శాంతిభద్రతల వ్యవహారాలకు పెద్ద దిక్కు హోం మంత్రి.. కానీ కర్ణాటక హో మంత్రి మాత్రం మహిళలపై వేధింపులను లైట్ గా తీసుకుంటున్నారు. ఇదేమీ పెద్ద విషయమేమీ కాదని ఆయన అనడం వివాదాస్పదమైంది. బెంగళూరులో డిసెంబర్ 31 రాత్రి నడిరోడ్డు మీద మహిళలపై లైంగిక వేధింపుల వ్యవహారంలో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. దీంతో కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర.. సమాజ్ వాది పార్టీ ఎమ్మెల్యే అజ్మీకి జాతీయ మహిళ కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) సమన్లు జారీ చేసింది.
ఈ సందర్భంగా మహిళా కమిషన్ వారి విషయంలో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఉన్నత స్థానంలో ఉన్నవారే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే దేశం ఎటువైపు వెళ్తున్నట్లని ఎన్సీడబ్ల్యూ చీఫ్ లలితా కుమార మంగళం ప్రశ్నించారు. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా కొందరు ఆకతాయిలు ఆడవాళ్లను వేధించారు. ఈ ఘటనపై స్పందించిన కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర.. యువత పాశ్చాత్య ధోరణిని అవలంబించడం వల్లే ఆ తరహా ఘటనలు జరుగుతున్నాయని, ఇలాంటి ఘటనలు జరగడం మామూలేనని చెప్పుకొచ్చారు.
మరోవైపు మహిళలు ఎంత తక్కువ దుస్తులు ధరిస్తే అంత ఎక్కువ చదువుకున్న వాళ్లుగా, మోడ్రెన్ ఫ్యాషనబుల్ మాదిరిగా ఫీల్ అవుతున్నారని ఇది భారతీయ సంస్కృతికి మాయని మచ్చ అంటూ సమాజ్‌వాదీ పార్టీ నేత అబూ అజ్మీ వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. దీంతో వీరిద్దరికీ సమన్లు జారీ అయ్యాయి. హోం మంత్రి వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని లలిత కుమారమంగళం అటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/