ఎమ్మెల్సీగా లోకేష్‌...జిల్లా, తేదీ ఖ‌రారైంది

Update: 2017-02-21 11:25 GMT
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌రిపాల‌న‌లో భాగం చేయ‌డానికి మ‌రో ముందడుగు ప‌డిన‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లో ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన సీఎం చంద్ర‌బాబు ఈ క్ర‌మంలో తూర్పు గోదావరి జిల్లా నుంచి ఎమ్మెల్సీగా లోకేష్‌ ను పోటీ చేయించ‌నున్నట్లు విశ్వసనీయ సమాచారం. త‌న‌కు ఇష్ట‌మైన తూర్పు గోదావ‌రి జిల్లా సెంటిమెంట్‌ తో పాటు మంత్రి పదవి ఇచ్చేందుకు  తూర్పుగోదావరి జిల్లాను సీఎం చంద్రబాబు ఎంచుకున్నట్లు సమాచారం.

తూర్పుగోదావరి జిల్లాలో స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి సభ్యుడుగా ఉన్న బొడ్డు బాస్కర రామారావు పదవీ కాలం ముగిసింది. ఆ స్థానానికి మార్చి 17న ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. నోటిఫికేషన్‌ మంగళవారం విడుదల చేసి, నామినేషన్లు స్వీకరించనుంది. తాజా మాజీ కానున్న బొడ్డు బాస్కర రామారావు తిరిగి తనకే అవకాశం ఇవ్వాలని అధినేత చంద్రబాబును వేడుకున్నారు. ఆయనతోపాటు జిల్లా నుంచి మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు - టీడీపీ సీనియర్ నేత గన్ని కృష్ణ తదితరులు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు.అయితే సీఎం చంద్రబాబునాయుడు మాత్రం తన తనయుడిని తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎమ్మెల్సీగా గెలిపించి, మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి కట్టబెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారని అంటున్నారు. లోకేష్‌ కు శాస‌న‌మండ‌లి పదవి కట్టబెట్టేందుకు జిల్లా పార్టీ ముఖ్య నేతలు ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ కోసం ప్రయత్నిస్తున్న సీనియర్లను బుజ్జగించేందుకు జిల్లాలోని ఇద్దరు మంత్రులు కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. లోకేష్‌ జిల్లా నుంచి ఎమ్మెల్సీ అయితే జిల్లా భవిష్యత్‌ బాగుంటుందని, నాయకులకు మంచి కాలం వచ్చినట్లేనని చెబుతున్నట్లు తెలిసింది. ఇందుకోసం చర్చలు నిర్వహించేదుకు లోకేష్‌ మంగళవారం జిల్లాకు  వ‌స్తున్నార‌ని స‌మాచారం. స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ పదవికి ఈ నెల 28న నారా లోకేష్‌ నామినేషన్‌ దాఖలు చేయనున్నట్లు విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News