నాగార్జున సాగర్ లో ఓడిపోతే రాష్ట్రంలో బీజేపీ లేదు అని ఒప్పుకుంటుందా?

Update: 2021-03-02 06:30 GMT
ముందుగా మురిసిన బీజేపీకి ఇప్పుడు ముందుంది ‘ముసళ్లపండుగ’ అంటున్నారు అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు.. దుబ్బాక, జీహెచ్ఎంసీలో వాపును చూసి ఏదో అనుకుంటున్నా ఆ పార్టీ రాష్ట్రం అంతా మేమే అని..2023లో అధికారం మాదే అని డబ్బా కొట్టేసుకున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్, టీఆర్ఎస్ లు బలంగా ఉన్న నాగార్జున సాగర్ లో బీజేపీ దమ్మెంతో చూపించాలని ఆ పార్టీ నేతలు సవాల్ విసురుతున్నారు. ‘సాగర్ లో బీజేపీ ఓడిపోతే ఇక ఆపార్టీ పని రాష్ట్రంలో అయిపోయిందని ఒప్పుకుంటారా?’ అని ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించడంతో రాష్ట్ర బీజేపీలో ఒక్కసారికి ఊపు వచ్చింది. ఆ వెంటనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కమలం పార్టీ అనుకున్న వాటికంటే ఎక్కువ సీట్లు గెలుచుకోవడంతో ఇక టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ నాయకులు తొడలు కొట్టారు. అంతేకాకుండా త్వరలోనే టీఆర్ఎస్ ను ఓడగొట్టి అధికారంలోకి వస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పదే పదే చెబుతున్నారు. అయితే  ఇల్లు అలకగానే పండుగ కాదని టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు సవాల్ విసుతున్నారు.

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సయ్య మరణంతో ఇక్కడి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలయింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి దాదాపు ఖరారు అవగా.. టీఆర్ఎస్, బీజేపీలు అభ్యర్థలను ప్రకటించాల్సి ఉంది. అయితే ఆయా పార్టీల అభ్యర్థులు టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరోవైపు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

ఈ తరుణంలో  బీజేపీకి నాగార్జునసాగర్  పెద్ద సవాల్ గా మారనుంది. ఆ పార్టీకి సరైన అభ్యర్థి ఇక్కడ లేకపోవడంతో ఎవరా అన్న ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకడం లేదు. దీంతో ఇప్పటి వరకు జోష్ మీదున్నా ఆ పార్టీ నాయకులు కొద్ది రోజులుగా స్తబ్ధంగా ఉంటున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం నాగార్జున సాగర్ లో తమదే గెలుపని ప్రచారం చేసుకుంటున్నారు.

ఇదిలా ఉండగా  సాగర్ లో జరిగే ఉప ఎన్నికపై అధికార టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ లు బీజేపీకి సవాల్ విసుతున్నాయి. ‘నాగార్జున సాగర్ లో బీజేపీ ఓడిపోతే రాష్ట్రంలో బీజేపీ లేదని ఒప్పుకుంటారా..?’అని ప్రశ్నలు వేస్తున్నారు. దీనికి ఏ సమాధానం చెప్పాలో బీజేపీ నాయకులకు అర్థం కావడం లేదు. మొన్నటి వరకు రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా బీజేపీ నాయకులు అక్కడ వాలిపోయారు. కానీ ఇప్పుడు నాగార్జున సాగర్ ను దక్కించుకునేందుకు ఎవరినీ ఎంపిక చేయాలన్నదానిపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు.
Tags:    

Similar News