ఈ దర్బారు ఎప్పుడో పెట్టాల్సింది బాలయ్య

Update: 2015-06-24 09:09 GMT
అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న బాలయ్యబాబు మీద ఆ ఒక్క నియోజకవర్గ ప్రజలే కాదు.. మొత్తం అనంతపురం జిల్లా వాసులే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. ఎన్టీఆర్‌ కుటుంబానికి చెందిన వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం తమ జిల్లాలో ఉన్న నేపథ్యంలో.. మొత్తం జిల్లా స్థితి గతులు మారిపోతాయని.. పెద్దపెద్ద ప్రాజెక్టులు చాలానే వచ్చేస్తాయని ఆశ పడ్డారు.

ఎమ్మెల్యేగా ఎన్నికై ఏడాది గడిచినా.. జిల్లాలో పరిస్థితి పెద్దగా మారింది లేదు. ఎమ్మెల్యేగా బాలయ్యబాబు తన ముద్రను పెద్దగా చూపించలేకపోయారన్న విమర్శ కూడా ఉంది. మరి.. ఇలాంటి విమర్శలు బాలయ్యబాబు చెవిన పడ్డాయేమో కానీ.. ఆయన తాజాగా ప్రజాదర్బారు నిర్వహించారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలు తెలుసుకునేందుకు ఆయన రెండు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

దీనికి ఆదరణ బాగానే లభిస్తోంది. ఇలాంటి ప్రజాదర్బార్‌ను ప్రతి నెలా నిర్వహించాలని.. నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం పెద్దఎత్తున కృషి చేయాల్సి ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎప్పుడో చేపట్టాల్సిన ఈ కార్యక్రమం ఇప్పుడు నిర్వహించటం మీద కాస్తంత అసంతృప్తి వ్యక్తమైనా.. ప్రజాదర్బార్‌ను ప్రతినెలా కచ్ఛితంగా నిర్వహించేలా బాలయ్య ప్లాన్‌ చేస్తే.. ఆయనకు తిరుగు ఉండదని చెబుతున్నారు.

Tags:    

Similar News