బాబు అందుకే గ్రేట్ : తండ్రితో వైరం... తనయుడితో స్నేహం...

Update: 2022-07-07 15:05 GMT
చంద్రబాబు అంటే గ్రేట్ అని అందుకే అంటారు. ఆయనను చూసి రాజకీయ సిద్ధాంతాలను పునర్ నిర్వచించాల్సి ఉంటుందేమో. ప్రపంచ రాజకీయ చరిత్ర చూసిన వారు  కొన్ని రకాల నిర్ధిష్ట  సూత్రాలను రాజకీయాలకు ఆపాదిస్తూ వస్తున్నారు. కానీ బాబు లాంటి రాజకీయ నాయకులను చూస్తే మాత్రం వాటిని ఇంకా సవరించుకోవాల్సి ఉంటుంది. బాబు కాలేజీ రోజుల్లో ఆర్ధిక శాస్త్రం చదివారు. కానీ ఆయన పాలిటిక్స్ ని ఏకంగా పరిశోధన చేశారు. ఆ మూల నుంచి ఈ మూల దాకా శోధించి సాధించి వదిలిపెట్టారు.

ఇక బాబు సొంత జిల్లా చిత్తూరు. అక్కడే ఆయన బలాలూ బలహీనతలు స్నేహాలు, వైరాలు అన్నీ కనిపిస్తాయి. బాబు రాజకీయ జీవితం మొదలయ్యే టైమ్ లో కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా  విద్యార్ధి నాయకుడిగా ఆయన తన నాయకత్వ లక్షణాలకు పదును పెట్టారు. బాబు పొలిటికల్ ఎంట్రీ నాటికి చిత్తూరు జిల్లాలో తలపండిన నేతలు చాలా మంది ఉండేవారు. వారిలో ఆనాటి దిగ్గజ నేత‌ నల్లారి అమరనాధ రెడ్డి కూడా ఒకరు.

ఆయన ఏకంగా 1962లోనే ఎమ్మెల్యేగా పోటీ చేసి నెగ్గేశారు. అయితే వయసు సరిపోదు అన్న కారణం చేత ఆయన ఎన్నికను న్యాయస్థానం రద్దు చేసింది. అలా నూనూగు మీసాల నూతన  యవ్వన ప్రాయంలోనే అమరనాధ్ రెడ్డి తానేంటో ప్రూవ్ చేసుకున్నారు. అంతేనా ఆ తరువాత ఆయన నాలుగు సార్లు వాయల్పాడు నుంచి ఎదురులేని  ఎమ్మెల్యేగా గెలిచారు. మర్రి చెన్నారెడ్డి, అంజయ్య, భవనం వెంకటరామిరెడ్డి మంత్రివర్గంలో కూడా మంత్రిగా పనిచేశారు.

అలాంటి సీనియర్ మోస్ట్ లీడర్ ని బాబు కాంగ్రెస్ లో ఉండగానే ఢీ కొట్టారు. బాబు ఫస్ట్ టైమ్ 1978లో చంద్రగిరి నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా నెగ్గారు. ఆయనకు అంజయ్య క్యాబినేట్ లో మంత్రి పదవి దక్కింది. సొంత నియోజకవర్గంలో సీనియర్ గా అప్పటికే మంత్రిగా ఉన్న అమరనాధ్ రెడ్డికి ఎదురు నిలిచి తనకంటూ ఒక వర్గాన్ని కాంగ్రెస్ లో బాబు తయారు చేసుకున్నారు. అలా అమరనాధ్ రెడ్డికి యాంటీగా పాలిటిక్స్ చేసిన బాబు గురించి నల్లారి ఫ్యామిలీకి బాగా తెలుసు.

ఆ వైరం అలా వారసుల దాకా కంటిన్యూ అయింది కూడా. అమరనాధ్ రెడ్డి మరణించాక ఆయన పెద్ద కుమారుడు కిరణ్ కుమార్ రెడ్డి 1989లో పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చారు. ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2011లో ఉమ్మడి ఏపీకి చివరి సీఎం గా కూడా చేశారు. నల్లారి ఫ్యామిలీకి నారా వారికీ మధ్య రాజకీయ వైరం అందరికీ తెలిసిందే.

అది వైఎస్సార్ ఉన్నపుడు బాగా మంట పెట్టింది కూడా. వైఎస్సార్ ఏరి కోరి మరీ కిరణ్ కుమార్ రెడ్డిని స్పీకర్ గా చేసి బాబును ఇరకాటంలో  పెట్టారు. కిరణ్ కుమార్ రెడ్డి సైతం విపక్ష నేత అయిన  బాబుని స్పీకర్ గా తన అధికారాలతో బాగా  కట్టడి చేసేవారు అని చెబుతారు. చిత్రంగా జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాక కిరణ్ కుమార్ రెడ్డికి బాబుకు మధ్య తెర వెనక అవగాహన కుదిరింది అని అంటారు. దాని ఫలితమే వైసీపీ కిరణ్ సర్కార్ మీద ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా టీడీపీ ఓటేసి కిరణ్ సర్కార్ ని కాపాడింది. ఇది ఫ్లాష్ బ్యాక్.

ఇవన్నీ పక్కన పెడితే విభజన తరువాత కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు నల్లారి కిశోర్ రెడ్డి టీడీపీలో చేరిపోయారు.  దాన్ని చూసిన వారు నాడే ముక్కున వేలేసుకున్నారు.  అలా 2014, 2019లలో ఆయన పీలేరు నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. అయితే 2024లో మళ్లీ ఆయనకే బాబు టికెట్ ఇస్తారని అంటున్నారు. ఈసారి పీలేరులో కిశోర్ రెడ్డి విజయావకాశాలు బాగా ఉన్నాయని చెబుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే అన్నమయ్య  జిల్లా టూర్ లో భాగంగా అక్కడికి వచ్చిన బాబు నల్లారి కొశోర్ రెడ్డి సొంత ఊరు నగరిపల్లెకు వెళ్ళి అక్కడ అల్పాహారం తీసుకోవడం రాజకీయ వింతగానే చెబుతున్నారు.

ఎందుకంటే చంద్రబాబు చివరిసారిగా నగరిపల్లెకి నల్లారి వారి ఇంటికి వెళ్ళింది మూడు దశాబ్దాల క్రితమే అంటున్నారు. అమరనాధ్ రెడ్డితో అలా దీర్ఘకాల రాజకీయ వైరం నెరిపిన బాబుకు తనయుడు కిశోర్ రెడ్డిలో స్నేహితుడు కనిపించడమే బాబు మార్క్ పాలిటిక్స్ అంటున్నారు. మొత్తానికి రాజకీయాల్లో శతృవులు ఎవరూ ఉండరు అని అంటారు. దానికి నిలువెత్తు ఉదాహరణ బాబు రాజకీయాలే అని అనుకున్నా తప్పు లేదేమో.
Tags:    

Similar News