తగ్గేదిలే : మారిన బాబు...తమ్ముళ్ళ పరేషాన్...?

Update: 2022-08-14 14:30 GMT
చంద్రబాబు అంటే ఒకరకమైన ఆలోచన పార్టీ వర్గాలలో ఉంది. ఆయన ముందు ఎంత తప్పు చేసినా క్షమించేస్తారు అని. నిజమే బాబుకు నాయకుల విలువ తెలుసు. ఒకరిని పోగొట్టుకుంటే కష్టమనే ఆయన ఇంతకాలం అందరినీ అలా పెద్ద మనసులో తప్పులను చూసీ చూడనట్లుగా క్షమిస్తూ వచ్చారు. కానీ ఇపుడు చూస్తే ఏకంగా టీడీపీ పుట్టె మునిగే పరిస్థితి వచ్చేసింది. పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు విపక్షంలో ఉన్నపుడు కూడా పనిచేయకుండా కేవలం నాయకుడి రెక్కల కష్టం మీద ప్రజల ఆదరణ మీద గెలుస్తూ వస్తున్న వారే చాలా మంది కనిపిస్తున్నారు.

పైగా విపక్షంలో ఉంటే గమ్మున ఉంటూ తమ పబ్బం గడుపుకుంటూ అధికార పక్షంలో తెరచాటు లాలూచీలు పడేవారు కూడా కనిపిస్తున్నారు. ఇలాంటి వారి విషయంలో మూడవ కన్ను తెరవాల్సిన సమయం వచ్చిందని బాబు ఆలస్యంగా అయినా గుర్తించారుట. అందుకే అలాంటి నాయకులు వద్దే వద్దూ నుకుంటున్నారు. దాంతో ముందుగానే తమ సొంత జిల్లా నుంచే ప్రక్షాళన బాబు మొదలెట్టారని అంటున్నారు. కొత్తగా ఏర్పడిన తిరుపతి జిల్లాలో నరసింహయాదవ్ అనే సీనియర్ నాయకుడు ఇటీవల జరిగిన తిరుపతి అర్బన్ బ్యాక్ ఎన్నికల్లో అధికార పార్టీతో లాలూచీ పడి సొంత పార్టీని దెబ్బేశారు అన్న ఆరోపణలు వచ్చాయి. దాని మీద టీడీపీ పెద్దలకు కూడా అనుమానాలు ఉన్నాయట.

దాంతో ఈ నరసింహయాదవ్ ని పక్కన పెట్టాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. ఆయనను తుడా చైర్మన్ గా కూడా పార్టీ అధికారంలో ఉన్నపుడు ఎంపిక చేసి కీలక పద‌వి ఇచ్చారు. అయితే ఇపుడు మాత్రం ఆయన పోకడలను చూసిన హై కమాండ్ ఇక ఉపేక్షించకూడదు అని నిర్ణయం తీసుకుందిట. ఈయన సీనియర్ నేత. పైగా తిరుపతి పరిధిలో పెద్ద సంఖ్యలో యాదవ సామాజికవర్గం ఉంది. దాంతో ఆయన మీద చర్యలు ఎందుకు అని ఒక విధంగా ఆలోచించారుట.

కానీ ఇపుడు చూస్తే పరిస్థితి మారుతోంది కాబట్టి తప్పదని కూడా బాబు భావిస్తున్నారుట. దాంతో యాదవ సామాజికవర్గానికి చెడు సంకేతాలు పోకుండా అదే సామాజికవర్గానికి చెందిన  అక్షింతల క్రిష్ణ యాదవ్ ని తిరుపతి పాలమెంట్ తెలుగు యువత ప్రెసిడెంట్ గా నియమించారుట. ఇదే తీరున తిరుపతిలోని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆమె అల్లుడిని కూడా పార్టీ పక్కన పెట్టనుందని అంటున్నారు.

అలాగే గోదావరి జిల్లాలకు చెందిన ఒక పెద్ద నాయకుడి విషయంలో కూడా పార్టీ ఇలాగే వ్యవహరించనుంది అని తెలుస్తోంది. ఇక ఉత్తరాంధ్రాలో కూడా కీలక నేతలు కొందరు ఉన్నారు. సీనియర్ మోస్ట్ లీడర్స్ వారు. మంత్రులుగా పనిచేశారు. అలాంటి నాయకుల విషయంలో కూడా పార్టీ కఠినంగా ఉందని అంటున్నారు. పదవులు లేవు, టికెట్ల ఆశలు లేవు ఉంటే ఉండవచ్చు లేకపోతే మీ ఇష్టమని చెప్పడానికి రెడీ అవుతోందిట. మొత్తానికి చూస్తే ఇలాంటి నేతల లిస్ట్ ఉంచుకుని వారిని సైడ్ చేయడం, కొత్త వారికి యువతకు చాన్స్  ఇవ్వడమే బాబు ఆలోచన అంటున్నారు. మరి చంద్రబాబు ఇలా విశ్వరూపం చూపిస్తే టీడీపీలో ఉంటూ అక్కడ తింటూ పార్టీకి పెద్దగా ఉపయోగపడని నేతలకు గండం వచ్చినట్లే.
Tags:    

Similar News