సక్సెస్ సీక్రెట్ : కాస్తా గమ్మునుండు బాబూ....?

Update: 2022-05-23 00:30 GMT
ఏపీలో రాజకీయం మారుతోంది. ఊహించనంత వేగంగా మారుతోంది. నిజానికి మూడేళ్ళ తరువాత కూడా వైసీపీ మీద పెద్దగా వ్యతిరేకత రాలేదని ఇన్నాళ్ళూ అంతా అనుకున్నారు. ఆశ్చర్యపడ్డారు. విశ్లేషకులు అయితే విస్తుపోయారు. కానీ కరోనా పుణ్యమాని విపక్షం వీధులల్లోకి వచ్చిన దాఖాలాలు  ఇప్పటిదాకా లేకనే అలా అణిగి ఉంది. ఇపుడు చంద్రబాబు ఒక వైపు పవన్ మరో వైపు ఏపీలో జిల్లాల  టూర్లు వేయడంతోనే జనాల్లో అసంతృప్తి మెల్లగా మొదలై దావానలంగా మారుతోంది. అదే టైమ్ లో వైసీపీ గ్రాఫ్ గతంతో పోలిస్తే బాగా తగ్గిపోతోంది.

ఇదంతా ఎవరూ ఊహించని విషయమే. 151 సీట్లు వచ్చిన పార్టీ. జగన్ చెప్పినట్లుగా మూడు దశాబ్దాల పాటు కాదు కానీ కనీసం మరో టెర్మ్ అయినా వైసీపీ వంక తేరిపారా  చూడలేమని చతికిలపడిన టీడీపీకి మూడవ ఏటి నుంచే మంచి రోజులు వచ్చేశాయి. ఇంకా రెండేళ్ళ అధికారం వైసీపీ చేతులలో ఉండగానే ఏపీలోని మెజారిటీ జిల్లాలలో ఫ్యాన్ పార్టీకి ప్రమాదకర ఘంటికలు మోగుతున్నాయి.

దీంతో ఎక్కడ చూసినా ఒక్కటే మాట. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గ్యారంటీగా వస్తుంది. అయితే దానికి గానూ చంద్రబాబు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయన ఎలాంటి అవకాశాన్ని అధికార పక్షానికి ఇవ్వకూడదు, అంతే కాదు ఆయన గమ్మున ఉంటే చాలు, ఎంత వీలైతే అంతలా జనాలలో ఉంటూ వారితోనే తన రాజకీయం చేసుకుంటే చాలు, పవర్ వచ్చి పళ్ళెంలో పడినట్లే అంటున్నారు.

ఇక బాబు కొన్ని రకాల కామెంట్స్ కి కూడా స్వస్తి పలకాలని సూచిస్తున్నారు. పొత్తుల అర్ధాలు వచ్చేలా బేల మాటలు మాట్లాడడం తగ్గించడంతో పాటు వైసీపీ బలంగా ఉంది అన్న సంకేతాలను జనంలోకి పంపించకుండా ఉంటే మేలు అంటున్నారు. ఇక 2014 ఎన్నికలలో మాదిరిగా బాబు ఆరు వందలకు పైగా హామీలు కూడా ఇవ్వాల్సిన పని ఈసారి  లేదని కూడా అంటున్నారు.

ఆయన అధికారం కోసం లేని పోని వాగ్దానాలు చేయకుండా ఏపీని గాడిన పెడతాను, మీ అందరినీ నేనున్నాను అన్న ఒక్క మాటతో ఈ రెండేళ్ళూ జనంలో తిరిగితే చాలు పట్టం కట్టడానికి జనాలు సిద్ధంగా ఉన్నారు అని అంటున్నారు. మరి చంద్రబాబు అతి జాగ్రత్తలకు పోయి పొత్తుల పేరిట చేయి కాల్చుకోకుండా తన బలం మీద విశ్వాసం తగ్గించుకుని హామీలు ఇచ్చేసి ఆ తరువాత పవర్ లోకి వచ్చి తల బొప్పి కట్టించుకోకుండా జాగ్రత్తగా ఉంటేనే బెటర్ అన్న మాట వినిపిస్తోంది.

మొత్తానికి టీడీపీకి మంచి రోజులు వచ్చాయి. ఈసారి ఏ వరాలు ఇవ్వనవసరం లేదు, ఏ వివరాలూ చెప్పనవసరం లేదు అని అంటున్నారు. బాబు మాత్రం గమ్మున ఉండాలి.  అయితే ఇక్కడే పెద్ద చిక్కు ఉంది. బాబు గమ్మున ఉండే రకం కాదుగా. పైగా ఆయన గంటలకు గంటలు మాట్లాడి ఎక్కడో ఏదో రకమైన ప్రకటనలు చేస్తారన్న కంగారు అయితే సొంత పార్టీ వారి కంటే కూడా ఏపీ అభివృద్ధిని కోరుకునే వారిలోనే ఎక్కువగా ఉంది.

ఏపీ ప్రగతి గతి మారాలీ అంటే బాబు సంక్షేమ రధాన్ని అభివృద్ధి పధం వైపుగా మళ్ళించాలి. మరి బాబు వ్యూహాలే ఇపుడు ఆయుధాలుగా మారాలి. అంతే కానీ హామీలతో గద్దెనెక్కే రోజులు కావివి. భరోసాగా నిలిచి అందలాన్ని అందుకునే కాలమిది. ఇది చంద్రబాబుకు అనుకూలం. మరి ఆయన సద్వినియోగం చేసుకుంటారా లేదా అన్నది చూడాలి.
Tags:    

Similar News