రాహుల్ పేరు ఎత్త‌కుండా మోడీ ఎట‌కారం ఆడేశారా?

Update: 2019-06-17 11:28 GMT
ఒక దేశం ఒక ఎన్నిక‌లంటూ ప్ర‌ధాని మోడీ షురూ చేసిన చ‌ర్చ‌ను మ‌రో ద‌శ‌కు తీసుకెళ్లేందుకు ఈ నెల 19న (బుధ‌వారం)  అఖిల‌ప‌క్ష భేటీని నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. దేశం మొత్తం ఒకేసారి ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌న్న ఉద్దేశాన్ని గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోనే తెర మీద‌కు తెచ్చారు మోడీ. అయితే.. అప్ప‌ట్లో ఇందుకు స‌మ‌యం లేక‌పోవ‌టంతో జ‌మిలి ఎన్నిక‌ల అంశం మ‌ధ్య‌లోనే ఆగిపోయింది.

తాను అనుకుంటున్న జ‌మిలి ఎన్నిక‌ల్ని 2024లో జ‌రిగే సార్వ‌త్రిక స‌మ‌యానికి చేప‌ట్టాల‌ని భావిస్తున్న మోడీ అందులో భాగంగా అన్ని రాజ‌కీయ ప‌క్షాల అధినేత‌ల‌తో భేటీ కావాల‌ని భావిస్తున్నారు. ఇందులో భాగంగా మ‌రో రెండు రోజుల్లో స‌మావేశాన్ని నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. దేశ ప్ర‌ధానిగా రెండోసారి బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత తొలిసారి ఆదివారం అఖిల‌ప‌క్ష స‌మావేశాన్ని నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడిన మోడీ.. అన్ని పార్టీల అధినేత‌లు త‌ప్ప‌నిస‌రిగా హాజ‌రు కావాల‌ని కోరారు. అంతేకాదు.. అధ్య‌క్షులు లేని పార్టీలు కూడా ఈ భేటీకి రావాల‌న్న ఆయ‌న వ్యాఖ్య ఆస‌క్తిక‌రంగా మారింది. మోడీ వ్యాఖ్య రాహుల్ ను ఉద్దేశించి చేసిందేన‌ని.. ఆయ‌న్ను ఎట‌కారం ఆడేందుకే అలా మాట్లాడి ఉంటార‌న్న మాట కొంద‌రు త‌ప్పు పడుతున్నారు. అయితే.. మోడీ మాట‌ల్ని అలా ఎందుకు చూడాల‌న్న ప్ర‌శ్న మ‌రికొంద‌రి నోటి నుంచి వస్తోంది.

పార్టీ ప‌రాజ‌యం త‌ర్వాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష ప‌ద‌వికి రాజీనామా చేయ‌టం.. ఆ రాజీనామాను పార్టీ అంగీక‌రించ‌క‌పోవ‌టం తెలిసిందే. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ ను ఎట‌కారం ఆడేసేందుకే ఇలాంటి వ్యాఖ్య చేశార‌న్న మోడీ మాట‌లో నిజం లేద‌న్న మాట వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీనే కాదు.. సీపీఎం.. సీపీఐ పార్టీల‌కు కూడా అధ్య‌క్షులు లేర‌ని గుర్తు చేస్తున్నారు. మొత్తంగా చూస్తే.. మోడీ మాట‌ల్ని ఎట‌కారంగా చూడ‌టం స‌రికాద‌న్న మాట వినిపిస్తోంది.
    

Tags:    

Similar News