జ‌గ‌న్‌పై చంద్ర‌బాబు ఫైర్‌.. కోన‌సీమ క‌ష్టంపై కామెంట్లు!

Update: 2022-05-31 12:59 GMT
ఇటీవ‌ల అల్ల‌ర్ల‌తో అట్టుడికిన కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ఇంటర్నెట్‌ సేవలను ప్ర‌భుత్వం నిలిపి వేసిన విష‌యం తెలిసిందే. అయితే.. ఈ ఘ‌ర్ష‌ణ‌లు స‌ర్దు మ‌ణిగి వారంరోజులు అయినా.. ఇంట‌ర్ నెట్ మాత్రం పునరుద్ధరించకపోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజులైనా పునరుద్ధరించకపోవడం.. వైసీపీ అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. కశ్మీర్‌లో వినిపించే ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేత వార్తలు.. ఇక్కడా వినాల్సి రావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

కోనసీమలో వారం రోజులైనా ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించకపోవడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమని  చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎక్కడో క‌శ్మీర్లో వినిపించే 'ఇంటర్నెట్ సేవలు నిలిపివేత' అనే వార్తను మన సీమలో వినాల్సి రావడం బాధాకరమన్నారు. ఐటీ వంటి ఉద్యోగాలు ఇవ్వలేని ఈ ప్రభుత్వం.. కనీసం వాళ్లు పని చేసుకునే వెసులుబాటు కూడా లేకుండా చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంటర్నెట్ అనేది ఇప్పుడు సామాన్యుడి జీవితంలో కూడా భాగమైందన్న విషయాన్ని ప్రభుత్వం తెలుసుకోవాలని హితవు పలికారు. చిరు వ్యాపారుల లావాదేవీలు కూడా నెట్ ఆధారంగా నడిచే ఈ రోజుల్లో వారం రోజులు సేవలు నిలిపివేయడం సరికాదన్నారు. వెంటనే కోనసీమలో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధ రించాలని డిమాండ్ చేశారు. ఇది లక్షల మంది ప్రజలకు సంబంధించిన విషయమని, ప్రభుత్వ ఉదాసీనత... వారికి ఇబ్బందిగా మారకూడదని చంద్రబాబు సూచించారు.

``చిరు వ్యాపారుల లావాదేవీలు కూడా నెట్ ఆధారంగా నడిచే రోజుల్లో వారం రోజులు సేవలు నిలిపివేయడం సరికాదు. వెంటనే కోనసీమలో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నా. ఇది లక్షల మంది ప్రజలకు సంబంధించిన విషయం.  మీ ఉదాసీనత వారికి ఇబ్బందిగా మారకూడదు`` అని చంద్ర‌బాబు వ‌రుస ట్వీట్లు చేశారు.

ఏం జ‌రిగిందంటే..

 కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన విధ్వంసానికి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులే ప్రధాన కారణంగా గుర్తించిన పోలీసులు.. అధికారుల ఆదేశాలతో అంతర్జాల సేవలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పుడు దాని ప్రభావం అమలాపురం స‌హా 10 కిలోమీటర్ల ప‌రిధిలో ఉన్న ముమ్మడివరంలోని వ్యాపారులపైనా పడింది. ఇంటర్నెట్ అందుబాటులో లేక నెట్ సెంటర్లు మూతపడ్డాయి. చిరు వ్యాపారులు, రిజర్వేషన్ బుకింగ్ సెంటర్లు, మందుల దుకాణాలు, సెల్ ఫోన్ రీఛార్జ్ సెంటర్ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏ చిన్న వస్తువు కొనుగోలు చేసినా.. డిజిటల్ పేమెంట్ చేయటానికి అలవాటు పడినవారు.. ప్రస్తుతం నెట్ సేవలు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించాలని కోరుతున్నారు.
Tags:    

Similar News