ఏమిటీ నేషనల్ హెరాల్డ్ ఇష్యూ? సోనియా.. రాహుల్ ఆస్తుల్ని కాజేశారా?

Update: 2022-06-14 03:29 GMT
దేశాన్ని సుదీర్ఘంగా పాలించిన గాంధీ కుటుంబానికి మరకగా మారింది నేషనల్ హెరాల్డ్ ఇష్యూ. మనీ లాండరింగ్ ఆరోపణలతో కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ ఈడీ ఎదుట హాజరు కావటం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలీ వివాదం ఏమిటి? అసలు కేసు పూర్వాపరాలు ఏమిటి? గాంధీ ఫ్యామిలీ మీద పడిన మరకకు అసలు కారణమేంటి? నిజంగానే గాంధీ కుటుంబం తప్పు చేసిందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

ఈ కేసు పూర్వపరాల్లోకి వెళ్లటానికి ముందు.. అసలీ సంస్థను ఎవరు? ఎప్పుడు? ఎందుకు? ప్రారంభించారు? దాని చరిత్రలోకి వెళ్లిన తర్వాత తాజా వివాదంలోకి వస్తే.. ఇదెందుకంత ప్రాధాన్యత సంతరించుకుందన్న విషయంపై అవగాహన చాలా ముఖ్యం. వివరాల్లోకి వెళితే.. దేశ స్వాతంత్ర్యానికి ముందు పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ ఐదు వేల మంది స్వాతంత్య్ర సమరయోధుల నుంచి నిధులు సమీకరించి ఏజేఎల్‌ను ఏర్పాటు చేశారు. నేషనల్ హెరాల్డ్ పేరుతో పత్రికను తీసుకొచ్చేవారు. అందులో బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమాచారం ఇచ్చేవారు. బ్రిటీష్ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపేవారు. ఇక.. కంపెనీ ఆర్థిక అంవాల విషయంలోకి వెళితే.. నిధులు ఇచ్చిన ఐదు వేల మంది కంపెనీకి షేర్ హోల్డర్లు. భారత కంపెనీల చట్టం 1913 కింద ఈ సంస్థను పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ప్రకటించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే ఇంగ్లిషు భాషలో నేషనల్ హెరాల్డ్ పేరుతో 1938 నుంచి పబ్లిష్ చేయటం మొదలైంది. హిందీలో నవజీవన్.. ఉర్దూలో ఖౌమీ అవాజ్ పేరుతో వార్తా పత్రికల్ని ప్రచురించే వారు.

పలు ఆటుపోట్లతో పాటు.. బ్రిటీష్ వారి కన్నెర్ర కారణంగా మధ్యలో కొంతకాలం ఈ సంస్థ పైన బ్యాన్ పెట్టింది. ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఎత్తేసింది. అలా షురూ అయిన నేషనల్ హెరాల్డ్ తన జర్నీని కొనసాగించింది. రోజులు గడుస్తున్న కొద్దీ.. ఈ సంస్థ అంతకంతకూ నష్టాల్లో కూరుకుపోవటం మొదలైంది. చివరకు 2008 ఏప్రిల్ లో ఈ సంస్థకు చెందిన అన్ని ప్రచురణల్ని నిలిపివేశారు. అయితే.. ఈ సంస్థకు భారీ ఎత్తున ఆస్తులు ఉన్నాయి. పబ్లికేషన్ నిలిపివేసిన ఈ సంస్థకు చెందిన ఆస్తుల్ని అద్దెకు ఇచ్చే పని మొదలు పెట్టారు.

2010లో లక్నోలోని సంస్థ కార్యాలయాన్ని ఢిల్లీలోని హెరాల్డ్ హౌస్ లోకి తరలించారు. సంస్థ నష్టాల్లో ఉన్నప్పుడు దాన్ని ఆదుకోవటం కోసం కాంగ్రెస్ పార్టీ అప్పులు ఇచ్చేది. ఈ అప్పుల విలువ 2010 డిసెంబరు 16 నాటికి రూ.90.12 కోట్లకు చేరాయి. ఇక్కడే కీలక పరిణామం చోటు చేసుకుంది. నష్టాల్లో ఉన్న సంస్థకు చెందిన 99.99 శాతం షేర్లను యంగ్ ఇండియా అనే సంస్థకు కాంగ్రెస్ పార్టీ బదలాయించింది.

ఇంతకీ ఈ యంగ్ ఇండియా ఏమిటి? అన్న లోతుల్లోకి వెళితే షాకింగ్ అంశాలు వెలుగు చూస్తాయి. యంగ్ ఇండియాను రూ.50 లక్షలతో షురూ చేయండి. నేషనల్ హెరాల్డ్ కు చెందిన వేలాది కోట్ల ఆస్తులను కారుచౌకగా యంగ్ ఇండియాకు కట్టబెట్టటం ఒక ఎత్తు అయితే.. ఈ కంపెనీ తొలి మేనేజింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించి సంస్థ డైరెక్టర్ గా రాహుల్ గాంధీని నియమించటం విస్మయానికి గురి చేసే అంశంగా చెప్పాలి. ఇక.. ఏజేఎల్ ఆస్తుల విలువ ఏకంగా రూ.5వేల కోట్లుగా అంచనా వేశారు. వాస్తవ లెక్కల్లోకి వెళితే.. ఈ ఆస్తులు మరింత విలువైనవిగా చెబుతారు.

ఈ సంస్థకు చెందిన హెరాల్డ్ హౌస్ పేరుతో ఢిల్లీలో ఆరు అంతస్తుల్లో 10వేల చదరపు అడుగుల భవనం ఉంది. ఇదే కాదు లక్నో.. భోపాల్.. ముంబయి.. ఇండోర్.. పట్నా.. పంచకుల తదితర ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ వందల కోట్ల విలువైనవి కావటం గమనార్హం.అలాంటి ఈ సంస్థ ఆస్తుల్నికారుచౌకగా యంగ్ ఇండియాకు కట్టబెట్టటం ఒక ఎత్తు అయితే.. ఈ యంగ్ ఇండియాలో ఎవరున్నారన్నది చూస్తే.. ఇందులో మెజార్టీ వాటా (76 శాతం) సోనియాగాంధీ.. రాహుల్ గాంధీకి షేర్లు ఉన్నాయి. మిగిలిన 24 శాతంలో కూడా గాంధీ ఫ్యామిలీకి వీర విధేయలుగా ఉండే మోతీలాల్ వోరా.. అస్కార్ ఫెర్నాండెజ్ ఇద్దరికే చెరో 12 శాతం ఉండటం విశేషం.

ఈ వ్యవహారాన్ని తొలిసారి బయటకు తీసుకొచ్చిన పెద్ద మనిషి.. బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి. గాంధీ కుటుంబం ఆర్థిక నేరాలకు పాల్పండిందంటూ కోర్టును ఆశ్రయించారు. ఎజేఎల్ కు చెందిన రూ.2వేల కోట్ల ఆస్తుల్ని సొంతం చేసుకోవటానికి ప్లాన్ చేశారన్నది స్వామి ఆరోపణ.  వాణిజ్య అవసరాల కోసం రాజకీయ పార్టీ డబ్బును అప్పుగా ఇవ్వడం ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని 29ఏ, బీ, సీ సెక్షన్లు, ఆదాయ పన్నుల చట్టం1961లోని సెక్షన్‌ 13ఏ ప్రకారం అక్రమమని సుబ్రహ్మణ్యస్వామి వాదిస్తున్నారు.

ఈ ఆరోపణలపై విచారణ జరిపిన ఈడీ ఇటీవల సోనియాగాంధీకి.. రాహుల్ గాంధీకి సమన్లుజారీ చేశారు. దీంతో సోమవారం రాహుల్ ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. కంపెనీల చట్టం.. షేర్ల బదిలీలకు సంబంధించిన ఈ కేసు రానున్న రోజుల్లో రాజకీయంగా పెను దుమారంగా మారుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా.. అవినీతి ఆరోపణలతో గాంధీ ఫ్యామిలీ ఇప్పుడు అనూహ్య పరిణామాల్ని ఎదుర్కొంటోంది. పార్టీ సైతం సంక్షోభంలో ఉన్న వేళలో.. చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు ఆ పార్టీకి కొత్త సవాళ్లుగా మారాయని చెప్పక తప్పదు. ఇందులో నుంచి బయటపడటం ఎలా అన్నది ఇప్పుడో పెద్ద సందేహంగా మారిందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News