సాగ‌ర్ బై పోల్‌.. తెలంగాణ‌లోనూ కులాల కంపే..!

Update: 2021-03-31 03:56 GMT
ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అయినా… తెలంగాణ వ‌చ్చాక అయినా… ఏపీలో ఉన్నంత‌గా కుల రాజ‌కీయాలు తెలంగాణ‌లో ఉండ‌వు అన్న‌ది నిజం. ఆ మాట‌కు వ‌స్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భ‌వానికి ముందు నుంచే కోస్తాలో కొన్ని జిల్లాల్లో కులాల మ‌ధ్య వైష‌మ్యాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఆ త‌ర్వాత టీడీపీ అధికారంలోకి రావ‌డం, వంగ‌వీటి రంగా హ‌త్య .... ఆ త‌ర్వాత ప్ర‌జారాజ్యం ఏర్పాటు ఇలా ప్ర‌తిసారి ఏదో ఒక కార‌ణంతో ఏపీలో ఎప్ప‌టిక‌ప్పుడు కుల వైష‌మ్యాలు పెరుగుతూనే వ‌స్తున్నాయి. ఈ జాడ్యం తెలంగాణ‌లో కొన్ని ద‌శాబ్దాల నుంచి లేదు. అయితే టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతూ వ‌స్తోన్న ఈ కుల జాడ్యం ఇప్పుడు ఇక్క‌డ కూడా ప‌తాక స్థాయికి చేరే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

ఇప్పుడుప్పుడే తెలంగాణ‌లోనూ కులాన్ని చూసి ఓట్లేసే సంస్కృతి స్టార్ట్ అయ్యింది. ఇక రాజ‌కీయ పార్టీలు కూడా కులం ఓట్ల‌ను చూసి టిక్కెట్లు ఇస్తున్నారు. కేసీఆర్ కుల రాజ‌కీయాల్లోనూ.. లెక్క‌ల్లోనూ ఆరితేరిపోయి ఉన్నారు. ఇక‌ బీజేపీ కూడా కుల రాజ‌కీయాల‌పై ఫోక‌స్ చేసింది. తాజాగా సాగ‌ర్లో జ‌రుగుతోన్న ఉప ఎన్నిక‌నే తీసుకుంటే అక్క‌డ సీనియ‌ర్ నేత జానారెడ్డి బ‌రిలో ఉన్నారు. అక్క‌డ రెడ్డి సామాజిక వ‌ర్గంతో పాటు బీసీల్లో బ‌ల‌మైన యాద‌వ సామాజిక వ‌ర్గం ఓట‌ర్లు కూడా ఎక్కువే. ఇక జానారెడ్డి అక్క‌డ ద‌శాబ్దాలుగా పోటీ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న మ‌రోసారి పోటీ చేస్తున్నారు.

ఇక టీఆర్ఎస్ అభ్య‌ర్థి విష‌యంలో అనేక త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు ప‌డి చివ‌ర‌కు మృతి చెందిన నోముల కుమారుడు సీటు ఇచ్చారు. అక్క‌డ యాద‌వుల ఓట్లు ఎక్కువుగా ఉండ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఆ వ‌ర్గం ఓట్ల‌ను ఆక‌ర్షించేందుకే కేసీఆర్ నోముల కుమారుడికి సీటు ఇచ్చార‌ని టీఆర్ఎస్ వ‌ర్గాలే చెపుతున్నాయి. వాస్త‌వానికి టీఆర్ఎస్ సీటు రెడ్డి వ‌ర్గంలో చిన్న‌ప‌రెడ్డి, కోటిరెడ్డి ఆశించినా కేసీఆర్ కుల స‌మీక‌ర‌ణ‌ల్లో నోముల వార‌సుడికే సీటు ఇచ్చారు.

ఇక బీజేపీ సైతం ఇక్క‌డ సీటు ఆశించిన నివేదితా రెడ్డి, అంజ‌య్య యాద‌వ్ ల‌ను కాద‌ని ఆ పార్టీ ఎస్టీ వ‌ర్గానికి చెందిన ర‌వి నాయ‌క్ ను బ‌రిలో దింపింది. రెడ్డి, యాద‌వ వ‌ర్గాల‌కు కాంగ్రెస్‌, టీఆర్ఎస్ సీట్లు ఇవ్వ‌డంతో 43 వేల ఓట్లు ఉన్న ఎస్టీ వ‌ర్గానికి చెందిన డాక్ట‌ర్‌కు బీజేపీ సీటు ఇచ్చింది. ఏదేమైనా తెలంగాణ‌లో కులాల కంపు ఎలా సోకిందో సాగ‌ర్ ఉప ఎన్నికే ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌గా నిలిచింది. ఇది భ‌విష్య‌త్తులో మ‌రింత పెరుగుతుంద‌ని కూడా రాజ‌కీయ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.
Tags:    

Similar News