జగన్ కు షాకిస్తూ సైకిల్ ఎక్కే డేట్ చెప్పేసిన నారాయణరెడ్డి

Update: 2021-10-17 12:57 GMT
తాను ప్రాతినిధ్యం వహించే సొంత జిల్లా చిత్తూరులోనే టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి ఇబ్బందికరంగా మారిన సంగతి తెలిసిందే. ఆ మధ్య జరిగిన స్థానిక ఎన్నికలు.. ఈ మధ్యనే వెల్లడైన పరిషత్ ఎన్నికల ఫలితాలతో సొంత జిల్లాలోనూ బాబుకు పట్టు లేదన్న వాదన పెరిగింది. ఇలాంటి వేళ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాకడపలో టీడీపీ పరిస్థితి మహా ఇబ్బందికరంగా మారింది. అధికారంలో ఉన్న వేళలో ఉప్పు.. నిప్పును ఒకేచోటకు తీసుకొచ్చిన ప్రయోగం వికటించటం.. ఇద్దరు నేతలు ఓటమి తర్వాత చేరో పార్టీలో చేరిపోవటం తెలిసిందే. దీంతో.. కడప జిల్లాలో టీడీపీ తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది.

ఇలాంటివేళ.. మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ నెల 20న చంద్రబాబు సమక్షంలో తాను.. తన కుమారుడు టీడీపీలో చేరనున్నట్లుగా ప్రకటించి బాబుకు ఊరటను ఇస్తే.. ఈ వ్యవహారం జగన్ కు షాకింగ్ గా మారింది. జమ్మలమడుగులో టీడీపీకి పూర్వవైభవం తెస్తానంటూ భారీ డైలాగుల్నిచెబుతున్నారు నారాయణరెడ్డి. నిజంగా అలాంటి పరిస్థితి ఉంటుందా? అన్నది ప్రశ్న.

నారాయణరెడ్డి ప్రకటన ఇలా ఉంటే.. ఆయన కుమారుడు భూపేశ్ రెడ్డిని జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ ఛార్జిగా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో దేవగుడి వర్గం.. రామ సుబ్బారెడ్డి వర్గాల మధ్య సుదీర్ఘకాలంగా ఫ్యాక్షన్ నెలకొంది.

రామసుబ్బారెడ్డి వర్గం తొలుత టీడీపీలో ఉండగా.. దేవగుడి వర్గం కాంగ్రెస్ లో ఉండేది. అనంతరం వైసీపీకి షిప్టు అయ్యింది. దేవగుడి వర్గం తరఫున మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణ రెడ్డి గత టీడీపీ ప్రభుత్వంలో పార్టీలో చేరి మంత్రి అయ్యారు. ఆ సందర్భంగా ఆయనకు రాజకీయ ప్రత్యర్థి అయిన రామసుబ్బారెడ్డిని ఎమ్మెలసీని చేసి విప్ పదవిని ఇచ్చారు. గత ఎన్నికల్లో రామసుబ్బారెడ్డి ఎమ్మెల్యేగా.. ఆదినారాయణరెడ్డి ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తర్వాత ఇరువురు వేర్వేరు పార్టీల్లో చేరారు. ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరగా.. రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరారు.

ఇలా రెండు ప్రధాన వర్గాలు వేర్వేరు పార్టీలో చేరటంతో.. టీడీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటివేళలో.. దేవగుడి వర్గంలో చీలిక వచ్చింది. ఆ వర్గంలోప్రధాన నేతగా పేరున్న మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి టీడీపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా అది నిజమేనని పేర్కొంటూ.. ముహుర్తం చెప్పి మరీ తాను.. తన కొడుకు సైకిల్ ఎక్కే విషయాన్నిస్వయంగా తెలియజేయటంతో..బాబుకు కొంతమేర ఊరటగా ఈ పరిణామం మారుతుందని చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగు పార్టీ  అభ్యర్థిగా నారాయణరెడ్డి కుమారుడు భూపేశ్ కు బాబు టికెట్ ఇస్తానన్న హామీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
Tags:    

Similar News