చేతులారా వేటు వేయించుకున్నారా?

Update: 2018-01-23 17:30 GMT
అధికారంలో ఉన్నంత మాత్రాన ఏం చేసినా న‌డుస్తుంద‌ని అనుకోవ‌టం తప్పే. అందుకు ఫ‌లితంగా కొన్నిసార్లు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. ప్ర‌స్తుతం ఢిల్లీ రాష్ట్ర అధికార‌ప‌క్షం ఇలాంటి ఇబ్బందిక‌ర ప‌రిస్థితినే ఎదుర్కొంటోంది. వివ‌ర‌ణ ఇవ్వాలంటూ రెండుసార్లు కోరిన స‌మ‌యంలో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించి ఉంటే ఇప్పుడు ఎదురైన ప‌రిణామాలు ఎదురయ్యేవి కావ‌ని చెబుతున్నారు.

ఎన్నిక‌ల సంఘం ఇచ్చిన నోటీసుల‌కు స‌మాధానం చెప్ప‌కుండా నిర్ల‌క్ష్యంగా ఉండ‌ట‌మే ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు ప‌డటానికి కార‌ణంగా చెబుతున్నారు. 20 మంది ఆప్ ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేయ‌టంపై రాజ‌కీయంగా పెను దుమారం రేపింది. అన‌ర్హ‌త వేటు విష‌యంలో క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డారంటూ ఆప్  చేస్తున్న‌ ఆరోప‌ణ‌ల్లో ప‌స లేద‌ని చెబుతున్నారు. తాజాగా వేటు విష‌యంపై ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న రావ‌త్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ఆప్ వ్య‌వ‌హారాన్ని ఒక పోలిక‌తో చెప్పిన ఆయ‌న‌.. టూ ప్ల‌స్ టూ.. ఫోర్ అంటూ చెప్ప‌టంతో పాటు.. అన‌ర్హ‌త‌పై ఆమ్ ఆద్మీ పార్టీకి ఈసీ రెండుసార్లు అవ‌కాశాలు ఇచ్చినా వినియోగించ‌లేద‌ని.. నోటీసుల‌కు స‌మాధానం చెప్ప‌కుండా ఉండ‌టం వ‌ల్లే తీవ్ర నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌న్నారు. అన‌ర్హ‌త అంశంపై 20 మంది ఎమ్మెల్యేల‌కు 2017 సెప్టెంబ‌రు 28న మొద‌టిసారి.. న‌వంబ‌రు 2న రెండోసారి నోటీసులు జారీ అయ్యాయ‌ని.. అయితే.. వాటికి ఆమ్ ఆద్మీ పార్టీ బ‌దులు ఇవ్వ‌కుండా కేసుల విచార‌ణ నిలిపివేయాల‌ని కోరింది.

ఈ సాంకేతిక అంశ‌మే క‌ఠిన చ‌ర్య‌ల‌కు తావిచ్చేలా చేసిన‌ట్లుగా చెబుతున్నారు. నోటీసుల‌కు స‌మాధానం చెప్ప‌కుండా ఉండ‌ట‌మే కాదు.. వారు మ‌మ్మ‌ల్ని నిలువ‌రించే ప్ర‌య‌త్నం చేశార‌ని చెబుతూ ఆప్ ఎక్క‌డ త‌ప్పు చేసిందో చెప్పుకొచ్చారు. తొలుత తాము అడిగిన దానికి స‌మాధానం చెప్పి.. త‌ర్వాత వాళ్లు అడిగిదే అడిగితే బాగుండేద‌ని.. కానీ.. అదేమీ చేయ‌కుండా అస‌లు విచార‌ణే వ‌ద్ద‌ని వాదించ‌టం స‌మంజ‌సం కాదు క‌దా? అని రావ‌త్ ప్ర‌శ్నించారు.

రెండుకు రెండు తోడైతే నాలుగే అవుతుంది క‌దా? అని చెప్ప‌టం ద్వారా మామూలు విష‌యాన్ని చేజేతులారా మీద‌కు ఎలా తెచ్చుకున్నారో చూశారా? అన్న‌ట్లుగా రావ‌త్ వ్యాఖ్య‌లు ఉన్నాయి. ఇంత‌కీ ఈ వివాదం లోతుల్లోకి వెళితే.. సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముగిసిన ఆర్నెల్ల వ్య‌వ‌ధిలోనే ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌రిగాయి.

మోడీ స‌ర్కారు దూసుకెళుతుంద‌న్న భావ‌న‌లో ఉన్న వేళ‌.. అనూహ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీని చారిత్ర‌క గెలుపును అందించారు ఢిల్లీ ప్ర‌జ‌లు. అయితే.. రూల్స్ ప్ర‌కారం ఢిల్లీ రాష్ట్ర స‌ర్కారులో ఏడుగురు మంత్రుల‌కు మాత్ర‌మే అవ‌కాశం ఉంది. ఏడుగురికి మంత్రి ప‌ద‌వులు ఇచ్చి.. మ‌రో 20 మంది ఎమ్మెల్యేల‌కు మంత్రి హోదాకు స‌మాన‌మైన పార్ల‌మెంట‌రీ కార్య‌ద‌ర్శులుగా నియ‌మించారు.

దీనిపై కోర్టులో కేసు న‌మోదు కావ‌టం.. ఇలా ప‌ద‌వులు ఇవ్వ‌టం స‌రికాద‌న్న తీర్పుతో 20 మంది ఎమ్మెల్యేల ప‌దవులు ఊడిపోయాయి. అదే స‌మ‌యంలో లాభ‌దాయ‌క ప‌ద‌వుల్ని నిర్వ‌హించారు కాబ‌ట్టి 20 మంది ఎమ్మెల్యేల‌ను అన‌ర్హ‌త వేటు వేయాల‌ని యువ న్యాయ‌వాది ప్ర‌శాంత్ ప‌టేల్ రాష్ట్రప‌తికి కంప్లైంట్ చేశారు. దాన్ని ఆయ‌న సీఈసీకి పంపారు. నాటి సీఈసీ ప్యానెల్ లో జైదీతో పాటు ఈసీలు ఏకే జోతి.. ప్ర‌కాశ్ రావ‌త్ లు విచారించారు. అయితే.. ప్ర‌కాశ్‌ రావ‌త్ బీజేపీ మ‌నిషి అంటూ ఆప్ పార్టీ అధినేత.. ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

దీంతో.. రావ‌త్ ఈ విచార‌ణ నుంచి స్వ‌చ్ఛందంగా త‌ప్పుకున్నారు. జైదీ ప‌ద‌వీ విర‌మ‌ణ నేప‌థ్యంలో జోతి సీఈసీ కావ‌టంతో త‌ప్ప‌నిస‌రిగా రావ‌త్ విచార‌ణ చేయాల్సి వ‌చ్చింది. దాని ఫ‌లిత‌మే.. అన‌ర్హ‌త వేటుగా చెబుతున్నారు. త‌ప్పులు ఎంచే వారు త‌ప్పు చేయ‌కూడ‌ద‌న్న ప్రాధ‌మిక సూత్రాన్ని మ‌ర్చిపోయిన కేజ్రీవాల్ త‌న‌కు తానే నెత్తిన కంప వేసుకున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News