న‌ల్లారి వారి రీఎంట్రీ పిక్స్‌!

Update: 2018-06-27 04:40 GMT
చేతిలో ప‌వ‌ర్ ఉండి.. తానేం జ‌ర‌గ‌కూడ‌ద‌ని అనుకున్నారో అదే జ‌రిగితే అంత‌కు మించిన ఇబ్బంది మ‌రొక‌టి ఉండ‌దు. రాష్ట్ర విభ‌జ‌న కానీ జ‌రిగితే ఉమ్మ‌డి రాష్ట్ర ఆఖ‌రు ముఖ్య‌మంత్రిగా ఉండ‌కూద‌న్న‌ది న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి అభిమ‌తంగా చెప్పేవారు. చివ‌ర‌కు ఆయ‌న‌కు ఏ మాత్రం ఇష్టం లేని ప‌నే జ‌ర‌గ‌ట‌మే కాదు.. చ‌రిత్ర‌లో త‌న పేరు ఏపీ ఉమ్మ‌డి రాష్ట్ర ఆఖ‌రు సీఎం అని ఉండ‌కూడ‌ద‌ని ఎంత అనుకున్నా చివ‌ర‌కు అదే జ‌రిగింది.

విభ‌జ‌న నేప‌థ్యంలో తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసిన న‌ల్లారి.. ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య ఒక‌టి చేశారు. విభ‌జ‌న నిర్ణ‌యంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ క‌నుమ‌రుగైపోతోంద‌ని.. తెలంగాణ‌లోనూ తీవ్రంగా న‌ష్ట‌పోతుంద‌ని హెచ్చ‌రించారు. అప్ప‌ట్లో ఆయ‌న మాట‌ల్ని కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం సీరియ‌స్ గా తీసుకోలేదు. కానీ.. గ‌డిచిన నాలుగేళ్లలో చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో కిర‌ణ్ చెప్పిన మాట‌ల్లో నిజం కాంగ్రెస్ అధినాయ‌క‌త్వానికి అర్థ‌మైంద‌ని చెబుతారు.

కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీ సైతం ఇటీవ‌ల జ‌రిగిన పార్టీ స‌మావేశంలో న‌ల్లారి వ్యాఖ్య‌ల్ని ప్ర‌స్తావించ‌టం చూస్తే.. ఆయ‌న మాట‌ల ప్ర‌భావం ఎంత‌లా ఉందో అర్థ‌మ‌వుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల్లో ఉండ‌టం.. తెలంగాణ‌లో కాస్త బెట‌ర్ పొజిష‌న్లో ఉండ‌గా.. ఏపీలో క‌నుమ‌రుగు అయ్యే ప‌రిస్థితిలో ఉంది.

విభ‌జ‌న కార‌ణంగా ఏపీకి జ‌రిగిన న‌ష్టానికి క‌ర్త‌.. క్రియ‌.. అన్నీ కాంగ్రెస్ పార్టీనేన‌ని ఏపీ ప్ర‌జ‌లు ఫిక్స్ కావ‌ట‌మే కాదు.. ఆ పార్టీని ఏపీలో స‌మాధి క‌ట్టేశారు. రానున్న రెండు ద‌శాబ్దాల్లోనూ ఆ పార్టీ ఏపీలో కోలుకునేందుకు వీలు లేన‌ట్లు ఆగ్ర‌హాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

ఇలాంటి వేళ‌.. ఏపీలో పార్టీ ప‌రిస్థితిని స‌రిదిద్దేందుకు కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం దృష్టి సారించిన‌ట్లుగా తెలుస్తోంది. ఇటీవ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డితో జ‌రిపిన మంతనాల్లో ఏపీలో పార్టీ మ‌ళ్లీ కోలుకోవాలంటే ఏం చేయాల‌నే అంశం మీద కిర‌ణ్ కుమార్ రెడ్డి ఫీడ్ బ్యాక్ తీసుకున్న‌ట్లుగా చెబుతున్నారు. పార్టీ మాజీ చీఫ్ సోనియాతో కిర‌ణ్ భేటీ జ‌రిగింద‌ని.. ఈ సంద‌ర్భంగా ఏపీలో పార్టీ మ‌ళ్లీ జ‌వ‌స‌త్వాలు రావాలంటే ఏమేం చేయాలో సూచ‌న‌లు చేసిన‌ట్లుగా తెలుస్తోంది.
 
కిర‌ణ్ సూచ‌న‌ల‌పై సోనియా సానుకూలంగా స్పందించిన‌ట్లుగా స‌మాచారం. ఆయ‌న్ను తిరిగి పార్టీలోకి రావాల్సిందిగా కోరిన‌ట్లు తెలుస్తోంది. సోనియా ఆహ్వానంపై కిర‌ణ్ సానుకూలంగా స్పందించ‌ట‌మే కాద‌కుండా.. ఏపీలో పార్టీ ప‌రంగా తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై తాను స‌ల‌హాలు ఇస్తానని చెప్పార‌ని.. తాను ఏపీ రాజ‌కీయాల కంటే జాతీయ రాజ‌కీయాల్లో కీల‌క‌భూమిక పోషించాల‌ని భావిస్తున్న‌ట్లు చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి మ‌ళ్లీ కాంగ్రెస్‌లోకి రీఎంట్రీ ఇస్తార‌ని.. పార్టీకి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయ‌న మాట‌ల ప్ర‌భావం రానున్న రోజుల్లో మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.






Tags:    

Similar News