ఇంత మొండి ఏంది సారు? అబ్బాయికి జరిగింది చాలదా?

Update: 2021-04-25 15:30 GMT
కరోనా మన దగ్గర లేదు అధ్యక్షా.. కొన్ని నెలల క్రితం తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విలువైన మాటలు.. ఇప్పుడు చిట్టి వీడియోల రూపంలో విపరీతంగా వైరల్ గా మారాయి. కరోనా వస్తే.. ముఖానికి మాస్కు లేకుండా పని చేస్తామని చెప్పిన ఆయన.. ఈ రోజున మాస్కు లేకుండా ఇంట్లో నుంచి వీధుల్లోకి వస్తే ఫైన్ వేస్తామంటూ అధికారిక ఆదేశాల్ని జారీ చేయాల్సిన దుస్థితి.

కరోనా విషయంలో కేసీఆర్ అంచనాకు భిన్నంగా నెలకొంటున్న పరిణామాల విషయంలో ఇప్పటికైనా వాస్తవిక ధోరణిని అనుసరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే.. కరోనా బారిన ముఖ్యమంత్రికేసీఆర్.. ఆయన కుమారుడు కేటీఆర్.. రాజ్యసభ సభ్యుడు సంతోష్ లు తాజాగా పాజిటివ్ అయితే..అంతకు ముందే ఎమ్మెల్సీ కవిత కరోనాకు గురి కావటం తెలిసిందే.

ఇంత జరుగుతున్నప్పటికీ.. రాష్ట్రంలో నిర్వహిస్తున్న మున్సిపల్ పోరు విషయంలో మాత్రం వెనక్కి తగ్గేందుకు కేసీఆ ర్ సర్కారు ససేమిరా అంటున్న పరిస్థితి. ప్రస్తుతం వరంగల్.. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల్ని నిర్వహిస్తున్నారు. కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉండి.. బాధితులంతా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ బెడ్ల కోసం ప్రాణవాయువు కోసం తపిస్తున్నారు. సరైన సమయంలో సరైన వైద్యం అందక మరణిస్తున్న ఉదంతాలు లేకపోలేదు. ఇలాంటివేళ.. కరోనాను కట్టడి చేసేందుకు పెద్ద ఎత్తున నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.

అందులో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్ని వెంటనేవాయిదా వేయించటం చాలా అవసరం. కానీ.. అందుకు సీఎం కేసీఆర్ ససేమిరా అంటున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పుడున్న ఊపులోనే ఎన్నికల్ని పూర్తి చేయాలన్న పట్టుదలతో అధికారపక్షం ఉంది. అయితే.. ఎన్నికల ప్రచారానికి తనకు బదులుగా తన కొడుకును పంపుతున్న సారు.. ఇటీవల పాజిటివ్ గా తేలటంతో ఆయన్ను ఆపేశారు.

తాజాగా మంత్రి కేటీఆర్ కు బదులుగా.. మిగిలిన మంత్రులకు బాధ్యతను అప్పజెప్పారు. ఆయా జిల్లాల మంత్రులంతా కలిసి ప్రచారం చేయాలని.. వారే బాధ్యులుగా కేసీఆర్ చెబుతుున్నారు. కేసులు పెరుగుతున్న వేళ.. రోడ్ షోల్ని బంద్ పెట్టి.. ఇంటింటికి ప్రచారానికే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ఇదంతా చూసినప్పుడు.. పాజిటివ్ బారిన పడిన కేటీఆర్ ను చూసిన తర్వాత అయినా.. మున్సిపల్ ఎన్నికల విషయంలో కేసీఆర్ తన మొండి వైఖరిని మార్చుకోవటం లేదని చెప్పాలి. తనకు.. తన కొడుక్కి వైరస్ సోకిన వేళ.. ఎన్నికల ప్రచారమంటూ తిరిగే వారికి ముప్పు మరింత ఎక్కువగా ఉంటుంది కదా? అలాంటివి తప్పించాల్సిన కేసీఆర్.. అందుకు ఓకే అని చెప్పటం ఏమిటి?
Tags:    

Similar News