క్రికెట్ మీద ప‌ట్టు ఎంతో చెప్పిన మోడీ

Update: 2019-04-18 05:31 GMT
ప్ర‌ధాని మోడీ ఎంత మాట‌ల మాంత్రికుడ‌న్న విష‌యాన్ని ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. విష‌యం ఏదైనా.. ప‌రిస్థితి ఎలాంటిద‌న్నా.. త‌న‌కు త‌గ్గ‌ట్లు మార్చేసుకొని మాట్లాడ‌టంలో ఆయ‌న ఎంత దిట్ట‌న్న విష‌యం తాజాగా చేసిన వ్యాఖ్య‌ను చూస్తే ఇట్టే అర్థ‌మైపోతుంది. ఇటీవ‌ల పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ చేసిన వ్యాఖ్య‌ను ప్ర‌ధాని మోడీ ప్ర‌స్తావించారు. ఈ మ‌ధ్య‌న ఇమ్రాన్ మాట్లాడుతూ.. లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ గెలిస్తే భార‌త్.. పాక్ మ‌ధ్య శాంతి చ‌ర్చ‌ల‌కు మార్గం మ‌రింత సుగ‌మం అవుతుంద‌ని పేర్కొన‌టం తెలిసిందే.

ఇమ్రాన్ నోటి నుంచి వ‌చ్చిన ఈ వ్యాఖ్య రాజ‌కీయంగా క‌ల‌క‌లం రేపింది. మోడీ గెలుపును ఇమ్రాన్ కోరుకుంటున్నార‌న్న భావ‌న క‌లిగింది. ఈ మాట త‌మ విజ‌యాన్ని ప్ర‌భావితం చేయ‌టంతోపాటు.. బీజేపీకి పాక్ తో ప్ర‌త్యేక‌మైన దోస్తానా? ఉంద‌న్న అనుమానం వ్య‌క్త‌మ‌య్యేలా ఇమ్రాన్ మాట ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మైంది.

ఇమ్రాన్ మాట బీజేపీని దెబ్బేసేలా.. కాంగ్రెస్ కు మేలు జ‌రిగేలా ఉంద‌న్న వాద‌న‌ను క‌మ‌ల‌నాథులు వినిపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా ఇమ్రాన్ వ్యాఖ్య‌ల‌కు మోడీ గురి చూసి వ‌దిలిన బాణం మాదిరి.. భారీ పంచ్ విసిరారు. రెండో ద‌శ పోలింగ్ కు రెండు రోజుల ముందు ఒక‌ప్ర‌ముఖ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో ఆయ‌నీ విష‌యాన్ని ప్ర‌స్తావించి.. త‌న‌దైన శైలిలో ఇమ్రాన్ కు భారీ క్రికెట్ పంచ్ విసిరార‌ని చెప్పాలి.

ఇమ్రాన్ ఖాన్ మంచి క్రికెట‌ర్ అన్న విష‌యాన్ని మ‌నం మ‌ర్చిపోకూడ‌దు. ఈ మ‌ధ్య‌న ఆయ‌న చేసిన వ్యాఖ్య భార‌త్ లో ఎన్నిక‌ల‌ను ప్ర‌భావితం చేయ‌టానికి రివ‌ర్స్ స్వింగ్ లో చేసిన ప్ర‌య‌త్నమ‌ని గుర్తించాలి. అయితే.. రివ‌ర్స్ స్వింగ్ లో వ‌చ్చే బంతిని హెలికాఫ్ట‌ర్ షాట్ తో ఎలా కొట్ట‌వ‌చ్చో భార‌తీయుల‌కు బాగా తెలుసు అంటూ సామాన్యుల‌కు సైతం అర్థ‌మ‌య్యేలా క్రికెట్ ప‌రిభాష‌లో చెప్పారు మోడీ. కాస్త ఆల‌స్యంగా స్పందించిన‌ప్ప‌టికీ.. అంద‌రికి అర్థ‌మ‌య్యేలా పాక్ ప్ర‌ధాని త‌న‌పై కుట్ర గుగ్లీ విసిరిన వైనాన్ని విప్పి చెప్పారు. మ‌రి.. మోడీ చెప్పిన‌ట్లు భార‌తీయులు ఎలాంటి షాట్ కొడ‌తారన్న‌ది తేలాలంటే మ‌రో ఐదు వారాల‌కు పైనే వెయిట్ చేయాల్సి ఉంటుంది.


Tags:    

Similar News