మార్స్ లో నీళ్లు; నాడు మనం చెప్పిందే

Update: 2015-09-29 04:36 GMT
సాంకేతికంగా వెనుకబడి పోయినా.. సూక్ష్మ దృష్టిలో అంతరిక్షంలో ఉండే చాలా అంశాల్ని భారతీయులు బయటపెడుతుంటారు. ఇప్పటికే ఈ విషయం పలుమార్లు నిరూపితమైంది కూడా. మనకు దగ్గర్లో ఉన్న చందమామపై ఏమీ లేదని.. తేల్చేస్తే చంద్రయాన్ ప్రయోగంతో అది తప్పని చెప్పి.. లోకం దృష్టిని ఆకర్షించేలా చేసింది. చంద్రుడిపై మరిన్ని పరిశోధనలు చేసేలా పురిగొల్పింది.

తాజాగా సదూర తీరాన ఉన్న అంగారకుడిపై నీళ్లు ఉన్నాయంటూ సంచలన విషయాన్ని నాసా పేర్కొంది. అంగారకుడి మీద ఉప్పు నీటి నిల్వలున్నట్లు చెప్పిన నాసా అందుకు సంబంధించిన చిత్రాల్ని విడుదల చేసింది. అంగారకుడి మీదున్న నీళ్లు.. అక్కడి వాతావరణ పరిస్థితులకు తగ్గట్లుగా మారిపోతున్నట్లుగా గుర్తించినట్లు చెబుతోంది.

నీటి జాడతో జీవం ఉండే అవకాశం ఉంటుందన్న భావనను నాసా వ్యక్తం చేస్తోంది. అయితే.. అంగారకుడిపై నీరు ఉన్నట్లుగా భారత్ తన ప్రయోగంతో గతంలోనే చెప్పింది. అయితే.. అధునాతన సాంకేతిక లేకపోవటంతో తన వాదనకు తగిన ఆధారాల్ని చూపించలేకున్నా.. ఇప్పుడు అదే మాటను నాసా చెప్పటం చూసినప్పుడు.. అంతరిక్ష అంశాలకు సంబంధించి భారత్ చేసే వ్యాఖ్యలు విలువైనవన్న విషయం మరోసారి నిరూపితమైనట్లే.
Tags:    

Similar News