ఏంది మోడీ.. ఈ డీజిల్ ఆరాచ‌కం!

Update: 2018-04-14 05:03 GMT
2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ మోడీ ప్ర‌ధాని కుర్చీలో కూర్చోవాల‌ని త‌హ‌త‌హ‌లాడిన వారిలో ఎక్కువ‌మంది పెట్రోలియం ఉత్ప‌త్తుల ధ‌ర‌లు కారుచౌక‌గా మార‌తాయ‌ని భావించారు. ఇదే విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా ప్ర‌చారం చేశారు కూడా. నాలుగేళ్ల మోడీ పాల‌న తేల్చి చెప్పిన వైనం ఏమిటంటే.. ప్ర‌జ‌ల ఆశ‌లు.. ఆకాంక్ష‌లేమీ సాకారం కాలేద‌ని.

పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల విష‌యంలో ఏదో చేస్తామంటూ మాట‌లు చెప్పిన మోడీ అండ్ కో.. త‌మ నాలుగేళ్ల పాల‌న‌లో ఏమీ చేయ‌లేదు. క‌నీస ఊర‌డింపు లేక‌పోగా.. కొద్ది నెల‌లుగా ఏ రోజుకు ఆ రోజు ధ‌ర‌లు పెంచేస్తున్న వైనం ప్ర‌జ‌ల్లో తీవ్ర అసంతృప్తికి గురి చేస్తోంది. యూపీఏ స‌ర్కారు ప్ర‌తి నెల‌లో రెండు సార్లు అంత‌ర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ మార్కెట్‌ కు త‌గ్గ‌ట్లుగా ధ‌ర‌ల్ని పెంచ‌ట‌మో.. త‌గ్గించ‌ట‌మో చేసేది. మోడీ స‌ర్కారు మాత్రం అందుకు భిన్నంగా ఏ రోజుకు ఆ రోజు స‌మీక్షిస్తూ ధ‌ర‌ల్ని డిసైడ్ చేస్తున్నారు. గ‌తంలో చ‌మురు బిల్లు కింద వేలాది కోట్ల రూపాయిల లోటు వెంటాడుతూ ఉండేది. మోడీ హ‌యాంలో అలాంటి ప‌రిస్థితి నుంచి డీజిల్‌.. పెట్రోల్ అమ్మ‌కాల ద్వారా వేలాది కోట్ల రూపాయిల్ని ఖ‌జానాను ముంచెత్తుతోన్న ప‌రిస్థితి.

ప్ర‌స్తుతం అమ‌లు చేస్తున్న ధ‌ర‌ల ఫ‌లితంగా పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌లు అంత‌కంత‌కూ పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ.70.58గా మారి చుక్క‌లు చూపిస్తోంది. ఈ ధ‌ర ఆల్ టైం రికార్డుగా ఉంది. మోడీ బాదుడు ఎంతలా ఉంటుంద‌న‌టానికి డీజిల్ ధ‌రే నిద‌ర్శ‌నంగా చెబుతారు. పోలీస్ దెబ్బ మాదిరి.. క‌నిపించ‌కుండా బాదేయ‌టంలో మోడీ స‌ర్కారు త‌ర్వాతే ఎవ‌రైనా అని చెప్ప‌క‌త‌ప్ప‌దు.

నెల‌లో రెండుసార్లు ధ‌ర‌ల్ని స‌మీక్షించే విధానానికి చెక్ పెట్టి..  రోజువారీ స‌మీక్ష స్టార్ట్ చేసిన స‌మ‌యంలో లీట‌రు డీజిల్ ధ‌ర రూ.59.30గా ఉండేది. అది కాస్తా.. క్ర‌మంగా పెరుగుతూ వ‌చ్చి గ‌త ఏడాది అక్టోబ‌రులో 64.02కు పెరిగితే.. మార్చి నెలాఖ‌రు నాటికి రూ.69.97కు పెరిగింది. తాజాగా హైద‌రాబాద్ లో లీట‌రు డీజిల్ ధ‌ర ఆల్ టైం హై రూ.70.58కి చేరుకోవ‌టంతో వాహ‌నాదారుల‌కు చెమ‌ట‌లు ప‌డుతున్నాయి.

మోడీ విధానాల‌కు త‌గ్గ‌ట్లే రెండు తెలుగు రాష్ట్రాల్లోని చంద్రుళ్ల స‌ర్కార్లు పెట్రోల్‌.. డీజిల్ మీద అద‌న‌పు ప‌న్ను భారాన్ని మోప‌టంతో ఈ భారం మ‌రింత పెరుగుతోంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో లీట‌రు పెట్రోల్ ధ‌ర రూ.78.27గా ఉండ‌గా.. డీజిల్ రూ.70.58కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో పెట్రో ఉత్ప‌త్తుల‌పై వ్యాట్ విధింపు కార‌ణంగా దేశంలోనే టాప్ త్రీ స్థానాల్లో రెండు తెలుగు రాష్ట్రాలు ఉండ‌టం గ‌మ‌నార్హం.

ప్ర‌స్తుతం పెరిగిన పెట్రోల్.. డీజిల్ ధ‌ర‌ల భారం త‌గ్గాలంటే ప్ర‌భుత్వాలు క‌ల్పించుకోక త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితి. కేంద్రంలోని మోడీ స‌ర్కారు ఎటూ పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల్ని ప‌ట్టించుకోర‌న్న‌ది తెలిసిందే. దేశ ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్నా.. ఆయ‌న మౌనంగా ఉండిపోతారు. ఇక‌.. అంతోఇంతో స్పందించాల్సింది రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాష్ట్ర స‌ర్కార్లే. ఎందుకంటే.. కేంద్రం విధించే ప‌న్ను పోటుకు అద‌నంగా రాష్ట్రాలు వేస్తున్న ప‌న్నుభారాన్ని కొంత మిన‌హాయిస్తే.. ధ‌ర‌లు త‌గ్గే అవ‌కాశం ఉంది. అంత‌కంత‌కూ పెరిగిపోతున్న పెట్రోల్‌.. డీజిల్ ధ‌రాభారం పుణ్య‌మా అని ప్ర‌జ‌లు వాహ‌నాల్ని ఇళ్ల‌ల్లో నుంచి తీసేందుకు సైతం వ‌ణికిపోవాల్సి ఉంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News