మోదీ కూడా కార్పొరేట్‌ కు దాసోహ‌మ‌య్యారా?

Update: 2017-09-14 08:05 GMT
2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్న న‌రేంద్ర మోదీ.. ఒక్క‌సారిగా జాతీయ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వ‌చ్చీ రావ‌డంతోనే అప్ప‌టికే ప‌దేళ్ల పాటు దేశాన్ని పాలించిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ స‌ర్కారును ఆయ‌న ద‌డ‌ద‌డ‌లాడించార‌నే చెప్పాలి. అవినీతి ర‌హిత పాల‌న‌ను తెరపైకి తీసుకొచ్చిన మోదీ... స్విస్ బ్యాంకుల్లో భార‌తీయ న‌ల్ల కుబేరులు దాచుకున్న సొమ్మును వెన‌క్కి తెస్తామ‌ని విస్ప‌ష్ట ప్ర‌క‌ట‌న చేశారు. అదే స‌మ‌యంలో ఈ రెండు అంశాల‌ను జ‌నంలోకి తీసుకెళ్లేందుకు మోదీ... సోష‌ల్ మీడియాను బాగానే వాడేశారు. ఛాయ్ పే చ‌ర్చా వంటి కార్య‌క్ర‌మాల‌తో హోరెత్తించిన మోదీ... యూపీఏ స‌ర్కారు కార్పొరేట్‌ తో అంట‌కాగుతున్న వైనాన్ని బాగాన ఎలివేట్ చేయ‌గ‌లిగారు. ఫ‌లితంగా కాంగ్రెస్ త్రిబుల్ డిజిట్ నుంచి డ‌బుల్ డిజిట్‌ కు ప‌డిపోగా... దాదాపు మూడు ద‌శాబ్దాల త‌ర్వాత బీజేపీ సొంతంగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేంత స్థాయిలో 300ల‌కు పైగా లోక్ స‌భ సీట్ల‌ను కైవ‌సం చేసుకుంది.

ఇదంతా గ‌త‌మ‌నుకుంటే... భార‌త ప్ర‌జ‌లు అంత‌గా బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టిన మోదీ స‌ర్కారు ఇప్పుడు ఏం చేస్తోంద‌న్న విష‌యంపై నిజంగానే విస్మ‌యం గొలిపే వాస్త‌వాలు క్ర‌మంగా వెలుగులోకి వ‌స్తున్నాయి. వాటిలోని ఓ కీల‌క విషయంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చ‌ర్చ‌కు తెర లేసింద‌నే చెప్పాలి. నాడు యూపీఏ స‌ర్కారు ఏ త‌ర‌హా పాల‌న అందించిందో... ఇప్పుడు న‌రేంద్ర మోదీ కూడా అదే త‌ర‌హా పాల‌న‌ను కొన‌సాగిస్తున్నార‌ని, ఇంకా చెప్పాలంటే యూపీఏ స‌ర్కారు కంటే కూడా మోదీ స‌ర్కారే కార్పొరేట్‌ తో ఎక్కువ‌గా అంట‌కాగుతోంద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. ఇక ఆ విష‌యంలోకి వెళితే...  దేశంలో ఇప్పుడు పెట్రోల్ ధ‌ర‌లు రోజు రోజుకూ మారిపోతున్నాయి. యూపీఏ స‌ర్కారు హయాంలో ఓ నిర్ణీత కాల వ్య‌వ‌ధి లేకున్నా... అంత‌ర్జాతీయ చ‌మురు మార్కెట్‌ లో బ్యారెల్ రేటులో మార్పు వ‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే పెట్రోలు, డీజిల్ రేట్ల‌లో మార్పులు వ‌చ్చేవి.

అయితే... న‌రేంద్ర మోదీ ప్ర‌ధాని అయ్యాక‌.. ఇంధ‌న ధ‌ర‌ల మార్పుల‌కు సంబంధించి ప‌క్షం రోజుల వ్య‌వ‌ధి అమ‌ల్లోకి వ‌చ్చింది. అంటే ప్ర‌తి 15 రోజుల‌కు ఓ ప‌ర్యాయం భేటీ అయ్యే... ఇంద‌న శాఖ‌, చ‌మురు సంస్థ‌లు పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచాలా? త‌గ్గించాలా? అన్న అంశంపై చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకునేవి. ఆ త‌ర్వాత ఈ స‌మీక్ష రోజువారీకి మారిపోయింది. ఇప్పుడు ప్ర‌తి రోజు పెట్రోలు - డీజిల్ ధ‌ర‌ల్లో మార్పు ఉంటూనే ఉంది. ఈ మార్పు ఏ ప్రాతిపదిక‌న చేప‌డుతున్నార‌న్న అంశంపై ఇప్పుడు జ‌నానికి పెద్ద‌గా క్లారిటీ లేద‌నే చెప్పాలి. వాస్త‌వంగా మొన్న‌టిదాకా జ‌నం ఏమ‌నున్నారంటే... అంత‌ర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చ‌మురు రేటు మారితేనే... మ‌న వ‌ద్ద పెట్రోలు - డీజిల్ ధ‌ర‌ల్లో మార్పు వ‌చ్చేద‌ని భావించారు. అయితే ఇప్పుడు ప్ర‌తి రోజూ పెట్రోలు ధ‌ర‌లు ఎందుకు మారుతున్నాయ‌న్న విష‌యంపై అంత‌గా స్ప‌ష్టత లేద‌నే చెప్పాలి.

ఇవేమీ ప‌ట్టించుకోని మోదీ స‌ర్కారు మాత్రం తాను ర‌చించుకున్న ప్ర‌ణాళిక మేర‌కు ముందుకు సాగుతోంది. స‌రే... త‌న ప్ర‌ణాళిక మేర‌కే మోదీ సర్కారు ముందుకు సాగినా.. ఫ‌రవా లేదు గానీ... ఆ నిర్ణ‌యాలు ప్ర‌జా ప్ర‌యోజ‌నంతో ముడిప‌డి ఉండాలి క‌దా. మ‌రి పెట్రోలు రేట్ల‌కు సంబంధించి న‌రేంద్ర మోదీ స‌ర్కారు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు కార‌ణంగా అంత‌ర్జాతీయ చ‌మురు మార్కెట్‌లో బ్యారెట్ రేటు త‌గ్గినా... దేశంలో పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు త‌గ్గ‌డం లేదే. ఇదే విష‌యాన్ని ఇప్పుడు ప‌లు వ‌ర్గాలు ప్ర‌ధానంగా ప్ర‌స్తావించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. అయినా ఈ విష‌యంపై జ‌నం ప్ర‌స్తావిస్తున్న అంశాల‌ను ఓ సారి ప‌రిశీలిస్తే... 2014లో మోదీ ప్ర‌ధాని పీఠం ఎక్కే నాటికి అంత‌ర్జాతీయ చ‌మురు మార్కెట్‌లో బ్యారెట్ ధ‌ర 148 డాల‌ర్లు ఉంటే... దేశంలో లీట‌రు పెట్రోలు ధ‌ర రూ.61, డీజిల్ ధ‌ర రూ.53గా ఉండేది. అదే రెండేళ్ల త‌ర్వాత అంటే 2016లో అంత‌ర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ చ‌మురు ధ‌ర అమాంతంగా 36 డాల‌ర్ల‌కు త‌గ్గిపోగా... దేశలో తగ్గాల్సిన పెట్రోలు డీజిల్ రేట్లు మాత్రం పెరిగిపోయాయి.

బ్యారెల్ ధ‌ర 36 బాల‌ర్లు ఉన్న స‌మ‌యంలో దేశంలో లీట‌రు పెట్రోలు ధ‌ర రూ.76కు చేర‌గా, డీజిల్ ధ‌ర రూ.60కి చేరింది. ఇక ఈ ఏడాది ప్ర‌థ‌మార్థంలో బ్యారెల్ రేటు కాస్తంత పెరిగి 47కు చేరుకోగా... లీట‌రు పెట్రోల్ ధ‌ర రూ.71, డీజిల్ 61కి చేరింది. అంటే... అంత‌ర్జాతీయ చ‌మురు మార్కెట్‌ లో బ్యారెల్ ధ‌ర‌తో దేశంలో పెట్రోలు - డీజిల్ ధ‌ర‌లు ఏమాత్రం ప్ర‌భావితం కావ‌డం లేద‌న్న‌మాట‌. ఇదే విష‌యాన్ని జ‌నం ఇప్పుడిప్పుడే గ్ర‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం దేశంలో అత్యంత పెద్ద చ‌మురు సంస్థ‌గా రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ కొనసాగుతోంది. ప్ర‌భుత్వ రంగ సంస్థ ఓఎన్‌ జీసీ ఉన్నా కూడా... మెజారిటీ కాంట్రాక్టుల‌న్నీ కూడా రిల‌య‌న్స్‌ కే ద‌క్కుతున్నాయి. మ‌రి అంత‌ర్జాతీయ చ‌మురు మార్కెట్‌ లో బ్యారెల్ రేటు బాగానే త‌గ్గినా... దేశంలో పెట్రోలు - డీజిల్ ధ‌ర‌లు త‌గ్గ‌కుండా... క్ర‌మేపీ పెరుగుతుండ‌టం చూస్తుంటే... రిల‌య‌న్స్ సంస్థ‌ల‌కు ప్ర‌భుత్వం అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టే క‌దా అన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రి ఈ విష‌యంపై మోదీ స‌ర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి.
Tags:    

Similar News