పోరాడితే జాబ్ పోతుంద‌న్న నాయిని

Update: 2018-04-09 04:50 GMT
ఏది ఏమైనా కొన్ని మాట‌లు కొంద‌రు చెబితేనే అందం.. చందం. తెలంగాణ రాష్ట్ర సాధ‌న స‌మ‌యంలో ఉద్య‌మం పేరుతో పుష్క‌ర కాలానికి పైనే తెలంగాణ ప్ర‌జ‌లకు పోరాటాల గురించి గొప్ప‌లు చెప్పిన నేత‌లు.. పోరాట‌మే ఊపిరిగా ప‌ని చేసినోళ్లు అత్యున్న‌త ప‌దవులు వ‌స్తే ఎలా వ్య‌వ‌హ‌రిస్తారు?  వారి నోటి నుంచి వ‌చ్చే మాట‌లు ఎలా ఉంటాయి?  ప‌వ‌ర్ లేన‌ప్పుడు.. పోరాట నాయ‌కులుగా ఉన్న‌ప్పుడు చెప్పే మాట‌ల‌కు.. ప‌వ‌ర్ చేతికి వ‌చ్చిన త‌ర్వాత వ‌చ్చే మాట‌ల‌కు మ‌ధ్య‌న వ్య‌త్యాసాన్ని త‌న మాట‌ల‌తో మ‌రోసారి స్ప‌ష్టం చేశారు తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి.

ఇప్పుడు క‌నిపిస్తున్న నాయిని చూసి కొంద‌రు విమ‌ర్శ‌లు చేయొచ్చు. కానీ.. ఆయ‌న బ్యాక్ గ్రౌండ్ చూస్తే.. ఆయ‌న చేసిన‌న్ని పోరాటాలు అన్ని ఇన్ని కావు. కార్మిక సంఘ నాయ‌కుడిగా.. వారి త‌ర‌ఫున కోట్లాడిన నాయిని తెలంగాణ రాష్ట్రంలో తొలి హోంమంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఒక ఉద్య‌మ నాయ‌కుడు కీల‌క ప‌ద‌విలో ఉన్న‌ప్పుడు ఉద్య‌మాల‌కు ఊతంగా నిలుస్తార‌నుకుంటే త‌ప్పులో కాలేసిన‌ట్లేన‌న్న విష‌యాన్ని త‌న మాట‌ల‌తో మ‌రోసారి ఫ్రూవ్ చేశారు నాయిని.

తాజాగా తెలంగాణ రాష్ట్ర హోంగార్డు వెల్ఫేర్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన అభినంద‌న స‌భ‌లో మంత్రి నాయిని హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగానూ . సంచ‌ల‌నంగానూ మారాయి. తెలంగాణ‌లో పోరాటాలు.. ఉద్య‌మాలు చేసే వారి ప‌రిస్థితిఎలా ఉంటుంద‌న్న విష‌యాన్ని నాయిని త‌న మాట‌ల్లో చెప్పేశారు. ఆయ‌న ఏమ‌న్నారో ఆయ‌న మాట‌ల్లో వింట‌నే అస‌లు విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

ఇంత‌కీ నాయిని ఏమ‌న్నారంటే..‘‘తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరికీ అనుకూలమైంది. ఈ మధ్య కొందరు హోంగార్డులు ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు చేస్తున్నారు. ఎవరూ ఆగం కావద్దు.. ఆగమైతే అడ్రస్‌ లేకుండా పోతారు. హోంగార్డు ఉద్యోగాలు రోస్టర్‌ పద్ధతిలో నియమించినవి కావు. పని మానేసి పోరాటాలు చేస్తే ఉద్యోగం పోతది’’ అని  నాయిని వ్యాఖ్యానించారు. ఉద్య‌మ రాజ‌కీయ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడు.. పోరాటాలు చేసే వారి ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌న్న‌ది నాయిని మాట‌లు స్ప‌ష్టం చేస్తున్నాయ‌ని చెప్పాలి. ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ఎవ‌రైనా మంత్రి నోటి నుంచి వ‌చ్చి ఉంటే..?
Tags:    

Similar News