ఆ నేత‌ల‌కు చంద్ర‌బాబు ఫైన‌ల్ ఆల్టిమేటం ఇచ్చేసిన‌ట్టేనా?

Update: 2022-09-04 06:30 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్ల స‌మ‌యం కూడా లేదు. ఈ నేప‌థ్యంలో అన్ని పార్టీలు విజ‌యమే ల‌క్ష్యంగా త‌మ వ్యూహ‌, ప్ర‌తివ్యూహాల‌కు ప‌దునుపెడుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి వైఎస్సార్సీపీకి గ‌ట్టి గుణ‌పాఠం నేర్పాల‌న్న లక్ష్యంతో ఉన్నారు.. ప్ర‌తిప‌క్ష నేత‌, టీడీపీ అధినేత.. చంద్ర‌బాబు. ఈ నేప‌థ్యంలో త‌ర‌చూ ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జులతో, పార్టీ నేత‌ల‌తో స‌మావేశాలు నిర్వ‌హిస్తూ పార్టీ ప‌రిస్థితిని ఆరా తీస్తున్నారు. పార్టీ బలోపేతానికి సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇస్తున్నారు.

తాజాగా గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరిలో జ‌రిగిన పార్టీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నేత‌ల‌కు సున్నిత హెచ్చ‌రిక‌లు జారీ చేసినట్టు టీడీపీ అనుకూల ప‌త్రిక ఒకటి క‌థ‌నం ప్ర‌చురించింది. గ‌తానికి భిన్నంగా, త‌న వైఖ‌రికి భిన్నంగా మొహ‌మాటాన్ని వ‌దిలిపెట్టి చంద్ర‌బాబు త‌న పార్టీ నేత‌ల‌కు క్లాస్ తీసుకున్నార‌ని ఆ ప‌త్రిక పేర్కొంది.

ఆ ప‌త్రిక క‌థ‌నం ప్ర‌కారం.. టీడీపీలో కొంత‌మంది నేత‌లు ఒళ్లు వంచ‌డం లేద‌ని చంద్ర‌బాబు మందలించారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరు, ప్ర‌భుత్వ వ్య‌తిరేక కార్య‌క్ర‌మాలపై కొంత‌మంది నేత‌లు నిర్లక్ష్యం వ‌హిస్తున్నార‌ని చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశార‌ని స‌మాచారం. త‌మ‌ను పోలీసులు గృహ‌నిర్బంధంలో ఉంచార‌ని చెబుతూ.. ఆయా కార్య‌క్రమాల్లో పాల్గొన‌డం లేద‌ని మంద‌లించినట్టు తెలుస్తోంది. కొంత‌మంది నేత‌లు పోలీసుల‌తో వాదించి.. గృహ‌నిర్బంధాల‌ను ఛేదించుకుని పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటుంటే మీరెందుకు ఆ ప‌ని చేయ‌లేక‌పోతున్నారంటూ కొంత‌మంది నేత‌ల‌ను చంద్ర‌బాబు నిల‌దీసిన‌ట్టు ఆ ప‌త్రిక పేర్కొంది.

ప్ర‌భుత్వ వ్య‌తిరేక కార్య‌క్ర‌మాలు, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటే కేసులు పెడ‌తార‌ని.. అయితే ఏమవుతుంద‌ని చంద్ర‌బాబు త‌న పార్టీ నేత‌ల‌ను ప్ర‌శ్నించిన‌ట్టు స‌మాచారం. త‌న‌తోపాటు త‌న కుమారుడు నారా లోకేష్, మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు వంటివారిపైనా కేసులు పెట్టార‌ని చంద్ర‌బాబు గుర్తు చేసిన‌ట్టు స‌మాచారం. అలాగే ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడే నేత‌ల‌పై కొన్ని కేసులు పెడ‌తార‌ని.. కేసుల‌కు భ‌య‌ప‌డి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌క‌పోతే ఎలా అని చంద్ర‌బాబు గ‌ట్టిగానే కొంత‌మంది నేత‌ల‌కు క్లాస్ తీసుకున్నార‌ట‌.

ఇకపై పార్టీ కార్య‌క్ర‌మాలు, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై నిర్వ‌హించే పోరులో పాల్గొన‌ని వారిని నిశితంగా ప‌రిశీలిస్తామ‌ని చంద్ర‌బాబు హెచ్చ‌రించిన‌ట్టు స‌మాచారం. పోరాడ‌కుండా ఇంట్లోనే కూర్చుని.. న‌టిస్తున్న‌వారి వివ‌రాల‌ను రికార్డు చేస్తామ‌ని చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ఇలాంటి నేత‌ల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు కూడా ఇచ్చేది లేద‌ని చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు స‌మాచారం. నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉండి కూడా కొంత‌మంది నేత‌లు ఆయా కార్య‌క్ర‌మాల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. కార్య‌క‌ర్త‌ల‌కు అండ‌గా నిల‌బ‌డాల్సిన అవ‌సరం లేదా అని చంద్ర‌బాబు ప్ర‌శ్నించినట్టు తెలుస్తోంది. ఎవరు ప‌నిచేస్తున్నారో.. ఎవ‌రు ప‌నిచేయ‌డం లేదో పార్టీ కార్యాలయానికి మొత్తం సమాచారం వస్తోంద‌ని చంద్ర‌బాబు పార్టీ నేత‌ల‌కు హెచ్చ‌రికలు జారీ చేశార‌ని చెబుతున్నారు.

వాస్తవానికి ప్రతిపక్షంలో ఉన్న‌ప్పుడే నేత‌లుగా ఎదుగుతార‌ని చంద్ర‌బాబు పార్టీ నేత‌ల‌కు చెప్పార‌ని స‌మాచారం. పార్టీ కోసం పనిచేయనివారిని ఎత్తుకొని మోయాల్సిన అవసరం త‌న‌కు లేద‌ని చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు తెలుస్తోంది. పార్టీకేమీ నాయకుల కొరత లేద‌ని.. ప్రతిచోటా 10 మంది సిద్ధంగా ఉన్నార‌ని చంద్ర‌బాబు కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెబుతున్నారు. ఇప్ప‌టికి కూడా కొంత‌మంది పార్టీ నేత‌లు మార‌క‌పోతే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించాని పేర్కొంటున్నారు.
Tags:    

Similar News