పిల్లాడ్ని గెలిపించుకొస్తే.. ఆ ఇద్దరి ఫ్యూచర్ కు సారు గ్యారెంటీ?

Update: 2021-03-30 04:30 GMT
అంచనాలకు తగ్గట్లే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల బరిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే నోముల నర్సయ్య కుమారుడు భగత్ ను ఎంపిక చేస్తూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. భగత్ కు బదులుగా పలువురి పేర్లు తెర మీదకు వచ్చినా.. తర్జనభర్జనల అనంతరం నోముల కుమారుడికే సీటు ఇవ్వాలని డిసైడ్ చేశారు.

తాజాగా తెలంగాణ భవన్ కు వెళ్లి మరీ.. టికెట్ ను అధికారికంగా ప్రకటించిన కేసీఆర్.. మరో ఇద్దరు కీలక నేతల భవిష్యత్తుపై గట్టి హామీ ఇవ్వటం గమనార్హం. పార్టీ కోసం కష్టపడే వారిని మర్చిపోనన్న విషయాన్ని ప్రస్తావించిన కేసీఆర్.. సాగర్ ఉప ఎన్నికల్లో కీలకం కానున్న ఇద్దరు నేతలకు ప్రత్యేకించి భారీ ఆఫర్ ఇచ్చేశారు. సాగర్ ఉప ఎన్నికల బరిలో నిలిచిన భగత్ చిన్న పిల్లవాడని.. అతడికి అన్ని విషయాలు తెలీవన్న కేసీఆర్.. అతడి గెలుపు కోసం పార్టీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి.. ఎంసీ కోటిరెడ్డికి ప్రత్యేక బాధ్యతల్ని అప్పజెప్పారు.

‘‘మీ కొడుకుగా భావించి.. అతడికి తెలియని విషయాన్నితెలిసేలా చేయండి.. పిల్లవాడ్ని గెలిపించుకురండి.. మీ భవిష్యత్తు సంగతి నేనే చూసుకుంటా. నాకు వదిలేయండి’’ అని ఇద్దరు నేతలకు కేసీఆర్ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డికి ఎమ్మెల్సీ రెన్యువల్ చేస్తానని.. కోటిరెడ్డికి ఎమ్మెల్సీని చేస్తానన్న హామీని ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే గెలుపునకు రెండు ఎమ్మెల్సీ సీట్లు ఇస్తానంటున్న కేసీఆర్ తాజా ఆఫర్ ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News