నారా, ద‌గ్గుబాటి క‌ల‌సిన వేళ‌!

Update: 2022-06-22 04:13 GMT
ఇటీవ‌ల వ‌ర‌కు ఉప్పూనిప్పుగా ఉన్న దివంగ‌త ముఖ్య‌మంత్రి, టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ అల్లుళ్లు ఇద్ద‌రూ క‌ల‌సిపోయారు. మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, మాజీ ఎంపీ ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు ఒక్క‌ట‌య్యారు. మ‌న‌సు విప్పి ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఇందుకు హైద‌రాబాద్ జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్ప‌త్రి వేదికైంది. ఎన్టీఆర్ పెద్ద అల్లుడు, కేంద్ర మాజీ మంత్రి ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి భ‌ర్త‌ దగ్గుబాటి వెంకటేశ్వరరావు జూన్ 21న టెన్సిస్ ఆడుతూ తీవ్ర‌ అస్వస్థతకు గురయ్యారు. గుండెలో నొప్పిగా ఉంద‌న‌డంతో ఆయ‌న‌ను హుటాహుటిన జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు.

వైద్యులు పరీక్షించి గుండెపోటు వచ్చినట్టు నిర్ధారించారు. ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ మనోజ్‌ అగర్వాల్‌ ఆధ్వర్యంలోని వైద్యుల బృందం దగ్గుబాటికి యాంజియోప్లాస్టి నిర్వహించి రెండు స్టెంట్లు అమర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడుతున్నట్టు తెలిపారు. ఈ విష‌యం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అపోలో ఆసుపత్రికి వెళ్లి త‌న తోడ‌ల్లుడు దగ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావుని పరామర్శించారు. వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చంద్ర‌బాబు నాయుడు ఆస్ప‌త్రికి వ‌చ్చిన‌ప్ప‌డు ప‌క్క‌నే పురందేశ్వ‌రి కూడా అక్క‌డే ఉన్నారు.

కాగా 1995లో ఎన్టీఆర్ ను ముఖ్య‌మంత్రి ప‌ద‌వి నుంచి ప‌ద‌వీచ్యుతిడిని చేశాక చంద్ర‌బాబు, ద‌గ్గుబాటి మ‌ధ్య విబేధాలు పొడ‌సూపాయి. ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు, ఆయ‌న స‌తీమ‌ణి పురందేశ్వ‌రి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పురందేశ్వ‌రి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా 2004, 2009లో బాప‌ట్ల‌, విశాఖ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 2014లో రాజంపేట నుంచి బీజేపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగి ఓడిపోయారు. మ‌రోవైపు ద‌గ్గుబాటి వెంకటేశ్వ‌ర‌రావు గతంలో రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ప‌నిచేశారు. టీడీపీ, కాంగ్రెస్ త‌ర‌ఫున ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ప్ర‌స్తుతం రెండు కుటుంబాల మ‌ధ్య పాత సంబంధాలు చిగురిస్తున్నాయి. చంద్ర‌బాబు సతీమ‌ణి భువ‌నేశ్వ‌రిపై వైఎస్సార్సీపీ నేత‌లు అస‌భ్య వ్యాఖ్య‌లు చేసిన‌ప్పుడు వాటిని పురందేశ్వ‌రి తీవ్రంగా ఖండించారు. ఈ నేప‌థ్యంలో పురందేశ్వ‌రి టీడీపీలో చేర‌తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమెను గుడివాడ నుంచి ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా బ‌రిలో దించుతార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదే జ‌రిగితే ప్ర‌స్తుత వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి చిక్కులు త‌ప్ప‌వ‌ని అంటున్నారు.
Tags:    

Similar News