.6 కోట్లు
Tags:    

Similar News