నాగం మాటలను నమ్మాలా వద్దా?

Update: 2016-05-14 10:01 GMT
బీజేపీ నేత నాగం జనార్దనరెడ్డి పార్టీ మారుతున్నారన్న వార్తలు గుప్పుమంటున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. తాను బీజేపీని వీడడం లేదని చెప్పారు. తాను పార్టీ మారుతున్నట్టు వచ్చిన వార్తలను  అవాస్తవమని  ఖండించారు. కాంగ్రెస్ లోకి కానీ తెరాసలోకి కానీ వెళ్లే ఉద్దేశం ఎంతమాత్రమూ లేదని అన్నారు. తాను ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తూ వచ్చానని, ఆ పార్టీకి వ్యతిరేకంగా రాజకీయాల్లో ఉన్న తాను అదే పార్టీలోకి ఎందుకు వెళ్తానని ప్రశ్నించారు. కాగా, కొన్నాళ్లుగా బీజేపీకి నాగం దూరంగా ఉంటున్న నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

నాగం జ‌నార్దన్ రెడ్డి త్వ‌ర‌లో కాంగ్రెస్ పార్టీలో చేర‌డానికి రంగం సిద్ధం చేసుకున్నట్లుగా కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. బీజేపీ అధిష్ఠానం ప‌ట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయ‌న ఇక ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పాలనే అనుకున్నారట. బీజేపీలో ఏమాత్రం విలువ ఇవ్వకపోవడంతో దాదాపుగా నాగం తెరమరుగయ్యారనే చెప్పాలి. అయితే.. టీఆరెస్ లోకి వెళ్లాలన్నా అక్కడా ఇమిడే పరిస్థితి ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంటుందున్న అంచనాలతో ఆయన అటువైపు మొగ్గు చూపుతున్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ.. నాగం మాత్రం ఆ ప్రచారాలను ఖండిస్తున్నారు.

రాజ‌కీయ జీవితం ఆరంభించిన నాటి నుంచి టీడీపీలో ఉన్న నాగం జనార్దన్ రెడ్డి 2011లో ఆ పార్టీ అధిష్ఠానాన్ని ధిక్కరించడంతో తెలుగు దేశం పార్టీ నుంచి బహిష్కరణకు గుర‌య్యారు. అనంత‌రం ఆయ‌న భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరారు. తాజాగా బీజేపీ అధిష్ఠానం తీరుపై అలిగిన నాగం జనార్దన్ రెడ్డి కమలానికి వీడ్కోలు చెప్పాలనే అనుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే, ఆయన మాత్రం స్పష్టమైన నిర్ణయం తీసుకునేవరకు ఇది ప్రచారం కాకూడదన్న ఉద్దేశంతో ఖండిస్తున్నట్లుగా తెలుస్తోంది. సామాజిక వర్గం పరంగానూ కాంగ్రెస్ లో ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన భావిస్తున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన ఒకట్రెండు వారాల్లో స్పష్టతకు వచ్చిన తరువాత ప్రకటిస్తారని రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పార్టీలు మారుతున్న నేతలంతా ఇలాగే తొలుత ఖండిస్తుండడంతో నాగం ఖండనలను ఎవరూ లెక్కలోకి తీసుకోవడం లేదు. ఒకట్రెండు రోజుల్లో కాంగ్రెస్ కు చెందిన ఢిల్లీ పెద్దలతో ఆయన భేటీ ఉంటుందని.. ఆ తరువాత చేరిక ఉండొచ్చని భావిస్తున్నారు.
Tags:    

Similar News