రెండు గెలుపుల‌కే ఎంపీగారు రెచ్చిపోతున్నారే.. బెజ‌వాడ టాక్‌!!

Update: 2021-02-20 01:30 GMT
ఎన్నిక‌ల్లో గెలుపు, ఓటములు స‌హ‌జం. ఒక‌సారి గెలిచినంత మాత్రాన ప్ర‌జ‌లు కీర్తికిరీటం పెట్టిన‌ట్టుకాదు.. లేదా ఒక సారి ఓడినం త మాత్రాన‌.. అణిచేసిన‌ట్టు కూడా కాదు. ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌మ‌కు అనుకూలంగా ఉన్న నాయ‌కుడిని మాత్ర‌మే ప్ర‌జ‌లు ఎన్నుకుంటారు. ఎన్నికైన నాయ‌కుడు ప్ర‌జ‌ల‌కు, త‌న‌కు టికెట్ ఇచ్చిన పార్టీకి విధేయులై ఉండ‌డం అనేది స‌ర్వ స‌హ‌జం. అయి తే.. విజ‌య‌వాడ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచిన కేశినేని శ్రీనివాస్‌.. ఉర‌ఫ్ నాని మాత్రం.. దీనికి భిన్నంగా ఆలోచిస్తున్నార‌నే వాద‌న ఆది నుంచి ఉన్న‌ప్ప‌టికీ.. ఇటీవ‌ల కాలంలో మ‌రీ ఎక్కువైంది. 2014లో తొలిసారి ఎంపీ టికెట్ ద‌క్కించుకుని టీడీపీ త‌ర‌ఫున విజ‌యం సాధించారు నాని. ఆ త‌ర్వాత‌.. ఆయ‌న కొన్ని చిన్న‌పాటి స‌మ‌స్య‌లు ఎదుర్కొన్నా.. పార్టీ ఆయ‌న‌పై పెద్ద మ‌న‌సు చూపించింది.

దూకుడు పెంచి.. ఏకంగా ఐపీఎస్ అధికారుల‌ను హెచ్చ‌రించినా.. ఆర్టీయే ఆఫీసుపై దాడికి వెళ్లినా.. చంద్ర‌బాబు అప్ప‌ట్లో పోనీలే.. కొత్త ఎంపీ అనుకున్నారు. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో మ‌రోసారి విజ‌యం త‌ర్వాత మాత్రం నానిని ఎవ‌రూ ఆప‌లేక పోతున్నార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆయ‌న దూకుడు.. ఏకంగా.. పార్టీ అదినేత‌ను ప్ర‌శ్నించేస్థాయికి చేరిపోయింది. తాజాగా విజ‌య‌వాడ మేయ‌ర్ పీఠం విష‌యంపై అంత‌ర్గ‌తంగా సాగుతున్న టీడీపీ వివాదంలో నాని తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. 23 మంది ఎమ్మెల్యేల‌ను చంద్ర‌బాబు క‌లుపుకొన్న‌ప్పుడు ఎందుకు ప్ర‌శ్నించ‌లేదు? అప్ప‌ట్లో ఎందుకు మౌనంగా ఉన్నావ్‌? అంటూ.. త‌న వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌(బుద్దా వెంక‌న్న‌తో)ను పార్టీకి రుద్ది ఏకంగా పార్టీ అధినేత‌నే వివాదంలోకి లాక్కొచ్చారు.

అంత‌టితో ఆగ‌కుండా.. సోష‌ల్ మీడియాలోనూ అంద‌రూ నావెంట న‌డ‌వాల్సిన వాళ్లే! నా క‌నుస‌న్న‌ల్లోనే పార్టీ న‌డుస్తోంది!! అంటూ.. మ‌రింత వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు పోస్టు చేశారు.. ఇవి కూడా పార్టీని తీవ్రంగా ఇబ్బందిక‌ర ప‌రిస్థితిలోకి నెట్టేవే! అయితే.. ఇప్పుడు ఎవ‌రూ పైకి చెప్ప‌లేక పోయిన‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు వ‌ద్ద‌కు ఫిర్యాదులు ఇప్ప‌టికే గుట్ట‌లుగా పేరుకుపోయాయి. పార్టీ నుంచి బ‌య‌ట‌కు పంపించ‌డ‌మా? లేక క్లాస్ ఇవ్వ‌డ‌మా? అనే చ‌ర్చ‌కు నాని వివాదం దారితీస్తోంద‌ని.. అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల నుంచి అందుతున్న స‌మాచారం. టీడీపీకి విజ‌య‌వాడ కంచుకోట‌గా మార్చ‌డంలో నాని పాత్ర ఆవ‌గింజంత కూడా లేదు. గ‌తంలో నాయ‌కులు వేసిన బాట‌ల‌పై నాని న‌డుస్తున్నారు. కానీ.. ఆయ‌న వ్య‌వ‌హారం మాత్రం దీనికి భిన్నంగా ఉంది.. అని సోష‌ల్ మీడియాలో నానిపై వ్యాఖ్య‌లు ప‌డుతున్నాయి. ఏదేమైనా.. ఎన్నిసార్లు గెలిచినా.. విన‌యం.. విధేయ‌త‌.. ఆచి తూచి వ్య‌వ‌హ‌రించ‌డ‌మే.. నాయ‌కుడికి నిజ‌మైన రాజ‌కీయం అవుతుంద‌నేది మేధావుల మాట‌. మ‌రి నాని మార‌తారో.. బాబే మారుస్తారో.. చూడాలి.




Tags:    

Similar News