తబ్లిగ్ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న ముస్లిం వర్గాలు

Update: 2020-04-03 17:30 GMT
కరోనాను కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. కఠినంగా ఉన్నప్పటీకి...భారత్ లో లాక్ డౌన్ సత్ఫలితాలనిస్తోందనుకుంటున్న సమయంలో ఢిల్లీ ఉదంతం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కస్ మస్జిద్ లో జరిగిన సదస్సు కేంద్రంగా కరోనా కొందరికి వ్యాప్తి చెందడం కలవరపెడుతోంది. లాక్ డౌన్ కు ముందే ఈ సదస్సు జరిగిందని...సదస్సు ముగిసిన తర్వాత తమ ప్రాంతాలకు వెళ్లే వీలులేక మర్కస్ లో చిక్కుకుపోయామని వారు చెబుతున్నారు. అయితే, కరోనా వ్యాప్తి నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉంటే...ఈ సదస్సు నిర్వహించడంపై విమర్శలు వస్తున్నాయి. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో సదస్సు నిర్వహించిన తబ్లిగి జమాత్ పై కొన్ని ముస్లిం వర్గాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. తబ్లిగి జమాత్ సభ్యుల తీరును - సదస్సు నిర్వహించిన వారి తీరును షియా - సున్ని ముస్లిం వర్గాల నాయకులు విమర్శిస్తున్నారు. అయితే, వారి వారి వ్యక్తిగత ప్రయోజనాలను బట్టి ఆ విమర్శల తీవ్రత ఉన్నప్పటికీ...చాలామంది తబ్లిగ్ జమాత్ తీరును ఖండిస్తున్నారు.

వాస్తవానికి సున్ని - షియా వర్గాలు రెండూ ముస్లింలకు చెందినవే. అయితే, ఆ రెండింటి మధ్య వర్గపరమైన విభేదాలున్నాయి. ఢిల్లీ ఉదంతం నేపథ్యంలో సున్ని వర్గానికి చెందిన తబ్లిగ్ జమాత్ సభ్యుల తీరుపై సహజంగానే షియా వర్గ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో సున్ని వర్గానికి చెందిన కొందరు కూడా కరోనా సమయంలో సదస్సు నిర్వహించకపోయి ఉంటే బాగుండేదని సున్నితంగా విమర్శిస్తున్నారు.  ఆ సదస్సు వల్ల దేశం మొత్తం కరోనా వ్యాప్తి చెందేలా చేసిన తబ్లిగ్ జమాత్ ను నిషేధించాలని - అటువంటి వారికి కఠిన శిక్షలు విధించాలని యూపీ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు చీఫ్ వసీం రిజ్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తబ్లిగ్ జమాత్ ఆ సదస్సు నిర్వహించకపోయి ఉంటే బాగుండేదని, ఇందుకు కారణమైనవారిపై చర్యలు తీసకోవాలని మౌలానా కల్బే జవాద్ అన్నారు. తాలిబన్ల తరహాలో తబ్లిగ్ జమాత్ క్షమించరాని పాపం చేసిందని, అది నిర్లక్షం కాదని, తీవ్రమైన క్రిమినల్ చర్య అని షియా నేత - కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ మండిపడ్డారు. తబ్లిగ్ జమాత్ అతివాద సంస్థ అని - దేశ వ్యతిరేక కార్యలాపాలకు పాల్పడినందున ఆ సంస్థపై నిషేధం విధించాలని యూపీ మంత్రి - షియా నేత - మొహ్సిన్ రాజా అన్నారు.

మర్కస్ లో జరిగిన సదస్సు వల్ల కరోనా వ్యాప్తి చెందడం దురదృష్టకర ఘటన అని - సున్ని నేత మౌలానా ఖాలిద్ రషీద్ ఫిరంగీ మహాలి అభిప్రాయపడ్డారు. ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే ఖాలిద్...ఈ ఘటన వల్ల చాలామంది ప్రాణాలు అపాయంలో పడ్డాయని అభిప్రాయపడ్డారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆ సదస్సుకు హాజరైన తబ్లిగ్ జమాత్ సభ్యులంతా స్వచ్ఛందంగా ముుందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. ప్రపంచమంతా కరోనాపై పోరాడుతున్న సమయంలో ఆ సదస్సు నిర్వహించకపోయి ఉంటే బాగుండేదని దేశంలోనే అతి పెద్ద ముస్తిం సంస్థ అయిన జమాయత్ ఉలెమా ఎ హింద్ అభిప్రాయపడింది. ఈ ఘటనకు కారకులైనవారికి చట్టపరమైన శిక్ష విధించాలని, మీడియా తీర్పు ఇవ్వకూడదని జమాయత్ ఉలెమా ఎ హింద్ జనరల్ సెక్రటరీ - రాజ్యసభ మాజీ ఎంపీ మౌలానా మహమూద్ మదాని అన్నారు. ఈ ఘటనపై తబ్లిగ్ జమాత్ వాదన కూడా వినాలని, అప్పుడు ఘటనపై ఒక అంచనా వస్తుందని అన్నారు.

లాక్ డౌన్ తర్వాత కూడా లక్షలాది మంది రోడ్లపై తిరుగుతున్నారని - ఆ కారణంతోనే వందల మంది మర్కస్ వంటి ప్రాంతాల్లో ఇరుక్కుపోయారని చెప్పారు. లాక్ డౌన్ అమలులో వైఫల్యం కూడా ఈ ఘటనుకు ఒక కారణం అని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత ప్రభుత్వ ఆదేశాల ప్రకారం దేశంలోని 10 లక్షల మసీదులను మూసివేశామని - కేవలం నాలుగైదు మసీదులు ఇలా తెరచి ఉంచడం వల్ల ముస్లింలంతా మాటలు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఘటనను చూసి మొత్తం ముస్లింలను నిందించడం సరికాదని అన్నారు. ఇప్పటికే దేశంలో ఇస్లామోఫోబియా పెరిగిపోయిందని, ముస్లింలపై కొందరిలో వ్యతిరేక భావాలున్నాయని, ఇటువంటి ఘటనలు...ఆ ఫోబియాకు ఆజ్యం పోసేలా ఉండకూడదని అన్నారు. తమను మాత్రమే టార్గెట్ చేస్తున్నారన్న భావన ముస్లిం సమాజంలో రాకుండా చూసుకోవాలని, ఢిల్లీ సమస్యను అక్కడివరకే...ఆ కొంతమంది వరకే పరిమితం చేయాలని జమాత్ ప్రతినిధి నియాజ్ ఫరూఖీ అన్నారు. అంతేగానీ, మొత్తం ముస్లింలను నిందించడం వల్ల ముస్లింలలో అభద్రతా భావం పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.


Tags:    

Similar News