ప‌టేళ్ల ఆందోళ‌న వెన‌క మోడీ?

Update: 2015-08-31 08:41 GMT
గుజ‌రాత్...ఒక‌ప్పుడు అభివృద్ధికి కేరాఫ్ అడ్ర‌స్‌ గా ఉన్న ఈ రాష్ర్టం న‌రేంద్ర‌ మోడీ వ‌ల్ల దేశ‌వ్యాప్తంగా ప్ర‌త్యేక‌త‌ను సాధించుకుంది. అక్క‌డ విజ‌య‌వంతంగా ప‌రిపాలించిన మోడీ ఆ త‌ర్వాత ప్ర‌ధాన‌మంత్రి పీఠాన్ని అధిరోహించారు. స‌మ‌ర్థ‌పాల‌కుడిగా పేరు సంపాదించుకుంటున్నారు. అలాంటి మోడీకి ఇపుడు పంటి కింద రాయిలా ప‌టేళ్ల‌కు ఓబీసీ రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌నే కొత్త డిమాండ్ వ‌చ్చింది. ఇది కేవ‌లం డిమాండ్ స్థాయిలోనే ఉండిపోకుండా...ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌ల స్థాయికి చేరింది. ఉద్రిక్త ప‌రిస్థితులతో గుజ‌రాత్‌ లో క‌ర్ఫ్యూ విధించారంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ పరిస్థితి ఎదుర‌వ‌డానికి మోడీయే కార‌ణామా? అంటే అవున‌నే అంటున్నారు విశ్లేష‌కులు.

కేశుభాయ్ ప‌టేల్‌...న‌రేంద్ర మోడీ కంటే ముందు గుజ‌రాత్ సీఎం పీఠాన్ని అదిష్టించిన నాయ‌కుడు. అప్ప‌ట్లో గుజ‌రాత్‌ లోని క‌చ్‌, ఇతర ప్రాంతాల్లో భూకంపం వ‌చ్చింది. రాష్ర్టం తీవ్రంగా న‌ష్ట‌పోయింది. అప్పుడు స‌రైన చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో కేశుభాయ్ ప‌టేల్ వైఫ‌ల్యం. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వం ప‌రువు గంగ‌పాలు అయింది. అదే స‌మ‌యంలో ప‌టేల్ ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉన్న మోడీ దూకుడుగా వ్య‌వ‌హ‌రించారు. పున‌రావాసం స‌హా... ప‌లు నిర్ణ‌యాలు తీసుకున్నారు. అప్ప‌టి బీజేపీ అగ్ర‌నేత‌లు అట‌ల్ బిహారీ వాజ్‌ పేయి, ఎల్‌ కే అద్వానీ దృష్టిలో ప‌డ్డారు.

వాజ్‌ పేయి కంటే పార్టీ బాధ్య‌త‌లు ఎక్కువ‌గా చూసుకునే అద్వానీని మోడీ గాడ్ ఫాద‌ర్‌ గా ఎంచుకున్నారు. త‌న‌దైన శైలిలో ప్ర‌భావిత నిర్ణ‌యాలు తీసుకుంటూ ఆయ‌న మ‌న‌సు చూర‌గొన్నారు.  ఒక‌రకంగా చెప్పాలంటే కేశుబాయ్ ప‌టేల్ అస‌మ‌ర్థుడ‌ని..మోడీ సీఎం అయితేనే ప‌రిస్థితులు స‌ద్దుమ‌ణుగుతాయ‌నే ప‌రిస్థితిని క‌ల్పించారు. ఈ క్ర‌మంలో మోడీ సీఎం అయ్యారు. కేశుబాయ్ ప‌టేల్ ప‌క్క‌కు త‌ప్పుకున్నారు. సీఎం ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత మోడీ త‌న‌దైన శైలిలో స‌మ‌స్య‌లు అధ్య‌యనం చేశారు. గుజ‌రాత్‌ కు ఉన్న బ‌లాలు, బ‌ల‌హీన‌త‌ల ఆధారంగా... నిర్ణ‌యాలు తీసుకుంటూ రాష్ర్టాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపించారు. అదే క్ర‌మంలో ప్ర‌చారంలోనూ దూసుకుపోయారు.

మోడీ సీఎం అయిన త‌ర్వాత బీజేపీలో క్ర‌మక్ర‌మంగా కేశుభాయ్ ప్రాధాన్యం త‌గ్గిపోయింది. దీంతోపాటు గుజ‌రాత్‌ లోని ప‌టేల్ల‌కు ప్రాధాన్యం కూడా నామ‌మాత్రం అయింది. బీసీ సామాజిక‌వ‌ర్గానికి చెందిన మోడీ...అగ్ర‌వ‌ర్ణాలైన ప‌టేల్ ల‌ను ప‌క్క‌న‌పెట్టారు. దీంతో అపుడు మొద‌ల‌యిన అసంతృప్తి ఇపుడు తార‌స్థాయికి చేరింది. త‌మ‌ను ఓబీసీ జాబితాలో చేర్చాలంటూ గుజరాత్‌ లోని ప‌టేదార్లు ఇపుడు మోడీకి ప‌క్క‌లో బ‌ల్లెంలా మారిపోయారు. ఇంట‌ గెలిచి ర‌చ్చ గెల్చిన మోడీకి ఇపుడు ఇంటిపోరు మొద‌ల‌యింది.
Tags:    

Similar News