మెచ్యూరిటీ పేరుతో బాబుకు మోడీ డ్యామేజ్

Update: 2018-07-21 07:39 GMT
ఒక వ్య‌క్తిని తిట్టాలంటే నేరుగా తిడితేనే తిట్టిన‌ట్లు కాదు. ఊరంతా వినిపించేలా బండ‌బూతులు తిట్టేస్తే కూడా తిట్టిన‌ట్లు కాదు. గిల్లి.. గిచ్చ‌కుండానే క‌ళ్ల వెంట నీరు కారేలా చేసే నేర్పు కొంద‌రిలో ఉంటుంది. మోడీ లాంటి మాట‌ల మ‌రాఠి మిగిలిన వారిలా నోరు పారేసుకోరు. త‌న‌ను తాను త‌క్కువ చేసుకుంటూ.. త‌న ప్ర‌త్య‌ర్థుల్ని పెద్దోళ్లుగా పొగిడేస్తూ కౌంట‌ర్లు వేస్తుంటారు. పొగుడుతూ తిట్ట‌టంలో మొన‌గాడైన మోడీ.. తాజాగా ఏపీ ముఖ్య‌మంత్రి మెచ్యూరిటీ మీద దెబ్బేశారు.

దేశంలో త‌నంత సీనియ‌ర్ ముఖ్య‌మంత్రి లేరంటూ తెగ క‌బుర్లు చెప్ప‌ట‌మే కాదు.. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత ప్ర‌ధాని అయిన మోడీని ఉద్దేశించి.. మోడీ త‌న‌కంటే జూనియ‌ర్ అని.. తాను సీఎంగా వ్య‌వ‌హ‌రించిన తీరును చూసి ఫాలో అయ్యే వారంటూ గొప్ప‌లు చెప్పుకున్నారు. అలాంటి మాట‌ల్ని తాను రిజిష్ట‌ర్ చేసుకుంటాన‌ని.. అవ‌స‌రానికి త‌గ్గ‌ట్లుగా ఆ మాట‌ల‌కు అంత‌కంత‌కూ బ‌దులు తీర్చుకుంటాన‌న్న విష‌యాన్ని మోడీ తాజాగా తేల్చేశారు.

అవిశ్వాస తీర్మానంపై స‌భ‌కు స‌మాధానం చెప్పే క్ర‌మంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఇమేజ్ ను రెండు మాట‌ల్లోనే భారీగా డ్యామేజ్ చేశారు.

చంద్ర‌బాబు గురించి పెద్ద‌గా చెప్ప‌కున్నా.. మాట్లాడిన రెండు మాట‌లు సూటిగా త‌గిలేలా ఉండ‌టం గ‌మ‌నార్హం. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో ఏపీ.. తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య పంచాయితీ విష‌యంలో కేసీఆర్ వైపున‌కు మొగ్గిన మోడీ.. బాబుకు మెచ్యూరిటీ లెవ‌ల్స్ త‌క్కువ‌న్న విష‌యాన్ని చెప్పుకొచ్చారు. ఇందుకు ఉదాహ‌ర‌ణ కూడా చెప్పిన ఆయ‌న‌.. త‌ర‌చూ కేసీఆర్‌.. బాబు గొడ‌వ‌లు ప‌డుతూ ఉండేవార‌ని.. బాబుతో పోలిస్తే.. కేసీఆర్ కాస్త మెచ్యూరిటీ ప్ర‌ద‌ర్శించేవార‌న్నారు.

తెలంగాణ ప్ర‌భుత్వం అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో కృషి చేస్తుంటే.. ఏపీలో మాత్రం స‌మ‌స్య‌లు ఇప్ప‌టికి ప‌రిష్కారం కావ‌టం లేద‌న్నారు. ఈ మాట‌ల‌తో బాబు గొడ‌వ‌లు పెట్టుకోవ‌ట‌మే కానీ.. అభివృద్ధి మీద దృష్టి సారించ‌టం లేద‌న్న మాట‌ను మోడీ చెప్పిన‌ట్లైంది.

అంతేనా.. ఏపీ సీఎం చంద్ర‌బాబు అంగీకారంతోనే రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదాకు బ‌దులుగా ప్ర‌త్యేక ప్యాకేజీ ఇచ్చామ‌ని.. ప్ర‌త్యేక ప్యాకేజీ ప్ర‌క‌టించినందుకు బాబు కేంద్రానికి.. ఆర్థిక‌మంత్రికి ధ‌న్య‌వాదాలు చెప్ప‌టాన్ని గుర్తు చేశారు. త‌న వైఫ‌ల్యాల్ని క‌ప్పి పుచ్చుకోవ‌టానికి బాబు యూట‌ర్న్ తీసుకున్నార‌న్న విమ‌ర్శ ద్వారా.. హోదా విష‌యంలో త‌మ త‌ప్పిదం ఏమీ లేద‌ని.. బాబుదే బాధ్య‌త అంతా అన్న విష‌యాన్ని మోడీ చెప్ప‌క‌నే చెప్పిన‌ట్లైంది. ఏతా వాతా.. బాబు ఇమేజ్ ను మోడీ త‌క్కువ మాట‌ల్లో ఎక్కువ‌గా చేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Tags:    

Similar News