ఈసారి ప్రధాని మోడీ పోటీ చేసే నియోజకవర్గం ఇదే!

Update: 2023-01-03 03:36 GMT
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దక్షిణాదిలో బీజేపీని బలోపేతం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ చూస్తున్నారు. ఉత్తరాదిలో ఈసారి బీజేపీ 160 లోక్‌ సభ సీట్లలో గడ్డు పరిస్థితిని ఎదుర్కోనుందని ఆ పార్టీ సొంత సర్వేల్లోనే తేలిందని అంటున్నారు. 160 సీట్లలో అత్యధికం బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఉన్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఉన్నాయని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఉత్తరాదిలో పడే గండిని దక్షిణ భారతదేశంలో సాధించే సీట్ల ద్వారా భర్తీ చేసుకోవాలని మోడీ-అమిత్‌ షా ద్వయం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో నరేంద్ర మోడీ వచ్చే ఎన్నికల్లో దక్షిణ భారతదేశం నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం సౌతిండియాలోని మిగిలిన రాష్ట్రాలపైన ఉంటుందని బీజేపీ విశ్వసిస్తోంది.

ఈ క్రమంలో తమిళనాడులోని రామనాథపురం లోక్‌ సభ స్థానం నుంచి ప్రధాని మోడీ పోటీ చేసే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. అందులోనూ తమిళనాడులో పాగా వేసేందుకు బీజేపీ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. జయలలిత కన్నుమూశాక పన్నీరు సెల్వం ద్వారా అధికారం చేజిక్కుంచుకోవాలని చూసింది. అయితే పన్నీరు సెల్వం బలహీనుడు కావడంతో బీజేపీ ప్రయత్నం వర్కవుట్‌ కాలేదు.

ఈ నేపథ్యంలో దూకుడుగా వ్యవహరిస్తున్న మాజీ పోలీసు అధికారి అన్నామలైని తమిళనాడు బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా నియమించింది.

ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే ఎన్నికల్లో రామనాథపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తే తమిళనాడుతో పాటు మొత్తం దక్షిణ భారతదేశంపై సానుకూల ప్రభావం చూపవచ్చని బీజేపీ నమ్ముతోంది.

రామనాథపురం ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది.  హిందూత్వ ప్రయోజనాలకు కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన రామేశ్వరం... రామనాథపురం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకే వస్తుంది. భారత్, శ్రీలంకల మధ్య కీలకమైన  రామసేతు ప్రారంభమయ్యే ప్రదేశం కూడా ఇదే కావడం గమనార్హం.

రామనాథపురంతో పాటు ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి కూడా మోడీ పోటీ చేయాలని భావిస్తున్నారు. 2014లో మోదీ గుజరాత్‌లోని వడోదరతోపాటు వారణాసి నుంచి పోటీ చేశారు. తర్వాత వారణాసిని కొనసాగించి వడోదరకు రాజీనామా చేశారు. 2019లో కేవలం వారణాసి నుంచే పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News