మున్సిపల్ పోరు : విశాఖపట్నం కి భారీగా దొంగ నోట్ల కట్టలు ... ఎంత డబ్బో ?

Update: 2021-03-03 15:30 GMT
ఏపీలో మరి కొద్ది రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో మద్యం, నగదు ఏరులై పారుతూ ఉంటుంది. ముఖ్యంగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు బరిలో ఉన్న అభ్యర్థులు ఎంత ఖర్చు చేసేందుకైనా వెనుకాడటం లేదు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వ్యవహారం అన్ని పార్టీలు కూడా చాలా  ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. పరిపాలన రాజధాని, ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యవహారం వంటి పరిణామాల నేపథ్యంలో గ్రేటర్ విశాఖ ఫలితాలు ఎలా ఉంటాయనేది అందరిని ఉత్కంఠతను రేపుతోంది.

ఈ ఎన్నికల వేడి ఇలా కొనసాగుతున్న సమయంలోనే విశాఖ లో దొంగ నోట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎన్నికల వేళ ఒడిశా సరిహద్దు జిల్లాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. పోలీసులు.. అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని ఆపుతున్నారు. ఇటీవల ఓ తహశీల్దార్ వాడుతున్నఅద్దె కారులో భారీగా నాటు సారా పట్టుబడింది. దీంతో సరిహద్దులో మరింత నిఘా పెంచారు. తాజాగా కొరాపుట్ జిల్లాలోని పట్టాంగి పోలీలస్ స్టేషన్ పరిధిలో సుమారు 8 కోట్ల రూపాయలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అవన్నీ నకిలీ నోట్లు అని తెలియడంతో అంతా షాక్ కు గురయ్యారు. మొత్తం దొరికినవి అన్నీ నకిలీ నోట్లే అని సునాబేదా ఎస్ ‌డిపిఓ నిరంజన్ బెహెరా వివరించారు.

మొదట ఓ వాహనంలోని నోట్లన్నీ నకిలీ 500 రూపాయలు ఉన్నట్టు గుర్తించామని. మొత్తం విలువ 7.9 కోట్ల  రూపాయలు  ఉందని తెలిపారు. తనిఖీ చేస్తున్న సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్టు గుర్తించారు. ఛత్తీస్‌ గడ్ లోని రాయ్‌ పూర్ నుంచి విశాఖపట్నం వరకు ముగ్గురు యువకులు ప్రయాణిస్తున్నారు. వారి దగ్గర ఉన్న ట్రాలీ బ్యాగ్‌ లలో భారీగా నకిలీ నోట్లు ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీరంతా ఛత్తీస్‌ గడ్ లోని జంజాగిర్‌ లోని చంపా జిల్లాకు చెందినవారే. వారి దగ్గర నుంచి ఐదు మొబైల్ ఫోన్లు, 35 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఐడి ప్రూఫ్ లు , ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు ఎక్కడ నుంచి వీటిని సరఫారా చేస్తున్నారు. వారి వెనుక ఇంకా ఎవరున్నారు. ఎప్పటి నుంచి దందా కొనసాగిస్తున్నారన్నదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
Tags:    

Similar News