ఎన్‌ఎస్‌ఈ కుంభకోణంలో దేశవ్యాప్తంగా సీబీఐ దాడులు

Update: 2022-05-21 11:34 GMT
నేషనల్‌ స్టాక్‌ ఎక్సే ్చంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) కొ లొకేషన్‌ కుంభకోణానికి సంబంధించిన కేసులో మే 21 కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైతోపాటు గాంధీ నగర్, ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, కోల్‌కత్తాలలో బ్రోకర్లతో సంబంధం ఉన్న 12 ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించింది.

ఇప్పటికే ఈ కేసులో సీబీఐ.. ఎన్‌ఎస్‌ఈ మాజీ సీఈవో, ఎండీ చిత్రా రామకృష్ణన్‌ను, గ్రూప్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ఆనంద్‌ సుబ్రమణియన్‌ను అరెస్టు చేసింది. ప్రస్తుతం వారిద్దరూ ఢిల్లీలోని తీహార్‌ జైలులో ఉన్నారు. తాజాగా ఈ కేసులో వారిద్దరికి ఢిల్లీ హైకోర్టు బెయిల్‌ నిరాకరించింది. అక్రమంగా నిధుల తరలింపు, ఎన్‌ఎస్‌ఈ రహస్యాలను కొంతమందికి చేరవేడం, తదితర వ్యవహారాల్లో చిత్రా రామకృష్ణన్‌ను సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. చిత్రతోపాటు ఆనంద్‌ సుబ్రమణియన్‌పైన సీబీఐ చార్జిషీట్‌ దాఖలు చేసింది. ఈ కేసులో తమకు బెయిల్‌ ఇవ్వాలన్న వీరి విజ్ఞప్తిని ఢిల్లీ కోర్టు తోసిపుచ్చింది. అంతకుముందు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలోనూ వీరికి చుక్కెదురు అయింది.

కొందరు బ్రోకర్లకు చిత్ర, ఆనంద్‌ అనుకూలంగా వ్యవహరించారనే దానిపైనా సీబీఐ విచారణ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మే 21 దేశవ్యాప్తంగా దాడులకు దిగింది. 2013లో నేషనల్‌ స్టాక్‌ ఎక్సే ్చంజ్‌ ఎండీగా బాధ్యతలు చేపట్టిన చిత్రా.. ఏడాదికి రూ.4.21 కోట్ల భారీ వేతనానికి గ్రూప్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా ఆనంద్‌ సుబ్రమణియన్‌ను నియమించారు. అంతేకాకుండా ఈమెయిల్‌ రూపంలో ఆయనతో అనేక రహస్యాలను పంచుకున్నారు. వీరిద్దరి వ్యక్తిగత అనుబంధానికి సంబంధించిన వివరాలు కూడా ఆ మెయిల్‌ ఉత్తరప్రత్యుత్తరాలలో ఉండటం గమనార్హం.

పైగా తాను మెయిల్‌లో చాట్‌ చేసింది.. ఒక హిమాలయ ఆధ్యాత్మిక గురువుతో అంటూ చిత్ర సీబీఐ అధికారులను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారు. ఆ హిమాలయ ఆధ్యాత్మిక గురువును తానెప్పుడూ కలవలేదని.. ఆయన ఎలా ఉంటారో కూడా తనకు తెలియదని పొంతనలేని సమాధానాలు చెప్పారు. నేషనల్‌ స్టాక్‌ ఎక్సే ్చంజ్‌కు సంబంధించిన అనేక నిర్ణయాలను ఆయనతో చర్చించే తీసుకున్నానని తెలిపారు. యోగి సలహా మేరకే తాను ఆనంద్‌ సుబ్రమణియన్‌ను నియమించుకున్నానని.. ఇలా అధికారుల విచారణలో వారికి చుక్కలు చూపించారు.

అయితే మొయిల్‌ ఐడీ వివరాలతో చిత్రా రామచంద్రన్‌ మెయిల్‌లో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపింది ఆనంద్‌ సుబ్రమణియన్‌తోనేనని వెల్లడైంది. ఆయనతో చిత్రకు సమ్‌థింగ్‌ స్పెషల్‌ సంబంధం కూడా ఉందని బయటపడింది. అలాగే స్టాక్‌ బ్రోకర్లకు మేలు చేయడానికి స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ సిస్టమ్‌ను సైతం చిత్రా మార్పించారని సీబీఐ అభియోగం మోపింది.

మే 21న సీబీఐ జరిపిన దాడుల్లో బ్రోకర్ల నుంచి కీలక డాక్యుమెంట్లు, పలు సీడీలు, హార్డ్‌ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ హైకోర్టు చిత్రా బెయిల్‌పై నిర్ణయం తీసుకోవాలని సీబీఐకి నోటీసులు జారీ చేసిన మరుసటి రోజే సీబీఐ దేశవ్యాప్తంగా దాడులు చేయడం కలకలం రేపుతోంది.
Tags:    

Similar News