సారు డిసైడ్ అయ్యారట.. సాగర్ టికెట్ అతడికేనట

Update: 2021-03-29 05:40 GMT
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్నివేడెక్కిస్తున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరిని డిసైడ్ చేయాలనే విషయం మీద టీఆర్ఎస్ అధినాయకత్వం తర్జనభర్జనలు పడుతోంది. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. ఏ మాత్రం తప్పు దొర్లకూడదన్న భావనలో పార్టీ అధినేత కమ్ సీఎం కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఈ టికెట్ ను పలువురు ఆశిస్తున్న వేళ.. ఎవరిని అభ్యర్థిగా నియమించాలన్న విషయంపై గడిచిన కొన్నిరోజులుగా భారీ గ్రౌండ్ వర్కు చేపట్టినట్లుగా చెబుతున్నారు.

ఇటీవల టికెట్ ఇచ్చే విషయంపై అంతర్గత సర్వే చేయించటం.. దాని ఫలితాల నేపథ్యంలో సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే నోముల నర్సయ్య కుమారుడు నోముల భగత్ కుమార్ కు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీ అభ్యర్థి ఎవరన్న విషయంపై కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చేశారని.. ఈ రోజు (సోమవారం) పార్టీ అభ్యర్థి ఎవరన్న విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని చెబుతున్నారు.

నిజానికి సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు గులాబీ నేతలు పలువురు  ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇటీవల జరిగిన వరుస ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బల గాయాల్ని.. ఇటీవల వెల్లడైన రెండు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు  మానేలా చేశాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్న సాగర్ ఉప ఎన్నిక ఫలితం తమకు ప్రతికూలంగా మారకూడదన్న పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు. దీంతో.. అభ్యర్థి ఎంపిక విషయంలో ఏ మాత్రం తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకుంటన్నారు. సాగర్ టికెట్ కోసం ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి.. కోటిరెడ్డి.. గురవయ్య యాదవ్.. రంజిత్ యాదవ్.. బాలరాజ్యాదవ్ తదితరులు పోటీ పడుతున్నా.. కేసీఆర్ మాత్రం భగత్ కుమార్ వైపే మొగ్గు చూపుతున్నారని.. అధికారికంగా ప్రకటన విడుదల చేస్తారని చెబుతున్నారు. సారు డిసైడ్ అయితే.. ఎవరు మాత్రం మార్చగలరు?
Tags:    

Similar News